కీచకులకు అండదండలు!?

ABN , First Publish Date - 2021-08-19T16:54:20+05:30 IST

‘మహిళల భద్రత కోసమే..

కీచకులకు అండదండలు!?

లైంగిక వేధింపులకు సూత్రధారి క్రాంతి

అతడి చేష్టలతో రెచ్చిపోయిన ఫజల్‌, శ్రీధర్‌

శ్రీధర్‌ను విచారించిన పోలీసులు

కొనసాగుతున్న విచారణ


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ‘మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తాం. వారం రోజుల్లో విచారణ పూర్తిచేసి నిందతులను న్యాయస్థానంలో హాజరుపరుస్తాం’ 

- దిశ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు సర్కారు చెప్పిన మాటలు ఇవి.

 ఆచరణ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. స్టేట్‌గెస్ట్‌ హౌస్‌లో పారిశుధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుల విషయంలో ప్రభుత్వ తీరే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రాంతి, ఫజల్‌, శ్రీధర్‌ యథావిధిగా గెస్ట్‌హౌస్‌లోని ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. బాధితులు మాత్రం ఠాణా చుట్టూ తిరుగుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ముగ్గురిలో ధీమా పెరుగుతోంది. సీఎంవోలోని ఓ అధికారి అండదండలు ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమీ చేయలేరని ఈ ముగ్గురు నిందితులు గెస్ట్‌హౌస్‌లో కాలర్‌ ఎగురవేస్తున్నారు. తోటి ఉద్యోగుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు ఈనెల తొమ్మిదిన దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


11వ తేదీన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అప్పటి నుంచీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రాంతి, ఫజల్‌, శ్రీధర్‌ను ఇప్పటి వరకు పోలీసు స్టేషన్‌కు పిలించలేదు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. పైగా పోలీసులే గెస్ట్‌హౌస్‌కు వెళ్లి నిందితులను విచారిస్తుండడం గమనార్హం. పోలీసులు తమ వద్దకు వస్తున్నారని, పైగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఇక కేసు ఏమీ ఉండదని నిందితులు వారికి వారే స్వీయ ధ్రువీకరణ చేసుకుంటున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారితో హైదరాబాద్‌ నుంచి పైరవీలు చేయించడానికి వెళ్లిన శ్రీధర్‌ బుధవారం విధులకు హాజరయ్యాడు. అతడ్ని ప్రొటోకాల్‌ సంచాలకుడి చాంబర్‌లో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కొద్దినెలలుగా మహిళలపై లైంగిక వేధింపులు జరగడానికి ప్రధాన సూత్రధారి క్రాంతి అని తెలుస్తోంది. గెస్ట్‌హౌస్‌లో అతడు కొనసాగిస్తున్న వ్యవహారాలే లైంగిక వేధింపులకు దారితీచ్చాయి. గెస్ట్‌హౌస్‌లోకి బయట వ్యక్తులు ఎవరూ వెళ్లకపోవడం, పైగా సాధారణ పరిపాలన విభాగం నుంచి ఆదేశాలు వస్తేనే గదులు కేటాయించడం జరుగుతోంది.


దీనితో ఈ క్రాంతి, శ్రీధర, ఫజల్‌ ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. గెస్ట్‌హౌస్‌ను అడ్డాగా మార్చుకుని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులను ఆశ్రయించిన వారిలో ముగ్గురు మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని గెస్ట్‌హౌస్‌లోని కొందరు వ్యక్తులు బహిరంగంగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని రాతపూర్వకంగా పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. గెస్ట్‌హౌస్‌లో పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నందున ఈ తలనొప్పులు భరించలేక ఓ అధికారి సుదీర్ఘ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఆ అధికారి ధ్రువీకరించడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రాంతి, ఫజల్‌, శ్రీధర్‌తో ప్రొటోకాల్‌ విభాగ సంచాలకుడు విడివిడిగా మాట్లాడినట్టు తెలిసింది. ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం, మొత్తం పెత్తనం ఈ మగ్గురికి అప్పగించడంతో వారి ఆగడాలకు అంతులేకుండా పోయిందని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.   మహిళలను లైంగికంగా వేధించగా, వారు చెప్పిన పనులు చేయాలని ఇతర ఉద్యోగులను మానసికంగా వేధించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతారా? అన్నది చూడాల్సి ఉంది. కేసు నుంచి బయట పడడానికి బాధితులకు ఎంతోకొంత ముట్టజెప్పి తెర వెనుక సిటెల్మెంట్‌ చేసుకోవడానికి కొంతమంది వ్యక్తులను ఈ ముగ్గురు రంగంలోకి దింపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 

Updated Date - 2021-08-19T16:54:20+05:30 IST