ప్రతి పంటకూ మద్దతు ధర

ABN , First Publish Date - 2022-01-18T07:35:17+05:30 IST

ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కల్పిస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎ్‌సపీ)

ప్రతి పంటకూ మద్దతు ధర

  • యూపీ  అసెంబ్లీ పోరు
  • రైతులకు వడ్డీ లేని రుణాలు
  • ఉచితంగా సాగునీటి సదుపాయం
  • అన్నదాతలపై కేసులన్నీ తొలగిస్తాం
  • ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ హామీలు


లఖ్‌నవూ, జనవరి 17: ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కల్పిస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎ్‌సపీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ రైతులకు హామీ ఇచ్చారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన సోమవారం లఖ్‌నవూలో మీడియాతో మాట్లాడారు.  రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, వ్యవసాయ భూములకు ఉచితంగా సాగునీటి సదుపాయం కల్పిస్తామని, చెరకు రైతులకు పాత బకాయిలను 15 రోజుల్లో చెల్లిస్తామని అఖిలేశ్‌ హామీ ఇచ్చారు.


మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరిస్తామని, ఆ ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని చెప్పారు. లఖింపూర్‌ ఖీరీ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిశ్‌ ప్రధాన నిందితుడని సిట్‌ నివేదిక ఇచ్చినా, ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతుల ఆందోళనకు నేతృత్వం వహించిన తేజిందర్‌ సింగ్‌ విక్ర్‌ కూడా మీడియా సమావేశంలో అఖిలేశ్‌ పక్కన ఉన్నారు.


ఇక.. యూపీ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించిన అనేకమంది ప్రముఖులు తెరమరుగైన నేపథ్యంలో వారి వారసుల నేతృత్వం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. యూపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌ సింగ్‌, బీజేపీ నేత లాల్జీ టాండన్‌, ఎస్పీ నేతలు అమర్‌ సింగ్‌, తదితరులు కన్నుమూశారు. ఎస్‌పీ అగ్రనేత ములాయం అనారోగ్యం వల్ల అరుదుగా ప్రజల్లోకి వస్తున్నారు. 




క్రిమినల్స్‌కు ఎస్పీ టికెట్లు: యోగి

సమాజ్‌వాదీ పార్టీ క్రిమినల్స్‌కు ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తోందంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమను గెలిపిస్తే ఆ నేరస్తులందరినీ జైళ్లలో పెడతామని ఘజియాబాద్‌లోని ఓ కార్యక్రమంలో సోమవారం తెలిపారు. కాగా, గోరఖ్‌పూర్‌ జిల్లా నుంచి పోటీ చేస్తున్న రెండో ముఖ్యమంత్రిగా యోగి నిలిచారు. 1971లో నాటి ముఖ్యమంత్రి త్రిభువన్‌ నారాయణ్‌ సింగ్‌ ఇదే జిల్లాలోని మణిరామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో యోగిని బీజేపీయే ‘ఇంటి’కి పంపించిందంటూ అఖిలేశ్‌ ఎద్దేవా చేశారు. 


టికాయత్‌ను కలిసిన బీజేపీ ఎంపీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలు నరేశ్‌ టికాయత్‌, రాకేశ్‌ టికాయత్‌ల మద్దతు కోసం రాజకీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ ఎంపీ సంజీవ్‌ బాల్యన్‌ సోమవారం నరేశ్‌ టికాయత్‌ను ముజఫర్‌నగర్‌లోని సిసౌలీ గ్రామంలో కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు వచ్చానని బాల్యన్‌ మీడియాకు చెప్పారు.


కాగా, ఎస్పీ, ఆర్‌ఎల్డీల కూటమికి తాము మద్దతిస్తున్నామని ఆదివారం ప్రకటించిన నరేశ్‌ టికాయత్‌, ఆ తర్వాత కొద్ది గంటలకే తాము ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదని చెప్పారు. ఇక.. గోవా దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ కొడుకు ఉత్పల్‌ పర్రీకర్‌.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే బీజేపీయేతర పార్టీలన్నీ ఆయనకి మద్దతు ఇవ్వాలని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌లో పిలుపునిచ్చారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న ఉత్పల్‌.. తన తండ్రి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అది తనకు దక్కకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఉత్పల్‌ ఇటీవల ప్రకటించారు.




Updated Date - 2022-01-18T07:35:17+05:30 IST