వివేకా హత్యపై జగన్‌ను అడిగితే బాగుంటుంది: సునీతారెడ్డి

ABN , First Publish Date - 2021-04-02T23:37:03+05:30 IST

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో జరుగుతున్న విచారణపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర మనోవేదన చెందుతున్నారు.

వివేకా హత్యపై జగన్‌ను అడిగితే బాగుంటుంది: సునీతారెడ్డి

ఢిల్లీ: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో జరుగుతున్న విచారణపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర మనోవేదన చెందుతున్నారు. హత్య జరిగి రెండేళ్లు దాటినా ఇంతవరకు హంతకులను పట్టుకోలేదని వాపోయారు. ఈ విషయంపై ఆమె నేరుగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. హత్య కేసుపై జరుగుతున్న విచారణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి పేర్లను కూడా.. తాను హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నానని తెలిపారు. వైఎస్ షర్మిల మద్దతు తమకు ఉందని ప్రకటించారు. అంతేకాదు కుటుంబ సభ్యుల్లో కొందరి మద్దతు కూడా తమకుందని పేర్కొన్నారు. జగన్‌ సీఎంగా ఉన్నా కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదో.. ఆయన్నే అడిగితే బాగుంటుందని సునీతారెడ్డి చెప్పారు.


ఇటీవల కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్‌ పుతెన్‌ పురక్కల్‌‌ను సునీతారెడ్డి కలిశారు. వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరి హస్తం గురించి తనకు కచ్చితమైన అనుమానాలున్నాయని  జోమున్‌ పుతెన్‌ పురక్కల్‌ అన్నారు. హత్య వెనుక లోతైన కుట్ర ఉందన్నారు. త్వరలో మొత్తం సాక్ష్యాధారాలు బయటపెడతామని ప్రకటించారు. సీబీఐ దర్యాప్తు విషయంలో ఆమెకు ఏ విధంగా సహాయం చేయాలి.. సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయమై చర్చించామని చెప్పారు. వివేకా కేసులో కూడా హంతకులకు శిక్షపడేలా చూస్తానని సునీతారెడ్డి జోమున్‌ పుతెన్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2021-04-02T23:37:03+05:30 IST