మాటల్లోనే మద్దతు

ABN , First Publish Date - 2021-11-27T06:37:01+05:30 IST

ఈ రైతు పేరు నారాయణ రెడ్డి. కర్నూలు మండలం తడకనపల్లె. తనకున్న ఎకరన్నర పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. దాదాపు రూ.30వేల దాకా ఖర్చు చేశాడు.

మాటల్లోనే మద్దతు

  1. పంట దిగుబడులన్నిటినీ పట్టించుకోని ప్రభుత్వం 
  2. సజ్జ, వేరుశనగ కొనుగోలుకు సిద్ధమవుతున్న మార్క్‌ఫెడ్‌
  3. పెట్టుబడి కూడా రాదనే ఆందోళనలో రైతులు 


ఈ రైతు పేరు నారాయణ రెడ్డి. కర్నూలు మండలం తడకనపల్లె. తనకున్న ఎకరన్నర పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. దాదాపు రూ.30వేల దాకా ఖర్చు చేశాడు. 30 క్వింటాళ్ల దాకా దిగుబడి అందింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. క్వింటానికి రూ.1850 లభిస్తుందని నెలన్నర నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఇప్పటి దాకా ఉత్తర్వులు ఇవ్వలేదు. అప్పుల బాధ, కుటుంబ అవసరాలతో ఈ రైతు శనివారం కర్నూలు మార్కెట్‌ యార్డుకు మొక్కజొన్నలు తీసుకువచ్చాడు. వ్యాపారులు క్వింటం రూ.1600లకు టెండరు వేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు రూ.1850 వస్తుందేమో అనుకున్న రైతుకు నిరాశే ఎదురైంది. ప్రభుత్వం కొని ఉంటే మరో రూ.10 వేలు వచ్చేవని నారాయణరెడ్డి అన్నారు. 


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 26: జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వ్యాపారులు గ్రామాలకే వెళ్లి రైతుల నుంచి తక్కువ ధరకు మొక్కజొన్నలు కొంటున్నారు. మార్కెట్‌యార్డుకు తీసుకు వస్తేనన్నా ఎక్కువ ధర వస్తుందేమోనని ఆశించిన రైతులకు అక్కడా నిరాశే ఎదురవుతోంది. జిల్లాలో ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు 37,212 హెక్టార్లు. ఈసారి 48,579 హెక్టార్లలో మొక్కజొన్న సాగైంది. కేంద్ర ప్రభుత్వం క్వింటం మొక్కజొన్నలకు మద్దతు ధరను రూ.1850 నిర్ణయించడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న దిగుబడి మార్కెట్‌లోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనడానికి ప్రయత్నించలేదు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని రైతులు అంటున్నారు. మొక్కజొన్న పంటతో పాటు జిల్లాలో దాదాపు 23 రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రస్తుతం సజ్జలు, వేరుశనగల కొనుగోలును ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా పంటలను పట్టించుకోలేదు. జిల్లాలో 69,597 హెక్టార్లలో వరి సాగు చేశారు. మొక్కజొన్న 48,579 హెక్టార్లు, కందులు 63,474 హెక్టార్లు, మినుములు 7,030 హెక్టార్లు, వేరుశనగ 80,929 హెక్టార్లు, ఆముదం 3,929 హెక్టార్లు, మిరప 19,008 హెక్టార్లు, ఉల్లి 15,421 హెక్టార్లు, పత్తి 2,51,894 హెక్టార్లలో సాగయ్యాయి. మొత్తం 5,83,610 హెక్టార్లలో సాగు చేశారు. ప్రభుత్వం ఏటా ఖరీప్‌, రబీ సీజన్లకు ముందు పంట దిగుబడులకు మద్దతు ధరను ప్రకటిస్తుంది. బహిరంగ మార్కెట్‌లో ధర లేనప్పుడు ప్రభుత్వం నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌, సీసీఐ ద్వారా కొంటుంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ పంటలకు మద్దతు ధర ప్రకటించడం వరకే పరిమితమైంది. కరపత్రాలను గోడలకు అతికించి చేతులు దులుపేసుకుంది. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 


ధరలేని పంట ఉత్పత్తులను కొనండి


ఈ ఖరీఫ్‌లో సాగు చేసిన 20 రకాల పంట ఉత్పత్తులలో 10 నుంచి 30 శాతం మాత్రమే కొంటామని ప్రభుత్వం షరతు పెట్టడం రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. వ్యాపారుల నుంచి పూర్తిగా తక్కువ ధర అందుతున్న ఉల్లిగడ్డలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీని వల్ల రాష్ట్రంలోనే అత్యధికంగా ఉల్లి సాగు చేసే జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో క్వింటం ఉల్లిని నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.2వేల దాకా కొంటారు. రూ.300  పలుకుతున్న ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండడంపై చాలా మంది రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం ఈనాం విధానాన్ని అమలు చేస్తున్నామని, దేశంలోని వ్యాపారులంతా ఈ మార్కెట్‌ యార్డుకు వచ్చి పోటీల్లో పాల్గొంటారని, దీనివల్ల అత్యధిక ధర లభించి ఉల్లి రైతులకు గిట్టుబాటు దక్కుతుందని అధికారులు ఎన్నో రకాలుగా రైతులను నమ్మించారు. బహిరంగ వేలానికి స్వస్తి చెప్పారు. అధికారులు చెప్పిన మాటలు నిజమేనని రైతులు ఆశలు పెట్టుకున్నారు. అయితే కర్నూలు యార్డులో కేవలం 5 నుంచి 10 మంది వ్యాపారులు మాత్రమే ఉల్లి కొంటున్నారు. నాణ్యత పేరుతో క్వింటానికి రూ.300 నుంచి 400 కనిష్ఠ ధరను ఇచ్చేందుకు సిద్ధం కావడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. 


మద్దతు గోడలకే పరిమితం


గత సంవత్సరం ప్రభుత్వం పత్తి, మొక్కజొన్న, మినుములు కొంత మేరకు పప్పుశనగలను మాత్రమే రైతుల నుంచి కొన్నది. ఈ సంవత్సరమైనా పండించిన అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదు. కర్నూలు మార్కెట్‌ యార్డులో మద్దతు ధర లభించకపోతే ఏ ఏ పంట ఉత్పత్తులను కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు కొనేదీ పేర్కొంటూ పెద్ద పెద్ద కరపత్రాలను మార్కెట్‌ కమిటీ కార్యాలయాలు, ఏడీఎం కార్యాలయాల గోడలకు అతికించారు. ఇక్కడితో తమ బాధ్యత తీరిందని ప్రభుత్వం అనుకున్నట్లు ఉంది. కేవలం మార్క్‌ఫెడ్‌ ద్వారా సజ్జలు, వేరుశనగ కొనుగోలుకు మాత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లోనే వేరుశనగ క్వింటం 5,500 నుంచి రూ.6వేలకు పైగానే ధర పలుకుతోంది. సజ్జలు క్వింటం రూ.2 వేల నుంచి రూ.2600 దాకా ధర పలుకుతున్నాయి. మార్కెట్‌లో ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సిందిపోయి బహిరంగ మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను కొంటామని ప్రకటించడంపై రైతులు విస్మయానికి గురవుతున్నారు. మార్క్‌ఫెడ్‌ ధర కంటే ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు ఇచ్చే ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. 


సజ్జలు, వేరుశనగ కొనుగోళ్లకు అనుమతి వచ్చింది


ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి వేరుశనగ, సజ్జలు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ నెల 22 నుంచి వీటిని ఆర్‌బీకే కేంద్రాల్లో కొంటాం. రైతులు తమ పంట వివరాలను బ్యాంకు పుస్తకాలను ఆర్‌బీకే కేంద్రాల్లో సమర్పించాలి. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. త్వరలోనే ఈ పంట కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాం. రైతులు ఆందోళన చెందనవసరం లేదు.         


  - నాగరాజు, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌


మొక్కుబడిగా మద్దతు ధర


ఏటా ఖరీఫ్‌, రబీ సీజన్లకు ముందు మద్దతు ధరను ప్రభుత్వాలు ప్రకటిస్తాయి. ఈ సారి అలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వ్యాపారుల చేతుల్లో రైతులు దగా పడుతున్నారు. కర్నూలు మార్కెట్‌యార్డులో ఉల్లికి ఽగిట్టుబాటు ధర అందక రైతులు నష్టపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర ఉన్న పంట ఉత్పత్తులను మాత్రమే కొనడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇది విచిత్రం. మొక్కజొన్నలకు ప్రస్తుతం మార్కెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లేదు. అయినా ప్రభుత్వం కొనడానికి సిద్ధం కాలేదు. ఇది దారుణం.


- రామక్రిష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి



Updated Date - 2021-11-27T06:37:01+05:30 IST