Abn logo
Oct 29 2020 @ 00:56AM

అన్నదాతకు ఆలంబన

ఎంతగా మనం వ్యవసాయం చేస్తున్నా, ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో మన భాగస్వామ్యం 2.5 శాతం మాత్రమే. మరి దాన్ని పెంచాలంటే దళారీలు, ఏజెంట్ల వల్ల సాధ్యమవుతుందా? నాణ్యత పేరుతో మన రైతుల ఉత్పత్తులను విదేశీ ప్రభుత్వాలు వాళ్ల మార్కెట్లోకి రానివ్వడం లేదు. మనం మాత్రం ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకొంటున్నాం. కొత్త వ్యవసాయ చట్టాల పుణ్యమా అని ఇప్పుడు విదేశీ మార్కెట్లలోకి మనం ప్రవేశించగలం.


ప్రపంచంలోనే 12 శాతం భూభాగంలో, అనగా 11 కోట్ల హెక్టార్ల భూమిలో, వ్యవసాయం చేస్తున్న దేశం మనది. కానీ అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయదారుడు వెన్నెముక విరిగిపోయి దీనంగా కాలం వెళ్లదీసే దుస్థితి దాపురించింది. రైతు నడ్డి విరిచే నాయకత్వాలతో, ప్రభుత్వాల చేతిలో ఈ దేశ రైతాంగం ఓడిపోయింది. పెన్ను తయారు చేసేవాడు సబ్బు తయారు చేసేవాడు, బట్టలు తయారుచేసేవాడు, మందులు తయారు చేసేవాడు.. ఇట్లా అందరూ తయారుచేసిన వస్తువుల రేట్లను తామే నిర్ణయించి అమ్ముతున్నారు. మరి ధాన్యం పండించిన రైతు తన ధరను ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాడో అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ గానీ, కంకి కొడవలి గుర్తు పెట్టుకున్న కమ్యూనిస్టు పార్టీ గానీ, కుటుంబాలు నడిపించే పార్టీలు గానీ చెప్పలేకపోయాయి. మరో విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ ఇటువంటి బిల్లు తేవాలని రాజ్యసభలో వాదించారు. ఈ బిల్లు తెస్తామని కాంగ్రెస్‌ కిందటిసారి తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడు అదే బిల్లును మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తే దానిని మిగతా విపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోంది. ఈ సంఘటనతో వీళ్లకు దేశ ప్రజల సంక్షేమం కాక తమ స్వార్థమే ముఖ్యం అనే విషయం మరోసారి స్పష్టమయింది.


దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే ఈ దేశ రైతులకు 2020 సెప్టెంబర్‌ 17న అంటే మరో 73 ఏళ్ల తరువాత మాత్రమే స్వాతంత్య్రం సిద్ధించింది. ఆ రోజున రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకునే స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని పొందారు. తమకు నచ్చిన కార్పొరేట్‌ కంపెనీలతో వాళ్లు పంట కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఎందుకంటే అందుకు అనుగుణమైన బిల్లులు పార్లమెంట్‌ ఆమోదం పొంది చట్టంగా మారాయి. 


‘కనీస మద్దతు ధర (ఎమ్‌.ఎస్‌.పి.)’ పేరుతో రైతులు వాళ్ల పంటకు వారే ధర నిర్ణయించుకోకుండా వేసిన బానిస సంకెళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క దెబ్బతో తెగ్గొట్టారు. నిజానికి ఆయన ప్రధాని అయిన మరుక్షణం నుంచే రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా ఎన్నో ప్రణాళికలు రూపొందించారు, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటిని కొనసాగించారు. వ్యవసాయ ఖర్చుల కింద ప్రభుత్వమే రైతులకు నేరుగా నగదు సహాయం అందించడం ప్రారంభించిన కేంద్రప్రభుత్వం భాజపా ఆధ్వర్యంలోని మోదీ ప్రభుత్వమే.


రైతుల పేరుతో పార్టీలు స్థాపించినవారు, రైతు బిడ్డలమని చెప్పుకొనేవారు రైతు ఓట్లతో గెలిచి రైతన్నకు ఉరితాడును సిద్ధం చేశారు. మార్కెట్‌ యార్డులను సృష్టించి ‘మాయలోల్లను’ చైర్మన్లుగా అందలం ఎక్కించి, వాళ్లకు రాజకీయ పునరావాసం కల్పించి ‘రైతు సొమ్ము’తో వాళ్ల కడుపులో కత్తి గుచ్చే కుట్రలు చేశారు. ఈ కుట్రలన్నింటికీ మోదీ ప్రభుత్వం తాజా వ్యవసాయ చట్టాలతో ముగింపు పలికింది. యూరియా లేకున్నా, గంటల తరబడి లైనుల్లో నిలబడి మందు సంచులు కొనుక్కున్నా, విత్తనాలు బ్లాక్‌లో ఎంత ధరకు అమ్మినా నోరు తెరవకుండా మార్కెట్‌యార్డులో దుర్భర పరిస్థితుల్లో పడిగాపులు పడుతూ తన పంటను అమ్ముకునే దుస్థితి నుంచి రైతుకు ముక్తి కల్పించడమే ఈ బిల్లుల ఉద్దేశం.


వ్యవసాయం చేయడమే రైతు పని. కానీ మార్కెట్‌ మాయాజాలం రైతును నిండా ముంచేసింది. ప్రకృతి విపత్తులను జయించి ఎంతో కష్టపడి తన పంట మార్కెట్‌కు తీసుకొచ్చి కుప్ప పోసుకుని కూర్చుంటే మార్కెట్‌ యార్డుకు 1 శాతం పన్ను, ఏజెంట్‌కు 2 శాతం, మిత్తి 2 శాతం చెల్లించాలి. నిజానికి దీనికి రెండింతలు వసూలు చేస్తున్నారు. 


అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు, పంట నష్టం, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, రవాణా వంటి అనేక సమస్యలను, మానసిక ఒత్తిళ్లను తట్టుకువస్తే, తరుగు పేరుతో ధాన్యం గుంజుకోవడం, దండె గొట్టడం, సంచుల కొరత, ధాన్యం తడిసి పాడవ్వడం, ఏజెంట్ల జబర్దస్తీ వంటి దుర్మార్గాలకు తావు లేకుండా రైతుల కన్నీళ్లు తుడవటానికే మోదీ సర్కార్‌ ఈ చట్టాలను తీసుకువచ్చింది.


ఆరుగాలం కష్టపడి పండించిన గోధుమలను అమ్మితే కిలోకు 20 రూపాయలు లభిస్తాయి. అది హోల్‌సేల్‌ వాళ్లు కొంటే 30 రూపాయలు అవుతుంది. పిండిగా మారి ప్యాకెట్‌ అయితే 60 రూపాయలు అవుతుంది. కిలో కందులకు రైతుకు లభించేది నలభై రూపాయిలయితే, అది పప్పుగా మార్చి అమ్ముకునే వ్యాపారికి 90 రూపాయలు లభిస్తాయి. టమోటాల రైతుకు కిలోకి దక్కేది పండిస్తే 2 రూపాయలు. అది సాస్‌గా మారితే 100 రూపాయలు. జొన్నలు రైతులకు కిలోకు 16 రూపాయలే దక్కుతుంటే, హోల్‌సేల్‌లో 25 రూపాయలు, పిండిగా మార్చి అమ్మితే 120 రూపాయలు లభిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం?


మన దేశంలో విరివిగా పండే బత్తాయి, నారింజ వంటి వాటిని ఒక్కో పండు ఒక్క రూపాయికే అమ్ముకోవాలి. అదే మార్కెట్‌లో 10 రూపాయలకు ఒక్కటి కాగా, హోల్‌సేల్‌గా 25, జ్యూస్‌గా మారితే 50 రూపాయలకు పెరగడం విచిత్రం. కష్టపడి పండించిన వాడికీ సుఖం లేదు, కొని తిన్నవాడికీ సుఖం లేదు. ఈ దుర్మార్గపు విధానాల వల్ల దళారులు అధికార పార్టీల తాబేదార్లుగా మారి రైతుల రక్తాన్ని నల్లుల్లా పీల్చేస్తున్నారు. ఆ దళారీ వ్యవస్థ నుంచి ఈ బిల్లులు శాశ్వతంగా విముక్తిని కలిగిస్తాయి.


2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశ ప్రజల్లో 52 శాతం ప్రజలు ఏదోరకంగా వ్యవసాయంతో సంబంధం కలిగి ఉన్నారు. 365 రోజులూ సెలవు లేకుండా పని చేసే రైతుల జీడీపీ భాగస్వామ్యం 17-18 శాతం మాత్రమే. రైతుల సంపాదన సంవత్సరానికి 64 వేలు మాత్రమే.. ఎంత ఆశ్చర్యం! కేవలం 2019లోనే 10,281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం దేనికి సంకేతం? మహారాష్ట్రలో 3,927 మంది రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాంగ్రెస్‌ ఎక్కువ కాలం పాలించిన మహారాష్ట్ర రైతు ఆత్మహత్యల్లో మొదటిస్థానంలో ఉండటం మరింత విచిత్రం. ఎన్‌సిఆర్‌బి రిపోర్టు ప్రకారం తెలంగాణలో 499 మంది రైతులు చేసుకున్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల్లో ఐదోస్థానంలో నిలిచింది. అంతేకాక, స్వప్రయోజనాల కోసం తలకు మించిన భారంతో ప్రాజెక్టులు నిర్మించి, వరి పంటను ఎక్కువ పండించడం వల్ల రాష్ట్రం మరోరకంగా అధోగతిపాలు కానున్నది. ఇప్పటికే మన దేశంలో వరి, గోధుమలు కావల్సినంతగా గిడ్డంగుల్లో ఉన్నాయి.


52 శాతం వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న దేశంలో 1 శాతం మాత్రమే రైతుగా ఉండాలని మలితరం కోరుకుంటున్నది. వ్యవసాయదారుల పిల్లలకు ఎవరూ పిల్లనివ్వడం లేదు. ఈ దుస్థితి నుంచి రైతులను కాపాడేందుకే జస్టిస్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సూచించినట్లు ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం ఎక్కువగా మద్దతు ధర లభించడం కోసం, అదీ రైతుల హక్కుగా ఉండడం కోసం మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఈ బిల్లులను తెచ్చింది.


ఏజెంట్ల బెదిరింపులకు భయపడకుండా రైతు ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా ఆఖరుకు విదేశాల్లోనైనా తన పంటను అమ్ముకోవచ్చు. మార్కెట్‌యార్డుల్లో పాతుకుపోయిన దళారీల నుంచి రైతుకు పూర్తి రక్షణ, స్వేచ్ఛ లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న చట్టాల వల్ల ఒక గ్రామ రైతు తనకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఇతర రాష్ట్రాల్లో ధర ఎక్కువగా ఉన్నా అమ్ముకోలేని దుస్థితి. ఇప్పుడు ఎలాంటి రుసుం లేకుండా ఎక్కడికైనా వెళ్లి అమ్ముకోవచ్చు. ఉదాహరణకు కాంగ్రెస్‌ హయాంలో 2011 లో బిపిటి వడ్ల ధర మనరాష్ట్రంలో క్వింటాలు 800 రూపాయలు ఉంటే పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటకలలో 1200 రూపాయలు ధర ఉంది. కానీ ఆ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రైతులు కూడా అక్కడికి వెళ్లి అమ్ముకోలేని దుస్థితి. దాంతో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించగా, ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి అనుమతించింది. అప్పుడు మన రాష్ట్ర రైతులకు సుమారు 3 వేలకోట్ల రూపాయల లాభం వచ్చింది.


ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేకుండా కార్పొరేట్‌ కంపెనీలతో రైతు నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. పొలం దగ్గరికే వచ్చి నేరుగా ఆయా కంపెనీలు రైతు చెప్పిన ధరకే కొనుక్కోవాలి. ఎలాంటి బలవంతం ఉండదు. రైతు కార్పొరేట్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాక మధ్యలో ధర పెరిగితే ఇంకోచోట అమ్ముకోవచ్చు. లేదా అదే సంస్థ పెరిగిన ధర ఇవ్వొచ్చు. రైతుకు ఎలాంటి శ్రమా ఉండదు. రైతు ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలనుకుంటే వడ్డీ లేకుండా అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు రైతు తిరిగిస్తే చాలు. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినచోట స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతే నిర్ణయాధికారి. ఈ క్రమంలో రైతుకు నష్టం జరిగితే ఆ కార్పొరేట్‌ కంపెనీయే ఒకటిన్నర శాతం నష్టం భరించాలి. రైతు మాత్రం సులభంగా పక్కకు జరిగిపోవచ్చు.


ఒకవేళ వీళ్లిద్దరి మధ్య ఏదైనా వివాదం వస్తే జిల్లా కలెక్టర్‌ 15 రోజుల్లో తేల్చేయాలి. కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతుదే తప్పయినప్పటికీ ఎలాంటి జరిమానా కట్టకుండా ఒప్పందం రద్దు చేసుకోవచ్చు. ఒప్పందం చేసుకున్న కంపెనీలు రైతులకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి. అయితే రైతు పొలంపై ఈ కంపెనీలకు ఎలాంటి హక్కు ఉండదు. 


ఇప్పుడు ప్రతి రైతు కుటుంబంలో స్మార్ట్‌ ఫోన్లు ఉంటున్నందున దాని ద్వారా ఆన్‌లైన్‌లో ధరలు తెలుసుకోవచ్చు. బేరం మాట్లాడుకొని ఎక్కడైనా తనకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. 


ఎంతగా మనం వ్యవసాయం చేస్తున్నా, ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిలో మన భాగస్వామ్యం 2.5 శాతం మాత్రమే. మరి దాన్ని పెంచాలంటే దళారీలు, ఏజెంట్లు పెంచగలరా! నాణ్యత పేరుతో మన రైతుల ఉత్పత్తులను విదేశీ ప్రభుత్వాలు వాళ్ల మార్కెట్లోకి రానివ్వడం లేదు. మనం మాత్రం ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకొంటున్నాం. కొత్త వ్యవసాయ చట్టాల పుణ్యామా అని ఇప్పుడు విదేశీ మార్కెట్లలో మనం ప్రవేశించగలం. హెజనిక్‌ క్వాలిటీని ఇవ్వగల పెట్టుబడులు పెట్టే మదుపర్లను ఈ మార్కెట్‌లోకి దింపకపోతే రైతులు వ్యవసాయాన్ని కూడా విడనాడక తప్పదు. రోజురోజుకు కునారిల్లిపోతున్న వ్యవసాయం మరింత అగాథంలోకి వెళ్లడం ఖాయం. 


రైతు అనుమతి లేకుండా పొలంలో ఎలాంటి నిర్మాణం చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేసినా ఒప్పందం ముగిశాక ఆ కట్టడాన్ని మదుపు చేసిన వ్యక్తి లేదా సంస్థ సొంత ఖర్చుతో దాన్ని తొలగించాలి. తొలగించకుంటే ఆ కట్టడం రైతు సొంతమవుతుంది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు ‘కనీస మద్దతు ధర’ పేరుతో జరుగుతున్న భయంకర మోసానికి కొత్త చట్టాలతో అడ్డుకట్ట పడనుంది. గోనె సంచుల పేరుతో రైతులను దగా చేస్తున్నారు. ఇకమీదట వారికి ఆ ఇబ్బంది ఉండదు. వారు పండించే పప్పుధాన్యాలు, సజ్జ, రాగి, మినుము, పండ్లు, చేపలు, కూరగాయలు, గుడ్లు, పాలు, అన్నీ ఇప్పుడు స్వేచ్ఛగా తమకు నచ్చిన ధరకు అమ్ముకోవచ్చు. రైతు తెలంగాణ నుంచి వెళ్లి తనకు తగిన లభిస్తే మధ్యప్రదేశ్‌లో అమ్ముకోవచ్చు. ఎలాంటి దళారీలు, ట్యాక్స్‌లు, ఏజెంట్లు, దండెగొట్టడం, తరుగు వంటివేమీ ఉండవు. అమ్ముకోవడానికి వెళ్లిన రాష్ట్రానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.


ఇప్పుడు నిరంతరం జాతీయ, అంతర్జాతీయ ధరల పట్టికలు రైతులకు తెలిసేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఒక్కో రాష్ట్రం ఏటా 5 వేల కోట్లు రైతుల నుంచి ట్యాక్స్‌లుగా ముక్కు పిండి వసూలు చేసి మార్కెట్‌ యార్డులను మేపుతున్నది. ఇప్పుడు రైతులకు ఆ బాధ లేదు. మార్కెట్‌ యార్డు గూండాగిరి ఇక ఉండదు. రైతు అమ్ముకొన్న పంటకు లేదా ఇతర వస్తువులకు అమ్మిన రోజే సాయంత్రం వరకు డబ్బు చెల్లించాలి. మార్కెట్‌లో అమ్మినా అదే రోజు ధర డబ్బులు చెల్లించకపోతే ఏజెంట్ల లైసెన్సు రద్దు అవుతుంది. ‘రైతును రాజు’గా చేసే ఈ బిల్లులకు మద్దతు తెలుపుదాం, రైతును బ్రతికిద్దాం.

బండి సంజయ్‌

(అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ,- తెలంగాణ)

Advertisement