ప్రజాకళలకు అండ

ABN , First Publish Date - 2021-05-15T06:00:19+05:30 IST

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, శంకరం వేదిక అధ్యక్షులు కామ్రేడ్ యలవర్తి రాజేంద్రప్రసాద్ మే 13న మరణించడం తీరనిలోటు. 1974లో ఉస్మానియా....

ప్రజాకళలకు అండ

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, శంకరం వేదిక అధ్యక్షులు కామ్రేడ్ యలవర్తి రాజేంద్రప్రసాద్ మే 13న మరణించడం తీరనిలోటు. 1974లో ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిగా ఆనాటి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో భాగమవడమే గాక, అక్కడే నిర్మితమైన అరుణోదయ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ జీవితాంతం ప్రజా కళారంగాలకు అండగా నిలబడుతూ వచ్చారాయన. తను వ్యక్తిగత వ్యాపారాల్లో కొనసాగుతున్నా, మార్కిస్టు లెనినిస్టు రాజకీయ విశ్వాసాలను అభిమానిస్తూ ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడేవారు.


అరుణోదయ సంస్థలన్నీ ఐక్యం కావాలని, విప్లవ సంస్థల మధ్య ఐక్యత నెలకొనాలని ప్రగాఢంగా ఆకాంక్షించేవారు. రెండేళ్ల క్రితం అరుణోదయ రామారావు అమరత్వం తర్వాత, ఆయన పేరిట స్మారక పురస్కారాన్ని ఏర్పరచి తొలి పురస్కారాన్ని నాకు అందించి, ఎంతో సంతృప్తి, బాధ్యత కనబరిచారు. జార్జిరెడ్డి 40వ వర్ధంతి కార్యక్రమంలో (2012 ఏప్రిల్) నా పాటకు తన్మయత్వం చెందడమే గాకుండా జార్జి సహచరులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ఆయన సహకారం ఎంతో ఉంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సలహాదారు డా. శ్రీనాథ్‌రెడ్డి లాంటి జార్జి సహచరులు ఎంతోమంది ఆ వేదికను అలంకరించారు.


జార్జిరెడ్డి 50వ వర్ధంతిని మరింత ఘనంగా, ఐక్యంగా జరపాలని ఆకాంక్షించిన రాజేంద్రప్రసాద్ ఇక లేరన్న వార్త తీవ్ర వేదన కలిగిస్తున్నది. గుంటూరు జిల్లా అప్పికట్లలో జన్మించిన రాజేంద్రప్రసాద్‌, తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలబడి 2012లో జరిగిన ‘‘మిత్ర- జనం పాటల సవ్వడి’’ కార్యక్రమ బాధ్యతలను కూడా తన మీద వేసుకున్నారు. గౌరీశంకర్ ప్రచురించిన ‘మిత్ర పర్వం’ పుస్తక ప్రచురణ బాధ్యతను తీసుకున్నారు. రాజేంద్రప్రసాదన్న జీవిత సహచరి ధనలక్ష్మి, కూతురు గమన, కుమారుడు నయన్ తేజలకు నా ప్రగాఢ సానుభూతి. మానవతావాది, ప్రజాకళాభిమానికి ఘన నివాళులు. జోహార్ యలవర్తి రాజేంద్రప్రసాద్.


విమలక్క

గౌరవ అధ్యక్షురాలు, 

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య

Updated Date - 2021-05-15T06:00:19+05:30 IST