బలహీనుల గొంతుక

ABN , First Publish Date - 2021-02-18T06:06:32+05:30 IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో పంచుకున్న ‘టూల్‌కిట్‌’ వివాదంలో భారతదేశానికి చెందిన పర్యావరణ కార్యకర్త దిశా రవిని అరెస్ట్‌ చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయింది. ఇదే

బలహీనుల గొంతుక

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ ట్విట్టర్‌లో పంచుకున్న ‘టూల్‌కిట్‌’ వివాదంలో భారతదేశానికి చెందిన పర్యావరణ కార్యకర్త దిశా రవిని అరెస్ట్‌ చేసిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయింది. ఇదే వివాదంపై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసిన ఇద్దరిలో న్యాయవాది నిఖితా జాకబ్‌ ఒకరు. వివిధ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న నిఖిత సమాజంలోని వివక్షతలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. 


మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన నిఖితా జాకబ్‌ న్యాయవాది, పర్యావరణ కార్యకర్త. ‘అణగారినవర్గాల వారికి అండగా నిలవడమే నా లక్ష్యం’ అని చెబుతున్న ఆమె బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. పుణేలోని ఐఎల్‌ఎస్‌ లా కాలేజీలో ఆమె న్యాయవిద్య పూర్తి చేశారు. మహారాష్ట్ర, గోవా బార్‌ కౌన్సిల్స్‌లో న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. ఏడేళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్న ఆమె ప్రస్తుతం ఎస్‌కె లీగల్‌ అసోసియేట్స్‌లో సీనియర్‌ అసోసియేట్‌ (న్యాయవాది)గా, తత్వా లీగల్‌ సంస్థలో అసోసియేట్‌గా పని చేస్తున్నారు. కేవలం సివిల్‌ కేసులు మాత్రమే వాదించే నిఖిత వృత్తి నిబద్ధత, మంచి పనితీరు కనబరిచే న్యాయవాది అనీ, ఆమె ఇటువంటి క్రిమినల్‌ కేసు ఎదుర్కోంటారని ఏనాడూ ఊహించలేదనీ ఆమె సీనియర్‌ అడ్వకేట్లు అంటున్నారు. 


ముప్ఫయ్యేళ్ళ నిఖితకు సామాజిక అంశాలపై స్పందించడం కొత్త కాదు. అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమమైన ఎక్స్‌టింక్షన్‌ రెబెలియన్‌ (ఎక్స్‌ఆర్‌)లో రెండేళ్ళ నుంచి వాలంటీర్‌గా ఆమె పని చేస్తున్నారు. ఎక్స్‌ఆర్‌... వాతావరణ మార్పులకు దారితీసే చర్యలపై అహింసాయుతమైన శాసనోల్లంఘన కార్యక్రమాల ద్వారా నిరసనలు తెలిపే ఉద్యమకారుల బృందం. రైతుల ఉద్యమానికి మద్దతు కూడగట్టడం కోసం టూల్‌కిట్‌ రూపకల్పన వెనుక ప్రధాన పాత్ర ఎక్స్‌ఆర్‌ ఇండియా కార్యకర్తలదేననీ, ఇదంతా ‘దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర’ అనీ పోలీసుల ఆరోపణ. అలాగే ఖలిస్తాన్‌ ఉద్యమానికి మద్దతిచ్చే ‘పొయెటిక్‌ జస్టిస్‌ పౌండేషన్‌’తో నిఖితకు సంబంధాలున్నట్టు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు.  


నిఖిత నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తి అనీ, ఆత్మవిశ్వాసం కలిగిన న్యాయవాది అనీ, ఆమెకు ఏ రాజకీయ పార్టీతోనూ, రాజకీయ సంస్థలతోనూ సంబంధం లేదనీ ఆమె సన్నిహితులూ, సహ న్యాయవాదులూ చెబుతున్నారు. ‘‘ఆమె పర్యావరణ ఉద్యమకారిణి. ఎవరి ప్రోద్బలం, ప్రభావం ఆమెపై లేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో ఆమెకు సంబంధం ఉందన్నది నిజం కాదు. అనేక కార్యక్రమాల్లో, పోరాటాల్లో తన అభీష్టం మేరకే పాల్గొంటూ వస్తున్నారు’’ అని వారు అంటున్నారు. టూల్‌కిట్‌ తయారీలో, గణతంత్ర దినోత్సవం రోజున హింసాత్మక ఘటనలకు కారణంగా అనుమానిస్తున్న తప్పుడు సమాచారం వ్యాప్తిలో, ఆ క్రమంలో జరిగిన ‘జూమ్‌’ మీటింగ్‌ నిర్వహణలో దిశ రవి, నిఖిత తదితరుల పాత్ర ఉందంటున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఆరోపణలపై నిఖిత స్పందిస్తూ ‘‘ఆ టూల్‌కిట్‌ ప్రధానంగా రైతు సమస్యల మీదే దృష్టి కేంద్రీకరించింది. అది కేవలం సమాచారం అందించేది మాత్రమే. హింసను ప్రేరేపించడానికి ఉద్దేశించింది కాదు. అది రైతుల ప్రస్తుత స్థితిగతుల మీదా, వారి భయాల మీదా ఒక విస్తృతమైన దృక్పథాన్ని అందిస్తుంది. అసంతృప్తిని వెల్లడించే హక్కు అందరికీ ఉంది. ఇది పూర్తిగా ప్రజాస్వామిక చర్య’’ అని ఆమె ప్రకటించారు. అంతకుముందు, ప్రత్యేక పోలీసుల బృందం ఆమె ఇంటిని సోదా చేసి, ల్యాప్‌టాప్‌నూ, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలనూ స్వాధీనం చేసుకుంది. ఆమె అప్పటి నుంచీ అజ్ఞాతంలో ఉన్నారు.  టూల్‌కిట్‌ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు ఆమెపై నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. పోలీసుల చర్యల నుంచి తనకు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ ముంబాయి హైకోర్టును నిఖిత ఆశ్రయించారు. ఆమెకు మూడువారాల ట్రాన్సిట్‌ బెయిల్‌ను న్యాయస్థానం బుధవారం మంజూరు చేసింది. 


సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ తనకు ప్రాధాన్యతా అంశాలని పేర్కొనే నిఖిత న్యాయం కోసం నిలబడడాలన్నది తన ఆశయమని చెబుతారు. రచనలు చేయడం, పాటలు పాడడం అంటే ఆమెకు మక్కువ. ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌ కూడా. వంటలు చేయడం మరో అభిరుచి. ‘‘ఏ వయసు వారైనా, ఎలాంటి నేపఽథ్యం ఉన్న వ్యక్తులతోనైనా నేను సులువుగా కలిసిపోతాను. సమాజంలో ఎలాంటి వివక్షనూ నేను సహించలేను. నేను విమర్శనాత్మకంగా ఆలోచిస్తాను. కఠినమైన వాస్తవాలనూ, సమాచారాన్నీ అటు తార్కికంగానూ, ఇటు భావోద్వేగపరంగానూ విశ్లేషించి ఒక నిర్ణయం తీసుకుంటాను’’ అని చెబుతారామె. ఫ


ఆ టూల్‌కిట్‌ ప్రధానంగా రైతు సమస్యల మీదే దృష్టి కేంద్రీకరించింది. అది కేవలం సమాచారం అందించేది మాత్రమే. హింసను ప్రేరేపించడానికి ఉద్దేశించింది కాదు. రైతుల ప్రస్తుత స్థితిగతుల మీదా, వారి భయాల మీదా ఒక విస్తృతమైన దృక్పథాన్ని అందిస్తుంది. అసంతృప్తిని వెల్లడించే హక్కు అందరికీ ఉంది. 

Updated Date - 2021-02-18T06:06:32+05:30 IST