ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు

ABN , First Publish Date - 2022-01-25T08:43:30+05:30 IST

పీఆర్సీ జీవోల రద్దుకు ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రకటించింది.

ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు

ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం 

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ జీవోల రద్దుకు ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రకటించింది. వీఆర్‌ఏల వేతనాన్ని రూ.21 వేలకు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంఘం అధ్యక్షుడు ఎన్‌.పెద్దన్న, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 25వేల మంది వీఆర్‌ఏలు పనిచేస్తున్నారని, తమకు వేతనాలు 21వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ పీఆర్సీలో వీఆర్‌ఏల వేతన అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారని, ఏపీ నివేదికలో ఆ అంశాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. వేతనాలు పెంచాలన్న వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘం నేతలు పేర్కొన్నారు.


నిరుద్యోగుల జేఏసీ మద్దతు

ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి నిరుద్యోగ జేఏసీ మద్దతు తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని ఉద్యోగ సంఘాలు, ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ తదితర ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరడంపై హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 


సమ్మెలో పాల్గొనండి: మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం

పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమ కార్యాచరణలో మహిళా, శిశు సంక్షేమ శాఖల ఉద్యోగులు అందరూ పాల్గొనాలని ఆ శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీకాంతరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.


జీవోలు రద్దు చేసి చర్చలకు పిలవాలి

ఉద్యోగులకు నమ్మకం కలిగించేలా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూధన రాజు, కన్వీనర్‌ కోన దేవదాసులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్‌సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉద్యోగులు ఆశించినట్టుగా లేవన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్న జీవోలన్నింటినీ తక్షణం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాలను మళ్లీ చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. సమ్మె చేసే పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలన్నీ పనిచేయవని కళ్లేపల్లి హెచ్చరించారు.


సీపీఎస్‌ రద్దు సమ్మెలో చేర్చడం హర్షణీయం

ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధనలో భాగంగా ప్రభుత్వానికి అందజేసిన సమ్మె నోటీసులో సీపీఎస్‌ రద్దు సమస్యకూ ప్రాధాన్యతను ఇచ్చి 2వ అంశంగా చేర్చినందుకు పీఆర్సీ సాధన సమితికి ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అప్పలరాజు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-01-25T08:43:30+05:30 IST