అన్నదాతను ఆదుకోరూ...!

ABN , First Publish Date - 2022-01-20T03:54:47+05:30 IST

ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తున్న అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర జేసింది. మంచి దిగుబడి వస్తుందని సంబరపడ్డ రైతన్న ఆశలు అకాలవర్షాలతో అడియాసలయ్యాయి. అకాల వర్షాలకు రైతుల రెక్కల కష్టం నీటి పాలైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు ఎనలేని నష్టం కలిగించాయి.

అన్నదాతను ఆదుకోరూ...!

అకాల వర్షాలకు నీట మునిగిన పంటలు

జిల్లాలో 118 ఎకరాల్లో నష్టం

అంచనాలు రూపొందించిన వ్యవసాయశాఖ

ప్రకృతి వైపరీత్యానికి అన్నదాత విలవిల

మంచిర్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తున్న అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర జేసింది. మంచి దిగుబడి వస్తుందని సంబరపడ్డ రైతన్న ఆశలు అకాలవర్షాలతో అడియాసలయ్యాయి. అకాల వర్షాలకు రైతుల రెక్కల కష్టం నీటి పాలైంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు ఎనలేని నష్టం కలిగించాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ప్రకృతి  విలయతాండవం చేసింది. సెప్టెంబర్‌లో అధిక వర్షాల కారణంగా వివిధ ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌ పంట చేలు, పొలాల్లోకి చేరగా, ప్రస్తుతం అకాల వర్షాలు అన్నదాతపై విరుచుకుపడ్డాయి. అప్పుడు నీటిలో మునిగిన పంటను కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లాలో ఇటీవల రెండు రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా ఆరు మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అధికారుల అంచనా మేరకు కోతకు వచ్చిన కూరగాయలు, మొక్కజొన్న, జొన్న, గింజ దశలో ఉన్న పంటలు, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. 

పంట నష్టం ఇలా...

అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 118 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని జన్నారం, దండేపల్లి, కాసిపేట, తాండూర్‌, చెన్నూరు, హాజీపూర్‌ మండలాలకు చెందిన 125 మంది రైతులకు సంబంధించిన పంటకు నష్టం వాటిల్లింది. వివిధ మండలాల్లో కలిగిన నష్టం వివరాలు ఇలా ఉన్నాయి...

మండలం    నష్టం ఎకరాల్లో       రైతుల సంఖ్య

------------------------------------------------------------------

జన్నారం 17.2 24

దండేపల్లి 15 12

కాసిపేట 36 32

తాండూరు           15          21

చెన్నూరు 30 32

హాజీపూర్‌ 4 4

------ ------------

మొత్తం              117.2    125

--------- ------------

పరిహారం అందేనా...?

అకాల వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన పంటకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఏపుగా పెరిగిన పంట ఒక్కసారిగా వరద పాలు కావడంతో రైతులు విలవిలలాడుతున్నారు. అప్పో, సప్పో చేసి సాగు చేస్తే ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట పూర్తిగా వానల పాలైందని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు పంట నష్టం అంచనా వేసినందున ప్రభుత్వం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. సెప్టెంబరులో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంటకు నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నష్టపరిహారం అందలేదు. అప్పుడు కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో 3183 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన 1918 మంది రైతులకు సంబంధించిన సుమారు రూ. 94 లక్షల విలువ గల పత్తి, వరి, కంది పంటలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లింది. అయినా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోగా ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా పరిస్థితి పునరావృతం అయి రూ. 73 లక్షల 7వేల 77 విలువ గల పంటకు నష్టం కలిగింది. 

ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం

వ్యవసాయశాఖ జిల్లా అధికారి వినోద్‌కుమార్‌

అకాల వర్షాల కారణంగా జిల్లాలో పంట నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు తయారు చేసి కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి పంపించాం. ఫైనల్‌ రిపోర్టును కూడా తయారు చేస్తున్నాం. సెప్టెంబరులో జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బాధిత రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతుల పక్షాన అంచనాలు రూపొందించి ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ కమిషనర్‌కు పంపిస్తున్నాం.


Updated Date - 2022-01-20T03:54:47+05:30 IST