మోదీ-షాను ఢీకొనే ధైర్యం వారికుంది: డిగ్గీ

ABN , First Publish Date - 2020-07-11T21:58:03+05:30 IST

జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శక్తివంతమైన వైఖరి అవలంభిస్తున్నారని..

మోదీ-షాను ఢీకొనే ధైర్యం వారికుంది: డిగ్గీ

న్యూఢిల్లీ: జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శక్తివంతమైన వైఖరి అవలంభిస్తున్నారని, మోదీ-షా ద్వయాన్ని ఢీకొనే ధైర్యం వారికి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశం, ఉత్తరప్రదేశ్ ప్రయోజనాల విషయంలో రాహుల్, ప్రియాంక అనుసరిస్తున్న వైఖరిని వ్యక్తిగతంగా తాను బలపరుస్తున్నానని, కాంగ్రెస్‌లో ఉన్న ఎవరైనా నేతలు దీనితో విభేదిస్తే వారు కాంగ్రెస్‌లో ఉండి ప్రయోజనం ఏమిటని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


'ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని భయపెట్టవచ్చనే అపోహలో మోదీ-షా ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడిని కుటుంబం వారిది. ఏళ్ల తరబడి  జైళ్లలో గడిపారు. వారికి ధైర్యం చాలా మెండు. ఇప్పటికైనా మోదీ-షాలు తమ భ్రమల నుంచి బయటపడాలి' అని దిగ్విజయ్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్‌ను పునః పటిష్టం చేయాలనే సవాలును సమర్ధవంతంగా అధినాయకత్వం ఎదుర్కోవాలని, ఇందుకోసం రాహుల్, ప్రియాంక వంటి సాహసనేతల అవసరం పార్టీకి ఉందని దిగ్విజయ్ అన్నారు. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కోగలగే దమ్ము, ధైర్యం రాహుల్, ప్రియాంకకు ఉన్నాయని తాను నిశ్చయంగా చెప్పగలనని అన్నారు. రాహుల్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో కాదనే వారెవరూ లేరని కూడా ఆయన పేర్కొన్నారు.


'2019లో మోదీకి సవాలుగా రాహుల్ నిలిచారు. ఏఐసీసీ అధ్యక్షుడు గానో, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేతగానో ఉంటూ ఆయన పార్టీని పటిష్టం చేస్తూ ముందుకెళ్లాలి. ఆయన ఎందుకు స్వచ్ఛంధంగా పోరాటం నుంచి ఎందుకు తప్పుకోవాలి?' అని దిగ్విజయ్ ప్రశ్నించారు.


చిదంబరం భేష్...

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంపై దిగ్విజయ్ ప్రశంసలు కురిపించారు. బీజేపీ ప్రభుత్వం అనేక అభియోగాలు మోపి జైలుకు పంపినా చిదంబరం తల వంచలేదని అన్నారు. 'సోనియా, రాహుల్, ప్రియాంక ముందు ఇప్పుడు పలు సవాళ్లున్నాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు కూడా. కాంగ్రెస్ పార్టీలోని యువకులు, సీనియర్లు ప్రతి ఒక్కరూ మీకు అండగా ఉంటారు. మీరు కోరితే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు. రాహుల్ జీ... దయచేసి పార్టీకి సారథ్యం వహించి ముందుకు నడపండి' అని దిగ్విజయ్ మరో ట్వీట్‌లో కోరారు.

Updated Date - 2020-07-11T21:58:03+05:30 IST