పెత్తనమంతా గోదావరి బోర్డుదే!

ABN , First Publish Date - 2021-04-17T09:32:31+05:30 IST

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల పర్యవేక్షణాధికారాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు

పెత్తనమంతా గోదావరి బోర్డుదే!

పోలవరం, కాళేశ్వరంపై పర్యవేక్షణ

2 రాష్ట్రాల్లోని ‘గోదారి’ ప్రాజెక్టులన్నిటిపైనా 

ఢిల్లీలో జీఎంఆర్‌బీ చైర్మన్‌తో జలశక్తి, జలసంఘం అధికారుల భేటీ

బోర్డు పరిధి దాదాపు ఖరారు

నీటి కేటాయింపులు కేంద్రం చేతిలోకి!

అడ్డుకోకుంటే రాష్ట్రాలు నామమాత్రమే

చుక్కనీటికీ అడుక్కోవలసిందే

రాష్ట్రప్రభుత్వాలకు నిపుణుల హెచ్చరిక


అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల పర్యవేక్షణాధికారాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు మార్గం సుగమం చేసిన కేంద్రం.. ఇప్పుడు గోదావరి నదిపై ఉభయ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నిటినీ గోదావరి నదీ యాజమాన్య సంస్థ (జీఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌తో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో కేఆర్‌ఎంబీ చైర్మన్‌ పరమేశం కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆయనకు.. కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయన ఢిల్లీ రాలేదని జలశక్తి శాఖ వర్గాలు తెలిపాయి. గురువారం భేటీలో గోదావరి బోర్డు పరిధి దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.


ఇదే నిజమైతే.. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు, తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం సహా గోదావరిపై ఉభయ రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులన్నీ జీఆర్‌ఎంబీ అధీనంలోనికి వెళ్లిపోతాయి. కేంద్రం తీరు.. నదీ జలాలపై రాష్ట్రాల పాత్రను నామమాత్రం చేసేలా ఉందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నదీ జలాల కేటాయింపులు సంబంధిత ట్రైబ్యునల్‌ పరిధిలోని అంశాలని.. కేంద్రం ట్రైబ్యునల్‌ ఆదేశాలకు లోబడే నడచుకునేలా ఒత్తిడి పెంచాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ట్రైబ్యునల్‌ ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకోకుండా ఆదిలోనే కట్టడి చేయాలని.. లేదంటే రాష్ట్రప్రభుత్వాల పాత్ర నామమాత్రంగా మారిపోతుందని.. చుక్క నీటికి కూడా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


వాస్తవానికి ఈ రెండు బోర్డుల పరిధిని ఖరారు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ తొలి నుంచీ డిమాండ్‌ చేస్తోంది. అయితే.. ఇందులో తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చేర్చరాదని స్పష్టం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బోర్డులు స్వతంత్రంగా పనిచేసేందుకు వీల్లేదని వాదిస్తోంది. తాజా పరిణామాలపై ఈ నెల 12వ తేదీన కేఆర్‌ఎంబీకి లేఖ కూడా రాసింది. బోర్డు పరిధిని ప్రకటించవద్దని అందులో స్పష్టం చేసింది.

Updated Date - 2021-04-17T09:32:31+05:30 IST