నిర్మాణ పనులన్నీ పర్యవేక్షించాల్సిందే..

ABN , First Publish Date - 2022-06-30T06:05:22+05:30 IST

అన్ని రకాల ఇంజనీరింగ్‌ పనులను పర్యవేక్షించే బాధ్యత సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదేనని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ స్పష్టం చేశారు.

నిర్మాణ పనులన్నీ పర్యవేక్షించాల్సిందే..
మాట్లాడుతున్న పీవో గోపాలక్రిష్ణ, పక్కన పీఆర్‌ ఈఈ

సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదే బాధ్యత

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ 


పాడేరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): అన్ని రకాల ఇంజనీరింగ్‌ పనులను పర్యవేక్షించే బాధ్యత సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లదేనని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ స్పష్టం చేశారు. ఏజెన్సీలోని ముంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, జి.మాడుగుల మండలాల ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుభరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్‌ లైబ్రరీలు, ఇతర భవన నిర్మాణాలకు రూ.102 కోట్లు బిల్లులు అప్‌లోడ్‌ చేయగా, రూ.97 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇంకా రూ.5 కోట్లు చెల్లించడానికి ఎఫ్‌టీవోలు జనరేట్‌ చేశారని, త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పంచాయతీరాజ్‌ పనులే కాదు సచివాలయం పరిధిలో జరుగుతున్న ప్రతి నిర్మాణ పనులను చేయించాల్సి ఉంటుం దన్నారు. అలాగే నిర్మాణ పనులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ఇకపై నేరుగా కాంట్రాక్టర్‌ ఖాతాలో జమ చేస్తారన్నారు. అనంతరం కాంట్రాక్టర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని పీవో గోపాలక్రిష్ణ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ కె.లావణ్య కుమార్‌, డీఈఈ కొండయ్య పడాల్‌, ఏజెన్సీ ప్రాంత డీఈఈలు, ఏఈఈలు, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T06:05:22+05:30 IST