‘మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి’

ABN , First Publish Date - 2021-07-26T05:18:06+05:30 IST

మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం డిమాండ్‌ చేసింది.

‘మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి’
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జూలై 25: మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం డిమాండ్‌ చేసింది. నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట ఆదివారం ధర్నా చేపట్టారు. సంఘం రాష్ట్ర నాయకులు నార్నె వెంకటసుబ్బయ్య, జేవీఈ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మూఢ నమ్మకాలు పేట్రేగిపోతున్నాయన్నారు. బానమతి, చేతుబడి, జంతువులు, నరబలి, భూత, మంత్ర తంత్రాల పేరుతో గోవుల పెంట వంటి మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని అన్నారు. ప్రజలు వీటిని పాటించి ఆర్థికంగానూ నష్టపోతున్నారని తెలిపారు. క్షుద్రశక్తులు, అతీత శక్తుల పేరుతో ప్రజలను మమైకంలో ముంచెత్తుతూ హేయమైన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మూఢ నమ్మకాలు ప్రబలకుండా శాస్త్రీయ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టాలని కోరారు. బాబాలను, దొంగ స్వాములను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. సమాజంలో రగిలిపోతున్న మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను నిర్మూలించాలంటే.. ప్రభుత్వం తక్షణమే మూఢ నమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర నాయకులు గంగిరెడ్డి, శివారెడ్డి, లక్ష్మీనారాయణ, సమీరా, భారతి, జిల్లా నాయకులు జయన్న, రంగస్వామి, నారాయణ నాయక్‌, గౌతమ్‌, వెంకటేశ్వర్లు, రమణ, సుంకన్న, నాగభూషణం, వసంత కుమార్‌, శేషఫణి, కొమ్ముపాలెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-26T05:18:06+05:30 IST