సూపర్‌ స్పెషాలిటీ మెగా వైద్యశిబిరం అభినందనీయం

ABN , First Publish Date - 2021-10-27T06:14:39+05:30 IST

గ్రామస్థాయిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.

సూపర్‌ స్పెషాలిటీ మెగా వైద్యశిబిరం అభినందనీయం
వైద్యశిబిరం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

బద్ధిపూడి(ఉలవపాడు), అక్టోబరు 26 : గ్రామస్థాయిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బద్ధిపూడి గ్రామంలో కూనం వెంకటసుబ్బారెడ్డి 10 వర్ధంతి సందర్భంగా చారిటబుల్‌ టస్ర్టు ఆధ్వర్యంలో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి పాల్గొని వైద్య, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించడం ప్రజారోగ్యానికి బాసటగా నిలిచినట్లని నిర్వాహకులను ప్రశంసించారు. గ్రామీణ ఆర్యోగ కార్యకర్తల సేవలను కొనియాడారు. ట్రస్ట్‌ నిర్వాహకులు పారిశ్రామికవేత్త కూనం రాఘవరెడ్డి మాట్లాడుతూ... గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సర్పంచ్‌గా కూనం అనిల్‌రెడ్డి గెలిచిన రోజు నుంచే రోడ్లు, ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్నారు. గ్రామస్థులకు ఎలాంటి కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఒంగోలు వెంకటరమణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు సాయంత్రం వరకు వైద్య  పరీక్షలు నిర్వహించారు. సుమారు 800 మందికి చికిత్స అందించగా, 20 మంది రక్తదానం చేశారని నిర్వాహకులు తెలిపారు. స్థానికులకు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ, ఉచిత భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు, ఎస్సై పీ విశ్వనాథరెడ్డి, ట్రస్ట్‌ అధ్యక్షరాలు, వైసీపీ నాయకురాలు కూనం ఈశ్వరమ్మ, వైద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:14:39+05:30 IST