అబార్షన్లపై అగ్రరాజ్యం తిరోగమనం

ABN , First Publish Date - 2022-06-25T17:49:52+05:30 IST

హక్కుల విషయంలో అన్నిదేశాల కంటే ముందుండే అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో చీకటి దినం! ఆ దేశ మహిళలకు ఐదు దశాబ్దాలుగా..

అబార్షన్లపై అగ్రరాజ్యం తిరోగమనం

రాజ్యాంగం ఆ హక్కు కల్పించలేదని తీర్పులో పేర్కొన్న మెజారిటీ న్యాయమూర్తులు

అబార్షన్‌ చట్టాలపై ఇక రాష్ట్రాలదే అధికారం

దాదాపు సగం రాష్ట్రాల్లో కఠిన నియంత్రణలు

ఇది విచారకరమైన దినం: జో బైడెన్‌

అమెరికన్ల స్వేచ్ఛపై దాడి: బరాక్‌ ఒబామా


వాషింగ్టన్‌, జూన్‌ 24: హక్కుల విషయంలో అన్నిదేశాల కంటే ముందుండే అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో చీకటి దినం! ఆ దేశ మహిళలకు ఐదు దశాబ్దాలుగా ఉన్న చట్టబద్ధమైన గర్భస్రావ హక్కును ఆ దేశ సుప్రీంకోర్టు తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆ హక్కును కల్పిస్తూ 50 ఏళ్ల క్రితం వచ్చిన తీర్పును కొట్టేసింది. ‘‘రో వర్సెస్‌ వేడ్‌ జడ్జిమెంట్‌’’గా పేరొందిన చరిత్రాత్మక తీర్పు అది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు కన్జర్వేటివ్‌ న్యాయమూర్తులు (వారిలో ఐదుగురు పురుషులు) గర్భస్రావ హక్కుకు వ్యతిరేకంగా తీర్పునివ్వగా.. ముగ్గురు లిబరల్‌ జస్టిస్‌లు (వారిలో ఇద్దరు మహిళలు) అనుకూలంగా తీర్పునిచ్చారు. ‘‘కొన్ని కోట్ల మంది మహిళలు ఈరోజు వారికున్న ప్రాథమిక, రాజ్యాంగ రక్షణను కోల్పోయారు. దీన్ని మేం సమ్మతించట్లేదు’’ అని ఆ ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్‌ స్టీఫెన్‌ బ్రేయర్‌, సోనియా సోటోమేయర్‌, ఎలీనా కాగన్‌) పేర్కొన్నారు. ఈ తీర్పుతో.. రిపబ్లిన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ అబార్షన్‌పై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.


నిజానికి ఈ తీర్పు ఇలాగే రాబోతున్నట్టు పేర్కొంటే కిందటి నెల మూడో తేదీనే‘పొలిటికో’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్పట్లోనే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక.. ఈ తీర్పు అమెరికా మహిళలను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చేస్తుందని గర్భస్రావ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పిల్లలను కనే వయసున్న మహిళల్లో దాదాపు సగం మంది.. రిపబ్లికన్ల ఆధిపత్య ఉన్న రాష్ట్రాల్లో ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఈ తీర్పుపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. ఇది అమెరికాకు, కోర్టుకు విచారకరమైన రోజు అని వ్యాఖ్యానించారు. ‘‘కోర్టు మునుపెన్నడూ చేయని పని చేసింది. చాలా మంది అమెరికన్లకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును లాగేసుకుంది.’’ అని ఆవేదన వెలిబుచ్చారు. నవంబరులో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఈ తీర్పు, అబార్షన్‌ హక్కులు ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామ కూడా ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు.  కోట్లాదిమంది  అమెరికన్ల స్వేచ్ఛపై దాడి చేసిందని ధ్వజమెత్తారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కూడా ఈ తీర్పును తీవ్రంగా ఖండించారు. ‘‘రిపబ్లికన్ల నియంత్రణలోని కోర్టు ఇవాళ తన గూఢమైన, తీవ్రమైన లక్ష్యాన్ని సాధించింది. తమ పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మహిళలకున్న హక్కును తొలగించింది.’’ అని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో రిపబ్లికన్ల హయాంలో నియమితులైన న్యాయమూర్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారిలో ముగ్గురు.. రిపబ్లికన్‌ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హయాంలో నియమితులైనవారే. 


ఏమిటీ రో వర్సెస్‌ వేడ్‌ తీర్పు?

1969లో జేన్‌ రో (22, అసలు పేరు నార్మా మెక్‌కార్వీ) అనే అవివాహిత, నిరుద్యోగ మహిళ గర్భం దాల్చింది. టెక్స్‌సలో ఆమె గర్భస్రావం కోసం ప్రయత్నించగా.. అక్కడి చట్టాలు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. అప్పటి డల్లాస్‌ కౌంటీ జిల్లా అటార్నీ హెన్రీవేడ్‌ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చింది. అందుకే ఈ కేసు రో వర్సెస్‌ వేడ్‌ కేసుగా ప్రసిద్ధి పొందింది. ఈ కేసులో మూడేళ్ల పాటు వాదనలు విన్న అమెరికా సుప్రీంకోర్టు రోకు అనుకూలంగా 7-2 మెజారిటీతో తీర్పు చెప్పింది. రో ఈ కేసు వేసేనాటికి అమెరికాలో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే గర్భస్రావం చట్టబద్దం. 16 రాష్ట్రాలు కొన్ని పరిమితులతో గర్భస్రావానికి అనుమతిచ్చేవి. మిగతా ముప్పై రాష్ట్రాల్లో నిషేధం ఉండేది. అయితే, రాజ్యాంగం కల్పించే హక్కుల విషయంలో రాష్ట్రాల చట్టాలు పనిచేయవు. రో వర్సెస్‌ వేడ్‌ తీర్పులో సుప్రీంకోర్టు గర్భస్రావాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొనడంతో ఆ చట్టాలన్నీ నిర్వీర్యమైపోయాయి. అయితే.. మహిళల ఆరోగ్యాన్ని, కడుపులో బిడ్డ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొన్ని నియంత్రణలు విధించే హక్కును సుప్రీంకోర్టు అప్పట్లో రాష్ట్రాలకు ఇచ్చింది. తాజా తీర్పుతో ఇప్పుడు గర్భస్రావ చట్టాలు రాష్ట్రాల పరిధిలోకి వెళ్లినట్లయింది. రో వర్సెస్‌ వేడ్‌ తీర్పు ఇచ్చే సమయానికి ఫీటల్‌ వయబిలిటీ 28 వారాలుగా ఉండేది. ఫీటల్‌ వయబిలిటీ అంటే బిడ్డ తల్లి కడుపులో కాకుండా బయట ఎన్ని వారాల వయసులో జీవించగలదనే కొలమానం. తర్వాత కాలంలో వైద్యరంగంలో వచ్చిన అధునాతన పరిజ్ఞానాల కారణంగా ఫీటల్‌ వయబిలిటీ 23-24 వారాలకు పెరిగింది. అయినప్పటికీ.. 15 వారాలు దాటితే గర్భస్రావం కుదరదంటూ మిసిసిపీ రాష్ట్రం నిషేధం విధించడమే ఈ వివాదానికి మూలం.


ఇదీ నేపథ్యం..

రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న మిసిసిపి రాష్ట్రంలో 2018లో ఒక చట్టం చేశారు. దాని ప్రకారం.. గర్భం దాల్చిన 15 వారాల తర్వాత మహిళలు గర్భస్రావం చేయించుకునే హక్కు లేదు. దీనిపై జాక్సన్‌ వుమెన్స్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ జిల్లా కోర్టును ఆశ్రయించింది. కోర్టు 1973 నాటి ‘రో వర్సెస్‌ వేడ్‌’ తీర్పును ఉటంకిస్తూ ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో మిసిసిపి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు అసలు మహిళలకు అమెరికా రాజ్యాంగం గర్భస్రావానికి సంబంధించి ఎలాంటి హక్కూ కల్పించలేదని పేర్కొంటూ తాజా తీర్పునిచ్చింది.

Updated Date - 2022-06-25T17:49:52+05:30 IST