సామాజిక దూరం ఏదీ!

ABN , First Publish Date - 2020-03-29T10:39:24+05:30 IST

జనం సూపర్‌మార్కెట్లను వదిలి రోడ్లపై ఏర్పాటు చేసిన కూరగాయలు, నిత్యావసర సరుకులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.

సామాజిక దూరం ఏదీ!

సూపర్‌మార్కెట్లను వదిలి రోడ్లపై మార్కెట్‌కు ఎగబడుతున్న జనం 

సూపర్‌మార్కెట్లల్లో క్యూలు.. నిబంధనలతో ఆలస్యం.. రోడ్లపై మార్కెట్‌లకే ప్రాధాన్యమిస్తున్న జనం 

సూపర్‌మార్కెట్లలో నో స్టాక్‌ 

అందుకే రోడ్లపై మార్కెట్లకు గిరాకీ 


మియాపూర్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జనం సూపర్‌మార్కెట్లను వదిలి రోడ్లపై ఏర్పాటు చేసిన కూరగాయలు, నిత్యావసర సరుకులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా సూపర్‌మార్కెట్‌లో మాస్కు ఉంటేనే రానివ్వడం, మీటర్‌ నుంచి రెండుమీటర్లు దూరంగా క్యూలో గంటల తరబడి నిలబడాల్సి రావడం. దీనికి తోడు మధ్యాహ్నానికే సూపర్‌మార్కెట్‌ల్లో  సరుకులు అయిపోతుండడంతో జనం చిరు దుకాణాలకు, రోడ్లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీనివల్ల తమకు సమయం ఆదా అవుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. అలాగే సూపర్‌మార్కెట్ల ధరకంటే రోడ్లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.


మినీ ఇండియాగా పేరొందిన హైటెక్‌ నియోజకవర్గం శేరిలింగంపల్లిలో జాతీయ, అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కొదవ లేదు. అయితే లాక్‌డౌన్‌ వల్ల సూపర్‌మార్కెట్లు, చిరు దుకాణాలు మాత్రమే ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంటున్నాయి. 


ప్రధానంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల, దేశాలతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల ప్రజలు దాదాపుగా 12లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరందరూ ఇళ్లవద్దే ఉండటం, సొంత గ్రామాలకు వెళ్లడానికి కూడా అవకాశం లేకపోవడంతో సూపర్‌మార్కెట్‌ల్లో ఉన్న స్టాక్‌ ప్రస్తుతం ఉన్న జనాభాకు సరిపడినంతగా ప్రతి రోజూ సప్లయ్‌ కావడం లేదని అంటున్నారు. 


కూరగాయల కోసమే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూపర్‌మార్కెట్లకు ఒకటికి రెండుసార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చాలా మంది సూపర్‌మార్కెట్లలో తాము రాసుకున్న లిస్టు ప్రకారం స్టాక్‌ లేకపోవడంతో ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. 


రోడ్లపై మార్కెట్లలో పాటించని సామాజిక దూరం..

ప్రధానంగా నల్లగండ్ల, తారానగర్‌, మియాపూర్‌, లింగంపల్లి, చందానగర్‌, హఫీజ్‌పేట, చందానగర్‌, జేపీఎన్‌నగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో పలు ప్రధాన రహదారుల వెంట లాక్‌డౌన్‌కు ముందు సంతల పేరుతో వారాంతపు సంతలు ఉండేవి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సంతలు మూతపడ్డాయి. దీంతో కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి ఉపాధి కరువైంది. దీంతో వారు ఆయా ప్రాంతాల్లో గతంలో సంతలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ప్రతి రోజూ రోడ్లపై మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొనుగోలు దారులు సామాజిక దూరం పాటించడం లేదు. 


సామాజిక దూరంపై దృష్టి సారించాలి...

రోడ్లపై ఒక్క శేరిలింగంపల్లిలోనే కాకుండా నగర వ్యాప్తంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువుల మార్కెట్లు నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించక పోవడంతో రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కరోనావైర్‌స వ్యాప్తికి దారితీసే పరిస్థితులు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పోలీస్‌ యంత్రాంగం, కాలనీ అసోసియేషన్‌ సంఘాలు, ప్రజాప్రతినిధులు ఈ మార్కెట్లపై దృష్టిసారించి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ వాసుల ఆకలికేకలు 

రాయదుర్గం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): తమను ఆదుకునే దిక్కులేక ఆకలితో అలమటిస్తున్నామంటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గచ్చిబౌలిలోని పలు సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో నివాసముంటున్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తున్న పలు ఆస్పత్రుల్లో తమ వారికి వైద్యం చేయించుకునేందుకు వచ్చే కుటుంబ సభ్యులు తాత్కాలిక షెల్టర్‌ కోసం సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో ఉంటారు.


వీరంతా సుమారుగా ఐదు నుంచి 20రోజుల వరకు ఈ అపార్ట్‌మెంట్లలో ఉంటూ తమ వారికి చికిత్స చేయించుకుని వెళ్తుంటారు. దీంతో గచ్చిబౌలి, టెలికాంనగర్‌, ఇందిరానగర్‌, ఏపీహెచ్‌బీకాలనీ, మాదాపూర్‌ ప్రాంతాల్లో సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు చాలా వెలిశాయి. పేషంట్ల కుటుంబ సభ్యులతో పాటు ఐటీ కంపెనీల్లో పనిచేసేందుకు విజిటింగ్‌, డిప్యుటేషన్‌పై వచ్చే ఉద్యోగులు కుటుంబంతో వచ్చి సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌ల్లో ఉండేవారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వీరికి నిత్యావసర సరుకులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు.


ప్రభుత్వం పేదల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లు ఏర్పాటు చేసి అంజయ్యనగర్‌, సిద్దిఖ్‌నగర్‌ వంటి బలహీన వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో ఉండే వారి కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, కొత్తగూడ, టెలికాంనగర్‌, జనార్దన్‌హిల్స్‌, డైమండ్‌హిల్స్‌ ప్రాంతాల్లో సర్వీస్‌ అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు, భవన నిర్మాణ కార్మికులు లేబర్‌ క్యాంపుల్లో ఉండేవారి కార్మికుల ఆకలిని తీర్చేందుకు అధికారులు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పటి వరకు తమ దృష్టికి సమస్య రాలేదని, దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి చర్యలు చేపడతామని కార్పొరేటర్‌, అధికారులు తెలిపారు.


టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో కెమికల్‌ స్ర్పే

రాయదుర్గం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): నానక్‌రాం గూడ, గచ్చిబౌలి ప్రాంతా ల్లో టీఎ్‌సఐఐసీ ఆధ్వర్యంలో యాంటీ వైరస్‌ కెమికల్‌ను శనివారం స్ర్పే చేశారు. గత వారం రూ.18లక్షల వ్యయంతో రెండు స్ర్పే మిషన్లు అమర్చిన ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్టు టీఎ్‌సఐఐసీ జోనల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు.


శనివారం స్ర్పే మిషన్లతో గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్‌, గచ్చిబౌలి సర్కిల్‌, ట్రిపుల్‌ఐటీ సర్కిల్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రాంతం, ట్రిపుల్‌ఐటీ, టీహబ్‌, నానక్‌రాంగూడ ఐటీ జోన్‌ ప్రాంతంలో యాంటి వైరల్‌ వైరస్‌ కెమికల్‌ను స్ర్పే చేశారు. ఈ పనులను జోనల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌, అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - 2020-03-29T10:39:24+05:30 IST