సూపర్‌ సర్ఫరాజ్‌

ABN , First Publish Date - 2022-06-24T09:18:20+05:30 IST

యువ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు.

సూపర్‌   సర్ఫరాజ్‌

సీజన్‌లో నాలుగో శతకం

ముంబై తొలి ఇన్నింగ్స్‌ 374

రంజీ ఫైనల్‌

బెంగళూరు: యువ సంచలనం సర్ఫరాజ్‌ ఖాన్‌ తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. మూడంకెల స్కోర్లను అలవోకగా సాధిస్తున్న ఖాన్‌ కీలక రంజీ ఫైనల్లోనూ ఆకట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌ రెండో రోజున సర్ఫరాజ్‌ (134) సెంచరీ బాదాడు.ఈ సీజన్‌లో అతడికిది నాలుగో శతకం కావడం విశేషం. దీంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 127.4 ఓవర్లలో 374 పరుగులకు ఆలౌటైంది. గౌరవ్‌ యాదవ్‌కు నాలుగు, అనుభవ్‌కు మూడు, సారాంశ్‌కు రెండు వికెట్లు దక్కాయి.


అయితే ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరంభించిన మధ్యప్రదేశ్‌ కూడా దీటుగానే బదులిస్తోంది. గురువారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 123/1 స్కోరుతో ఉంది. క్రీజులో యష్‌ దూబే (44 బ్యాటింగ్‌), శుభం శర్మ (41 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు 248/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ముంబై లంచ్‌ విరామానికే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.


సర్ఫరాజ్‌ తొలి అర్ధసెంచరీకి 152 బంతులు తీసుకున్నా, తర్వాతి ఫిఫ్టీని 38 బంతుల్లోనే సాధించాడు. ఈ సమయంలో అతను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. పంజాబీ దివంగత సింగర్‌ సిద్దూ మూస్‌వాలా ట్రేడ్‌మార్క్‌ స్టయిల్లో తొడ కొట్టి చేతి వేలిని ఆకాశం వైపు చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ నాలుగు శతకాలు, మూడు అర్ధసెంచరీలతో 937 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ (275) కూడా ఉంది.


సంక్షిప్త స్కోర్లు:

ముంబై తొలి ఇన్నింగ్స్‌:

374 ఆలౌట్‌ (సర్ఫరాజ్‌ 134, యశస్వీ జైస్వాల్‌ 78, పృథ్వీ షా 47, గౌరవ్‌ 4/106, అనుభవ్‌ 3/81); మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 41 ఓవర్లలో 123/1 (యష్‌ దూబే 44 బ్యాటింగ్‌, శుభం శర్మ 41 బ్యాటింగ్‌, హిమాన్షు 31, తుషార్‌ 1/31).

Updated Date - 2022-06-24T09:18:20+05:30 IST