Super Earth discovered : సూపర్-ఎర్త్‌ని గుర్తించిన పరిశోధకులు.. జీవరాశి ఉండే అవకాశం!

ABN , First Publish Date - 2022-08-05T02:12:03+05:30 IST

భూగ్రహం వెలుపల జీవరాశి అన్వేషణలో భాగంగా రొస్ 508 బీ(Ross 508 b) అనే గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. నక్షత్రం నుంచి గ్రహం పరిభ్రమిస్తున్న దూరాన్ని బట్టి ఈ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశం ఉందని శా

Super Earth discovered : సూపర్-ఎర్త్‌ని గుర్తించిన పరిశోధకులు.. జీవరాశి ఉండే అవకాశం!

వాషింగ్టన్ : భూగ్రహం(Earth) వెలుపల జీవరాశి(Life) అన్వేషణలో భాగంగా పాలపుంత బయట రొస్ 508 బీ(Ross 508 b) అనే గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. నక్షత్రం నుంచి గ్రహం పరిభ్రమిస్తున్న దూరాన్ని బట్టి ఈ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ద్రవ్యరూపంలో నీరు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. భూగ్రహం నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి కంటే 4 రెట్లు అధికంగా ఉంది. అందుకే దీనిని ‘సూపర్-ఎర్త్’ (Super Earth)గా పేర్కొంటున్నారు. పాలపుంతకు వెలుపల ఓ రెడ్ డ్వార్ఫ్స్(Red Dwarfs ) నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది. కక్ష్యను ఒక్కసారి చుట్టిరావడానికి కేవలం 10.8 రోజుల సమయం మాత్రమే పడుతోంది. అంటే 10.8 రోజుల్లోనే ఆ గ్రహంపై సంవత్సరం పూర్తవుతోంది.


సూపర్ ఎర్త్ - దాని నక్షత్రం మధ్య సగటు దూరం.. భూమి - సూర్యుడి మధ్యదూరం కంటే 0.05 రెట్లు అధికంగా ఉంది. ఆవాసయోగ్యానికి అవకాశమున్న ప్రాంతం వెలుపలికి రావడం, మళ్లీ ఆ ప్రాంతం గుండా వెళ్లడం ఒక్కటే ప్రతికూలాంశంగా అనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో భవిష్యత్ పరిశీలనకు రొస్ 508 బీ ఉత్సాహాన్ని నింపనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


సుబరు టెలిస్కోప్(ఐఆర్‌డీ-ఎస్ఎస్‌పీ)పై ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్(ఐఆర్‌డీ)ని ఉపయోగించి రొస్ 508 బీ(Ross 508 b) గ్రహాన్ని సుబరు స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ గుర్తించింది. కాగా రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు ప్రధాన శ్రేణి నక్షత్రాలతో పోల్చితే కాస్త చిన్నగా, చల్లగా ఉంటాయి. గెలాక్సీలో మూడొంతుల నక్షత్రాలు ఇవే ఉన్నాయి. ఇందులో అధిక నక్షత్రాలు సౌరవ్యవస్థలో ఉండే పరిస్థితులకు దగ్గర వాతావరణాన్ని కలిగివుండే అవకాశం ఉంది. కాగా రొస్ 508 బీ గ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ తిరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కసారి కక్ష్యను పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పడుతుండగా ఆవాసయోగ్య జోన్ గుండా వెళ్లే అవకాశముందన్నారు. కాగా ప్రస్తుత టెలిస్కోపులు నేరుగా ఈ గ్రహాన్ని ఫొటో తీయలేకపోతున్నాయని వివరించారు. ఎందుకంటే నక్షత్ర కేంద్రం గ్రహానికి దూరమే కారణమంటున్నారు. భవిష్యత్‌లో జీవరాశి అన్వేషణ లక్ష్యంగా ఈ గ్రహంపై పరిశోధనలు జరిగే అవకాశం ఉందని ఐఆర్‌డీ-ఎస్ఎస్‌పీ బృందం వెల్లడించింది.


నివాసయోగ్యమైన జోన్ అంటే..

పరిభ్రమిస్తున్న గ్రహం ఉపరితలంపై ద్రవ్యరూపంలో నీళ్లు ఉండగలిగేలా నక్షత్రం నుంచి తగిన దూరంలో ఉండే ప్రాంతాన్నే ఆవాసయోగ్య జోన్(habitable zone)గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాలనే గోల్డీలాక్ జోన్స్ అని కూడా పిలుస్తారు. జీవం పుట్టేందుకు అనువైన ప్రదేశాలుగా భావిస్తారు. నక్షత్రం చుట్టూ ఉన్న ఈ గోల్డీలాక్స్ జోన్‌ ద్వారా రొస్ 508 బీ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.


రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు..

జీవరాశి అన్వేషణలో రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు చాలా కీలకమైనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నక్షత్రాలపై పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఈ నక్షత్రాలపై ఉపరితలంపై 4000 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతున్నారు. రొస్ 508 బీ మినహా ఇప్పటివరకు కనుగొన్న ఆవాసయోగ్య గ్రహాల్లో ‘ప్రొగ్జిమా సెంటౌరి బీ’ మాత్రమేనని గుర్తుచేస్తున్నారు.



Updated Date - 2022-08-05T02:12:03+05:30 IST