Abn logo
Oct 28 2021 @ 02:33AM

కిమ్స్‌ చేతికి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

రూ.363 కోట్లకు 51% వాటా కొనుగోలు

సన్‌షైన్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.730 కోట్లు

మొత్తం పడకల సామర్థ్యం  3,666కు చేరిక


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను కృష్ణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) సొంతం చేసుకుంది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న సర్వేజన హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 51.07 శా తం వాటాను కొనుగోలు చేసేందుకు కిమ్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తం వాటా విలువ రూ.362.78 కోట్లు. డీల్‌లో భాగంగా సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ మొత్తం ఎంటర్‌ప్రైజ్‌ విలువను రూ.730 కోట్లుగా లెక్కగట్టారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌.. కొనుగోలు చేస్తున్న వాటాలో 18.52 శాతం ఈక్విటీగా (రూ.230 కోట్లు) ఉండగా.. మిగిలిన వాటా పార్ట్‌లీ పెయిడప్‌ ఈక్విటీ (రూ.132.78 కోట్లు) గా ఉంది. ప్రస్తుతం రెండు హాస్పిటల్స్‌కు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 9 పట్టణాల్లో మొత్తం 12 ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల మొత్తం పడకల సామర్థ్యం 3,666గా ఉంది. కాగా 1,200 మంది డాక్టర్లు పని చేస్తున్నారు. 12,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సన్‌షైన్‌ను సొంతం చేసుకోవడంతో కీలకమైన మార్కెట్లలో టెరిటరీ కేర్‌ విభాగంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోగలుగుతుంది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ఏవీ గురవా రెడ్డి, ఆయన బృందం సేవలు కిమ్స్‌కు మరింత బలాన్ని సమకూర్చనుంది. కాగా కిమ్స్‌ హాస్పిటల్స్‌.. కార్డియో, న్యూరో, ట్రాన్స్‌ప్లాంట్‌, మూత్ర పిండాల వ్యాధుల విభాగాల డాక్టర్ల బృందం పటిష్ఠమవుతుంది. 


2009లో ప్రారంభం

సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు, కరీంనగర్‌లో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 600కు పైగా పడకలు ఉన్నాయి. మోకాలి చిప్పల సర్జరీలో అంతర్జాతీయంగా పేరున్న గురవా రెడ్డి 2009లో సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను ప్రారంభించారు. స్వల్ప కాలంలోనే ఆగ్నేయాసియాలోనే రెండో అతిపెద్ద జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ కేంద్రంగా సన్‌షైన్‌  ఆవిర్భవించింది. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్థోపెడిక్‌ సెంటర్స్‌ (ఐఎ్‌సఓసీ)లో  పూర్తి స్థాయి సభ్యత్వం పొందింది. ఆసియాలో ఈ సభ్యత్వం పొందిన రెండో హాస్పిటల్‌ ఇదే. సగటున ఏటా 4000కు పైగా జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జరీలను, 10 వేలకు పైగా ఆర్థోపెడిక్‌ సబ్‌ స్పెషాలిటీ సర్జరీలను సన్‌షైన్‌ చేపడుతోంది. కాగా కేవలం 18 నెలల్లో 700కు పైగా రోబోటిక్‌ మోకాలి చిప్పల రీప్లే్‌సమెంట్‌ను చేపట్టి రికార్డు సృష్టించింది. 


రూ.412 కోట్ల లాభం..

2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సన్‌షైన్‌ రూ.412 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. రూ.36 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19లో హాస్పిటల్స్‌ టర్నోవర్‌ రూ.333.53 కోట్లుంది. ఆర్థోపెడిక్‌ విభాగంలో కీలకంగా ఉన్న సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను సొంతం చేసుకోవడంతో తాము మరింత బలోపేతమవుతామని కిమ్స్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌ రావు తెలిపారు. కీలకమైన హైదరాబాద్‌ మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు ఈ కొనుగోలు దోహదం చేస్తుందన్నారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌తో చేరినందుకు ఆనందంగా ఉందని సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఎండీ ఏవీ గురవా రెడ్డి తెలిపారు.