Abn logo
Oct 9 2020 @ 04:08AM

బెయిర్‌స్టో బాదుడు

Kaakateeya

 వరుసగా రెండు విజయాలు.. ఆ తర్వాత ముంబై చేతిలో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి కలిసికట్టుగా కదం తొక్కింది. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో మెరుపు ఆటతీరుతో స్టేడియాన్ని హోరెత్తించగా.. అటు కెప్టెన్‌ వార్నర్‌ పంజాబ్‌పై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. అయితే చివర్లో తడబడినా రైజర్స్‌ భారీ స్కోరునే సాధించింది. ఇక వరుస ఓటములతో డీలా పడిన రాహుల్‌ సేనను రషీద్‌ ఖాన్‌ (4-1-12-3) విలవిల్లాడించాడు. నికోలస్‌ పూరన్‌ వీరవిహారానికి ఎవరి నుంచీ సహకారం లభించకపోవడంతో పంజాబ్‌ ఖాతాలో మరో ఓటమి చేరింది..


సన్‌రైజర్స్‌ ఘనవిజయం 

కట్టడి చేసిన రషీద్‌

చిత్తుగా ఓడిన పంజాబ్‌


1  ఐపీఎల్‌లో అత్యధిక 50+ పరుగులు సాధించిన వార్నర్‌ (50 సార్లు). అలాగే వరుసగా ఓ జట్టుపై ఎక్కువ (పంజాబ్‌పై 9) అర్ధసెంచరీలు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.


2 ఐపీఎల్‌లో వార్నర్‌-బెయిర్‌స్టో జోడీ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయడం ఇది ఐదోసారి. 16 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ సాధించడం విశేషం. కోహ్లీ-డివిల్లీర్స్‌ (9సార్లు), కోహ్లీ-గేల్‌ (9), వార్నర్‌-ధవన్‌ (6) ముందున్నారు.


పంజాబ్‌ తరఫున రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో) సాధించిన పూరన్‌. రాహుల్‌ (14 బంతుల్లో) టాప్‌లో ఉన్నాడు.


దుబాయ్‌: కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ఆటతీరులో ఏమాత్రం మార్పు కనిపించకపోగా.. సన్‌రైజర్స్‌ హై దరాబాద్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ఓ దశలో నికోలస్‌ పూరన్‌ (37 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77) భయపెట్టినా.. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (3/12) తన మ్యాజిక్‌ బంతులతో జట్టుకు అండగా నిలిచాడు. దీంతో రైజర్స్‌ 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (55 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 97) త్రుటిలో శతకం కోల్పోగా.. వార్నర్‌ (40 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) అర్ధ శతకం చేశాడు. రవి బిష్ణోయ్‌కు మూడు, అర్ష్‌దీప్‌ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకు కుప్పకూలింది. ఏకంగా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. ఖలీల్‌, నటరాజన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బెయిర్‌స్టో నిలిచాడు. 

అటు పూరన్‌.. ఇటు రషీద్‌: 202 పరుగుల భారీ ఛేదనలో పంజాబ్‌ ఏడు ఓవర్లు ముగిసే సరికే మయాంక్‌ (9), సిమ్రన్‌ సింగ్‌ (11), కెప్టెన్‌ రాహుల్‌ (11) వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్‌ పరిస్థితి ఏమిటో అర్థమైంది. ఏ దశలోనూ భాగస్వామ్యం నెలకొల్పలేకపోవడంతో వికెట్ల పతనం ఆగలేదు. అయితే నికోలస్‌ పూరన్‌ మాత్రం చెలరేగిపోయాడు. తానెదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలిచిన అతడు ఆ తర్వాత ఏడో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదగా.. తొమ్మిదో ఓవర్‌లో లెగ్‌ స్పిన్నర్‌ సమద్‌కు చుక్కలు చూపించాడు. తొలి ఐదు బంతులను 6,4,6,6,6గా మలిచి 28 పరుగులను రాబట్టడంతో పంజాబ్‌ ఒక్కసారిగా పోటీలో కొచ్చింది. అటు 17 బంతుల్లోనే ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధసెంచరీని పూరన్‌ పూర్తి చేశాడు. కానీ అతడికి మరో ఎండ్‌ నుంచి సహకారం కరువైంది. 11వ ఓవర్‌లో ప్రియమ్‌ గార్గ్‌ ఎక్స్‌ట్రా కవర్‌ నుంచి నేరుగా వికెట్లకు త్రో వేయడంతో మ్యాక్స్‌వెల్‌ (7) వెనుదిరిగాడు. అయితే ఈ జోరులోనూ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రషీద్‌ చక్కని గూగ్లీతో మన్‌దీప్‌ (6)ను బౌల్డ్‌ చేయడంతో పాటు తన మరుసటి ఓవర్‌లో ప్రమాదకర పూరన్‌, షమి (0)లను అవుట్‌ చేసి పంజాబ్‌ ఓటమిని ఖరారు చేశాడు. ఆరు పరుగుల వ్యవధిలోనే పంజాబ్‌ చివరి ఐదు వికెట్లను కోల్పోవడం గమనార్హం.

ఓపెనర్లు హోరెత్తించారు..: టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ తుఫాన్‌ ఆటతీరుతో చెలరేగింది. చివర్లో కాస్త తడబడి ఆశించిన స్కోరు సాధించలేకపోయినా  200 మార్కును దాటగలిగింది. ఓపెనర్లు వార్నర్‌, బెయిర్‌స్టో ఆరంభం నుంచే ఓవర్‌కు పది రన్‌రేట్‌ చొప్పున కదం తొక్కడంతో తొలి పది ఓవర్లలోనే జట్టు స్కోరు వందకు చేరింది.  పంజాబ్‌ నుంచి ఏ బౌలరూ వీరి జోరును అడ్డుకోలేకపోయాడు. ముఖ్యంగా బెయిర్‌స్టో బాదుడుకు స్టేడియం హోరెత్తింది. తొలి ఓవర్‌లోనే వార్నర్‌ రెండు ఫోర్లతో పరుగుల ప్రవాహానికి తెర లేపినా.. ఆ తర్వాత బాధ్యతను జానీ తీసుకున్నాడు. నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు సాధించిన అతను 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ క్యాచ్‌ మిస్‌ చేయడంతో బతికిపోయాడు. దీంతో 8వ ఓవర్‌లో రవి బిష్ణోయ్‌ బంతులను 6,4,6గా మలిచి 18 పరుగులు రాబట్టాడు. ఈ దెబ్బకు 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇక 11వ ఓవర్‌లోనూ 4,6,6 మరింతగా రెచ్చిపోయి 20 పరుగులు రాబట్టాడు. అటు బెయిర్‌స్టోకు సహకరిస్తూ వచ్చిన వార్నర్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 

బిష్ణోయ్‌ తిప్పేశాడు..: ఓపెనర్ల దూకుడుతో రైజర్స్‌ సులువుగా 220 పరుగులు దాటుతుందనిపించినా 16వ ఓవర్‌లో బిష్ణోయ్‌ భారీ ఝలక్‌ ఇచ్చాడు. గూగ్లీగా వేసిన తొలి బంతికి వార్నర్‌ లాంగ్‌ ఆన్‌లో క్యాచ్‌ ఇవ్వగా.. నాలుగో బంతికి బెయిర్‌స్టో ఎల్బీ అయ్యాడు. దీంతో 160 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ మరుసటి ఓవర్‌లోనే మనీశ్‌ పాండే (1)ను అర్ష్‌దీప్‌ సింగ్‌ అవుట్‌ చేయడంతో ఏడు బంతుల తేడాతో మూడు వికెట్లను కోల్పోయింది. బిష్ణోయ్‌ తన మరుసటి ఓవర్‌లోనే సమద్‌ (8)ను అవుట్‌ చేయగా ప్రియమ్‌ గార్గ్‌ డకౌట్‌తో నిరాశపరిచాడు. అయితే అభిషేక్‌ (12) రాగానే సిక్సర్‌ బాదగా చివరి ఓవర్‌లో కేన్‌ విలియమ్సన్‌ (20 నాటౌట్‌) 4,6 సాధించడంతో స్కోరు 200 దాటింది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) రవి బిష్ణోయ్‌ 52; బెయిర్‌స్టో (ఎల్బీ) రవి బిష్ణోయ్‌ 97; అబ్దుల్‌ సమద్‌ (సి) అర్ష్‌దీప్‌ సింగ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 8; మనీశ్‌ పాండే (సి అండ్‌ బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 1; విలియమ్సన్‌ (నాటౌట్‌) 20; ప్రియమ్‌ గార్గ్‌ (సి) పూరన్‌ (బి) అర్ష్‌దీప్‌ సింగ్‌ 0; అభిషేక్‌ శర్మ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) షమి 12; రషీద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 201/6; వికెట్ల పతనం: 1-160, 2-160, 3-161, 4-173, 5-175, 6-199; బౌలింగ్‌: కాట్రెల్‌ 3-0-33-0; ముజీబుర్‌ రహ్మాన్‌ 4-0-39-0; షమి 4-0-40-1; మ్యాక్స్‌వెల్‌ 2-0-26-0; రవి బిష్ణోయ్‌ 3-0-29-3; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-33-2.

కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) విలియమ్సన్‌ (బి) అభిషేక్‌ 11; మయాంక్‌ (రనౌట్‌/వార్నర్‌/అహ్మద్‌) 9; సిమ్రన్‌ సింగ్‌ (సి) గార్గ్‌ (బి) అహ్మద్‌ 11; నికోలస్‌ పూరన్‌ (సి) నటరాజన్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 77; మ్యాక్స్‌వెల్‌ (రనౌట్‌/గార్గ్‌) 7; మన్‌దీ్‌ప సింగ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 6; ముజీబుర్‌ రహ్మన్‌ (సి) బెయిర్‌స్టో (బి) అహ్మద్‌ 1; రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 6; షమి (ఎల్బీ) రషీద్‌ ఖాన్‌ 0; కాట్రెల్‌ (బి) నటరాజన్‌ 0; అర్ష్‌దీప్‌ సింగ్‌ (సి) వార్నర్‌ (బి) నటరాజన్‌ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16.5 ఓవర్లలో 132 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-31, 3-58, 4-105, 5-115, 6-126, 7-126, 8-126, 9-132; బౌలింగ్‌: సందీప్‌ 4-0-27-0; ఖలీల్‌ అహ్మద్‌ 3-0-24-2; నటరాజన్‌ 3.5-0-24-2; అభిషేక్‌ శర్మ 1-0-15-1; రషీద్‌ ఖాన్‌ 4-1-12-3; అబ్దుల్‌ సమద్‌ 1-0-28-0. 

Advertisement
Advertisement
Advertisement