రైజర్స్‌ చేజేతులా..

ABN , First Publish Date - 2020-09-22T09:50:37+05:30 IST

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ తాజా సీజన్‌లో చక్కటి బోణీ చేసింది.

రైజర్స్‌   చేజేతులా..

బెయిర్‌స్టో  శ్రమ వృథా 

బెంగళూరు 10 పరుగులతో విజయం  

 

తొలి టైటిల్‌ కోసం వేట ఆరంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లోనే చిత్తయింది. 164 పరుగుల ఛేదనలో వార్నర్‌ ఆరంభంలోనే రనౌటైనా.. బెయిర్‌స్టో ధాటిని కనబరుస్తూ మ్యాచ్‌పై ఆశలు రేకెత్తించాడు. 121/2తో పటిష్ఠంగా కనిపిస్తున్న దశలో చాహల్‌కు తోడు సైనీ పేస్‌తో మరో 32 పరుగులకే మిగిలిన వికెట్లను కోల్పోయుంది. దీనికి తోడు ఎప్పటిలాగే మిడిలార్డర్‌ వైఫల్యం రైజర్స్‌ కొంపముంచింది. అంతకుముందు బెంగళూరు బ్యాటింగ్‌లో దేవదత్‌, డివిల్లీర్స్‌ అర్ధసెంచరీలతో భారీ స్కోరుకు దోహదపడ్డారు.


దుబాయ్‌: బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌ తాజా సీజన్‌లో చక్కటి బోణీ చేసింది. అటు గెలుపు దిశగా సాగుతున్న మ్యాచ్‌లో ఒత్తిడికి లోనైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జానీ బెయిర్‌స్టో (43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) పోరాటం కనబర్చినా చివర్లో చేతులెత్తేశారు. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కళ్‌ (42 బంతుల్లో 8 ఫోర్లతో 56), డివిల్లీర్స్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) అర్ధసెంచరీ సాధించారు. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 19.4 ఓవర్లలో 153 పరుగులు చేసి ఓడింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా చాహల్‌ (3/18) నిలిచాడు.




బెయిర్‌స్టో బాదినా...

 ఛేదనలో కెప్టెన్‌ వార్నర్‌ (6) రెండో ఓవర్‌లోనే రనౌటయ్యాడు. పేసర్‌ ఉమేశ్‌ చేతికి తగిలిన బంతి వికెట్లను పడేయడంతో నాన్‌స్ట్రయికర్‌గా ఉన్న వార్నర్‌ వెనుదిరగాల్సి ఉంది. అయితే మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే జట్టును ఆదుకున్నారు. పాండే వేగంగా ఆడుతూ ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఏడో ఓవర్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. అటు 11వ ఓవర్‌లో బెయిర్‌స్టో క్యాచ్‌ను ఫించ్‌ వదిలేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్‌లోనే మనీశ్‌ను చాహల్‌ అవుట్‌ చేసి ఆర్‌సీబీకి రిలీ్‌ఫనిచ్చాడు. రెండో వికెట్‌కు ఈ జోడీ 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. 



చాహల్‌ తిప్పేశాడు..

పాండే వెనుదిరిగాక బెయిర్‌స్టో ఆటలో వేగం పెంచాడు. దీంతో 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. దీనికి తోడు అతడికి మరో రెండు సార్లు జీవనదానం లభించగా, అటు కళ్లు చెదిరే షాట్లతో స్కోరును పెంచడంతో ఇక మ్యాచ్‌ సన్‌రైజర్స్‌ వైపు వెళ్తోందనిపించింది. కానీ 16వ ఓవర్‌లో ప్రమాదకర బెయిర్‌స్టోతో పాటు విజయ్‌ శంకర్‌ (0)ను చాహల్‌ వరుస బంతుల్లో బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక 4 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉండగా హైదరాబాద్‌ మరో 27 రన్స్‌కే మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయి ఓడింది. 


ఆరంభం అదుర్స్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును తొలి 10 ఓవర్లపాటు సన్‌రైజర్స్‌ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. ముఖ్యంగా 20 ఏళ్ల దేవదత్‌ పడిక్కళ్‌ తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే ఎలాంటి బెరుకు లేకుండా బ్యాట్‌ను ఝుళిపిస్తూ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇక ఐదో ఓవర్‌లో నాలుగు బంతులేసిన పేసర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయంతో గ్రౌండ్‌ను వీడగా మిగతా రెండు బంతుల్లో విజయ్‌ శంకర్‌ ఓ సిక్స్‌, రెండు నోబ్‌, ఓ వైడ్‌ వేయడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో ఆర్‌సీబీ 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కాస్త జోరు తగ్గినా రషీద్‌ ఖాన్‌ ఓవర్‌లో ఫించ్‌ (29) 4,6తో దూకుడు పెంచాడు. అటు 36 బంతుల్లోనే పడిక్కళ్‌ తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ 11వ ఓవర్‌లో పడిక్కళ్‌, మరుసటి ఓవర్‌లోనే ఫించ్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు మిడిల్‌ ఓవర్లలో బెంగళూరు బ్యాటింగ్‌ నెమ్మదించింది. ఆ తర్వాత 16వ ఓవర్‌లో కోహ్లీ (14) వికెట్‌ను కోల్పోయిన తర్వాత డివిల్లీర్స్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లను బాదిన ఏబీ 29 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కానీ ఆఖరి ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌గా మలిచాక మూడో బంతికి తను, చివరి బంతికి దూబే రనౌటయ్యారు.


బెంగళూరు ఇన్నింగ్స్‌:


దేవదత్‌ పడిక్కళ్‌ (బి) విజయ్‌ శంకర్‌ 56; ఫించ్‌ (బి) అభిషేక్‌ శర్మ 29; కోహ్లీ (సి) రషీద్‌ (బి) నటరాజన్‌ 14; డివిల్లీర్స్‌ (రనౌట్‌) 51; శివమ్‌ దూబే (రనౌట్‌) 7; ఫిలిప్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 163/5. వికెట్ల పతనం: 1-90, 2-90, 3-123, 4-162,  5-163. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0; సందీప్‌ 4-0-36-0; నటరాజన్‌ 4-0-34-1; మార్ష్‌ 0.4-0-6-0; విజయ్‌ శంకర్‌ 1.2-0-14-1; రషీద్‌ 4-0-31-0; అభిషేక్‌ 2-0-16-1.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌:

డేవిడ్‌ వార్నర్‌  (రనౌట్‌) 6, బెయిర్‌స్టో (బి) చాహల్‌ 61, మనీష్‌ పాండే (సి) సైనీ (బి) చాహల్‌ 34, ప్రియం గార్గ్‌ (బి) దూబె 12, విజయ్‌ శంకర్‌ (బి) చాహల్‌ 0, అభిషేక్‌ శర్మ (రనౌట్‌) 7, రషీద్‌ (బి) సైనీ 6, భువనేశ్వర్‌ (బి) సైనీ 0, సందీప్‌ శర్మ (సి) కోహ్లీ (బి) స్టెయిన్‌ 9, మిచెల్‌ మార్ష్‌ (సి) కోహ్లీ (బి) దూబె 0, నటరాజన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 19.4 ఓవర్లలో 153 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-18, 2-89, 3-121, 4-121, 5-129, 6-135, 7-141, 8-142, 9-143; బౌలింగ్‌: డేల్‌ స్టెయిన్‌ 3.4-0-33-1, ఉమేష్‌ యాదవ్‌ 4-0-48-0, నవ్‌దీప్‌ సైనీ 4-0-25-2, వాషింగ్టన్‌ సుందర్‌ 1-0-7-0, యజ్వేంద్ర చాహల్‌ 4-0-18-3, శివం దూబే 3-0-15-2.


 ఆర్‌సీబీ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా పడిక్కళ్‌

ఐపీఎల్‌లో ఆడిన 10 సీజన్లలో ఆరోన్‌ ఫించ్‌కిది ఎనిమిదో ఫ్రాంచైజీ

స్కోరుబోర్డు


Updated Date - 2020-09-22T09:50:37+05:30 IST