తెలుగువాడైపోయిన సఫారీ బ్యాటర్ మార్కరమ్.. పేరు పక్కన ‘నాయుడు’ చేర్చేసిన సన్‌రైజర్స్

ABN , First Publish Date - 2022-04-19T00:55:19+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్‌లో ఇప్పుడు ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పేలవ ప్రదర్శన కారణంగా

తెలుగువాడైపోయిన సఫారీ బ్యాటర్ మార్కరమ్.. పేరు పక్కన ‘నాయుడు’ చేర్చేసిన సన్‌రైజర్స్

ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్‌లో ఇప్పుడు ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. పేలవ ప్రదర్శన కారణంగా హైదరాబాద్ కూడా తొలుత ముంబై, చెన్నైతోపాటు అట్టడుగునే ఉండేది. అయితే, తొలి రెండు మ్యాచుల్లో పరాజయం తర్వాత విలియమ్సన్ సేన అద్భుతంగా పుంజుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో నెగ్గి రికార్డులకెక్కింది. ఆ జట్టు పుంజుకున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 


జట్టు విజయాల్లో సఫరీ ప్లేయర్ అయిడెన్ మార్కరమ్‌ది కీలక పాత్ర అని చెప్పుకోవాలి. అవసరమైన సమయాల్లో విలువైన పార్ట్‌నర్‌షిప్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. మంచి ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించిపెట్టాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ మార్కరమ్ వీర విహారం చేశాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. మ్యాచ్‌లను దాదాపు మార్కరమే ముగిస్తున్నాడు. 


ఆదివారం పంజాబ్‌పై విజయం సాధించిన అనంతరం హోటల్‌లో మార్కరమ్‌కు కోచ్ టామ్ మూడీ బహుమతులు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సన్‌రైజర్స్ మార్కరమ్ పేరు పక్కన నాయుడు చేర్చి తెలుగువాడిని చేసేసింది. అంతేకాదు, అతడిని ఎండ్‌గేమ్ స్పెషలిస్టుగా పేర్కొంది. మార్కరమ్ పేరు పక్కన ‘నాయుడు’ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Updated Date - 2022-04-19T00:55:19+05:30 IST