ఇది సూరీడి లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-05-28T10:27:16+05:30 IST

రోహిణి కార్తె పెట్టింది. మాడు పగిలేలా ఎండ తీవ్రత పెరిగింది. ఆంక్షలు సడలించినా.. సూరీడి ప్రతాపంతో రోడ్లు బోసిపోయి

ఇది సూరీడి లాక్‌డౌన్‌!

  • జిల్లాలో ఎండ ప్రచండం 
  • 44 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రత
  • నెలాఖరు వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి


ఆంధ్రజ్యోతి, తిరుపతి: రోహిణి కార్తె పెట్టింది. మాడు పగిలేలా ఎండ తీవ్రత పెరిగింది. ఆంక్షలు సడలించినా.. సూరీడి ప్రతాపంతో రోడ్లు బోసిపోయి చాలాచోట్ల లాక్‌డౌన్‌ ప్రభావమే కనిపిస్తోంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఇంట్లోనూ ఫ్యాను గాలి చాలక ‘ఉక్క’రిబిక్కిరి అవుతున్నారు. వేడిగాలులతో సతమతమవుతున్నారు. ఈ వేసవి సీజన్‌లో గత శనివారం గరిష్ఠంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏర్పాటు చేసిన గుడిపాల కేంద్రంలో 24వ తేదీన 44.44 డిగ్రీలతో రాష్ట్రంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించాక 40 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రత పెరుగుతూ వచ్చింది. గతేడాది ఇదే రోజుల్లో సరాసరి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా.. ఇంతటి సెగలు కనిపించలేదని ప్రజలు అంటున్నారు. దీనివల్ల ఉదయం 6 నుంచి 9 గంటలు.. సాయంత్రం 6 గంటలపైన వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఉపాధి పనులపైనా ఎండలు ప్రభావం చూపుతున్నాయి. ఈనెలాఖరు వరకూ 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ అంచనా. జిల్లాలో ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతిచెందారు. ఈ క్రమంలో వడదెబ్బ నుంచి బయటపడాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 


ఎండ కష్టాలు 

  1. మదనపల్లె ప్రాంతంలో మూడు రోజులుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో 40 డిగ్రీలే ఉంది. పశువులు, గొర్రెల కాపరులు ఉదయం 6 గంటలకే మేపడానికి తీసుకొన్ని ఎండెక్కేలోపు తిరిగొచ్చేస్తున్నారు. అడవుల్లోకి వెళ్లిన వారూ పది గంటలకే చెట్టు, పుట్టలను ఆశ్రయిస్తున్నారు. బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. 
  2. పేదల ఊటీగా పేరున్న పలమనేరులో దాదాపు రెండు డిగ్రీల (గతేడాది 34 డిగ్రీలుండగా ఇప్పుడు 36) ఉష్ణోగ్రత పెరిగింది. ఉదయం 11 గంటలకే వీధులన్నీ బోసిపోతున్నాయి. పుంగనూరులోనూ ఇదే పరిస్థితి. 
  3. శ్రీకాళహస్తిలో గతేడాది 44 ఉండగా.. ఇప్పుడు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అయినా సెగ ఎక్కువగా ఉండటంతో అల్లాడిపోతున్నారు. 
  4. సత్యవేడులో గతేడాది 37 డిగ్రీలున్న ఉష్ణోగ్రత ప్రస్తుతం 39కి చేరింది.  
  5. పీలేరులో గతేడాది ఇదేరోజుల్లో 35 డిగ్రీలుండగా ప్రస్తుతం 39కి చేరింది. అరకొరగా సాగుచేసిన పంటలూ ఎండిపోతున్నాయి. నీటి సమస్య జఠిలమైంది. పీలేరులో వారానికోసారి.. వాల్మీకిపురంలో 20 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాల్లోనూ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. 
  6. పుత్తూరులో ఈసారి 43 డిగ్రీలు (గతేడాది 39) నమోదైంది. 


ఆ తర్వాత జూన్‌ 1 నుంచి రోహిణి కార్తె మొదలువుతుంది. దాని ప్రభావం ఎలాగో రోళ్లు పగిలే వరకు విడిచిపెట్టదనే నానుడి ఎలాగో ఉంది. మండే ఎండలకు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


తిరుపతి కేంద్రంగా నమోదైన ఉష్ణోగ్రతలు 


                2019                 2020

               గరిష్ఠం       గరిష్ఠం 

మే 27        44.8                       41.5     

మే 26        45.5                       41.5      

మే 25        44.1                       42.4     

మే 24        42.8                       42.0     

మే 23        41.5                       43.6     

మే 22        42.8                       43.4     

మే 21        42.7                       43.1 

మే 20        43.5                       42.0     


చిత్తూరు కేంద్రంగా.. 


మే 27        41.0                       39.0     

మే 26        40.0                       37.0      

మే 25        39.0                       41.0     

మే 24        39.0                       42.0     

మే 23        39.0                       41.0     

Updated Date - 2020-05-28T10:27:16+05:30 IST