టెలికాం చార్జీలు పెంచాల్సిందే..

ABN , First Publish Date - 2020-11-23T06:36:47+05:30 IST

ప్రస్తుత టెలికాం చార్జీలింకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని, మరింత పెంచాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. అయితే, మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాకే కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు...

టెలికాం చార్జీలు పెంచాల్సిందే..

  • ప్రస్తుత టారి్‌ఫలు కంపెనీలకు ఏమాత్రం సహనీయం కాదు.. 
  • ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ 


న్యూఢిల్లీ: ప్రస్తుత టెలికాం చార్జీలింకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయని, మరింత పెంచాల్సిన అవసరం ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ అన్నారు. అయితే, మార్కెట్‌ పరిస్థితులను పరిశీలించాకే కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ ఒక్కటే ముందడుగు వేయలేదని, ఇండస్ట్రీ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మిట్టల్‌ గతంలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెలకు 16 జీబీ వినియోగానికి కేవలం రూ.160 చార్జీ చెల్లింపు విషాదకరమన్నారు. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) రూ.200 స్థాయికి పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.162కు పెరిగింది.


5జీపై కేంద్రం నిర్ణయమే ఫైనల్‌ : 5జీ సేవల్లోకి చైనా టెలికాం పరికరాల కంపెనీలను అనుమతించాలా..? వద్దా..? అనే విషయంపై మిట్టల్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారన్నారు. అంతేకాదు, 5జీ స్పెక్ట్రమ్‌ ధరలు కంపెనీలకు అందుబాటులో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌ తరం సేవలనందించేందుకు భారత్‌కు ఇంకా సమయం ఉందని.. మిగతా దేశాలతో పోలిస్తే మనమేం వెనకబడలేదన్నారు. యూరప్‌, బ్రిటన్‌, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనూ 5జీ కవరేజీ చాలా పరిమితంగానే అందుబాటులోకి వచ్చిందన్నారు. 


Updated Date - 2020-11-23T06:36:47+05:30 IST