సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడాలి

ABN , First Publish Date - 2022-05-20T05:36:54+05:30 IST

సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడాలి

సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడాలి
ఇబ్రహీంపట్నం: సుందరయ్య చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తున్న భాస్కర్‌, తదితరులు

ఇబ్రహీంపట్నం/యాచారం/మంచాల/షాద్‌నగర్‌, మే 19: సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు పాటుపడాలని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. సుందరయ్య 37వ వర్ధంతిని పురస్కరించుకొని  గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.భాస్కర్‌ సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ దోపిడీకి గురవుతున్న పీడిత ప్రజల విముక్తికి సుందరయ్య చేసిన సేవలను మరువలేమని అన్నారు. సమసమాజ నిర్మాణానికి ఆయన వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ ఆస్తిని సైతం వదులుకున్నారని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సామేల్‌, ముసలయ్య, వెంకటేశ్‌, ఎల్లేష్‌, బి.రాములు, జగన్‌, యాదగిరి పాల్గొన్నారు. అదేవిధంగా యాచారంలో నిర్వహించిన సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర నాయకుడు పి.జంగారెడ్డి పాల్గొని ప్రసంగించారు. సాయుధ రైతాంగ పోరాటాలు నడిపి పేదల ఆకలి తీర్చిన గొప్ప రాజకీయ వేత్త సుందరయ్య అని కొనియాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలన్నారు. త్వరలో నియోజకవర్గంలో భారీగా భూపోరాటాలు  చేయడానికి తగు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, పి.బ్రహ్మయ్య, మండల మహిళా విభాగం కార్యదర్శి మస్కు అరుణ, దర్మన్నగూడ సర్పంచ్‌ బాషయ్య, వెంకటయ్య, శ్రీమన్నారాయణ, ఆలంపల్లి జంగయ్య, చందూ, లాజర్‌ పాల్గొన్నారు. అంతకుముందు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మంచాల మండలంలోని ఆరుట్లలో నూతనంగా నిర్మించిన సీపీఎం పార్టీ కార్యాలయాన్ని సీపీఎం రాష్ట్ర నాయకుడు జంగారెడ్డి  గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి శ్యాంసుందర్‌, జిల్లా కమిటీ సభ్యుడు రావులజంగయ్య, గ్రామకార్యదర్శి పి.గోపాల్‌, మండల కమిటీ సభ్యుడు పోచమోని కృష్ణ, బుగ్గ రాములు, కె.బుచ్చయ్య, ఎండీ.యూసుఫ్‌, వినోద్‌, గణేష్‌, ప్రభాకర్‌, చిందం కృష్ణ, శంకరయ్య, విజయ్‌, చంద్రయ్య, అంజయ్య, మల్లేష్‌ భూపాల్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్‌.రాజు  పార్టీ కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  

Updated Date - 2022-05-20T05:36:54+05:30 IST