ఉత్తరాంధ్ర అంతటా నేడు, రేపు వర్షాలు : సునంద

ABN , First Publish Date - 2021-12-03T19:17:41+05:30 IST

వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద తెలిపారు. రానున్న పన్నెండు గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందన్నారు.

ఉత్తరాంధ్ర అంతటా నేడు, రేపు వర్షాలు : సునంద

విశాఖపట్నం : వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారిణి సునంద తెలిపారు. రానున్న పన్నెండు గంటల్లో తుఫానుగా బలపడే అవకాశముందన్నారు. రేపు ఉదయం వరకూ పశ్చిమ వాయువ్య దిశగానూ.. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుందన్నారు. రేపటికి ఉత్తరాంధ్ర తీరానికి కాస్త దగ్గరగా వచ్చే అవకాశముందన్నారు. ఉత్తరాంధ్ర అంతటా ఈరోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సునంద తెలిపారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశముందన్నారు. గంటకు 45 నుంచి యాభై కిలోమీటర్ల మేర అప్పుడప్పుడు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. తీరం దగ్గరికి తుపాను వచ్చే సరికి గాలి తీవ్రత మరింత పెరుగుతుందని సునంద తెలిపారు. గ౦టకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అప్పుడప్పుడు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సునంద సూచించారు.

 

Updated Date - 2021-12-03T19:17:41+05:30 IST