ఎండలోకి రాగానే తుమ్ములు.. గందరగోళ పరిచే సిద్ధాంతాలు.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-01-18T14:06:15+05:30 IST

వేసవి కాలంలో బయటకు వచ్చి సూర్యుడిని చూడగానే..

ఎండలోకి రాగానే తుమ్ములు.. గందరగోళ పరిచే సిద్ధాంతాలు.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..

వేసవి కాలంలో బయటకు వచ్చి సూర్యుడిని చూడగానే కొందరికి తుమ్ములు వస్తుంటాయి. శాస్త్రీయ పరిభాషలో దీనిని సన్ స్నీజింగ్ అంటారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన హెడ్ అండ్ నెక్ సర్జన్ బెంజమిన్ బ్లెయిర్ దీని గురించి మాట్లాడుతూ మనిషి ప్రకాశవంతమైన కాంతిలోకి వెళ్లినప్పుడు తుమ్ములు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా జరుగుతుంది. తుమ్ములు బలమైన సూర్యకాంతిలో ఎందుకు వస్తాయి? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే జన్యుసంబంధమే దీనికి కారణమని తెలిపారు. సాధారణ భాషలో చెప్పాలంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులలో మ్యుటేషన్ ఉంటుంది. ఎండలో తుమ్మడం అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదని బెంజమిన్ బ్లెయిర్ తెలిపారు. ఇలా తుమ్ములు రావడానికి కారణం ఏమిటనే దానిపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయన్నారు. 


దీనికి సంబంధించిన మొదటి సిద్ధాంతం 350బీసీఈలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ తెలిపారు. అతను తెలిపిన వివరాల ప్రకారం సూర్యుని వేడి మన ముక్కు లోపలి భాగాన్ని చేరినప్పుడు తుమ్మువస్తుంది. ఆంగ్ల తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్.. అరిస్టాటిల్ ఈ సిద్ధాంతాన్ని తిరస్కరించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 17వ శతాబ్దంలో వచ్చిన ఈ సిద్ధాంతంలో ఫ్రాన్సిస్ బేకన్.. సూర్యుడిని కళ్ళు మూసుకుని చూస్తామని, అటువంటప్పుడు ఎందుకు తుమ్ముతామని ప్రశ్నించాడు. ఇలా తుమ్ములు రావడంలో కళ్లది అత్యంత ముఖ్యమైన పాత్ర అని పేర్కొన్నారు. దీని తర్వాత అనేక అధ్యయనాలు జరిగాయి. వీటన్నింటిలో... కాంతి తీవ్రత మారడమే తుమ్ములకు కారణమని తెలిపారు. అధిక తీవ్రత కలిగిన కాంతిలోకి వచ్చినప్పుడు మాత్రమే తుమ్ములు వస్తాయని స్పష్టం చేశారు. అటువంటి స్థితిలో ముక్కులో మంటలాంటి అనుభూతి కలిగి తుమ్ములు వస్తాయని వెల్లడించారు. అయితే పలువురు శాస్త్రవేత్తలు.. డాక్టర్ హెన్రీ ఎవెరెట్ భావనకు మద్దతు పలికారు. డాక్టర్ హెన్రీ తన సిద్ధాంతాన్ని 1964లో ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి అత్యంత ప్రకాశవంతమైన సూర్యకాంతిలోకి వెళ్లినప్పుడు.. కళ్ళపై బలమైన కాంతి తీవ్రత పడితే మెదడుకు సిగ్నల్‌ అందించే నాడి గందరగోళానికి గురవుతుంది. అప్పుడు తుమ్ములు వస్తాయని తెలిపారు. ఈ రకమైన తుమ్ము ప్రమాదకరం కాదని, ఆరోగ్యానికి భంగం వాటిల్లదని డాక్టర్ బెంజిమన్ అన్నారు. అయితే డ్రైవర్ లేదా పైలట్ ఇలా తుమ్మినట్లయితే ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయన్నారు. 

Updated Date - 2022-01-18T14:06:15+05:30 IST