హైదరాబాద్: ఆదివారం వచ్చిందంటే సిటీ జనాలు అలా టాంక్బండ్ పైకి వెళ్లి పిల్లలతో హాయిగా గడిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లుచేస్తోంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు టాంక్బండ్ పై ట్రాఫిక్ నిలిపి వేస్తారు. గత కొన్ని వారాలుగా ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ట్రాఫిక్‌ను టాంక్బండ్ పైకి వెళ్లకుండా మళ్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం 26వ తేదీన టాంక్బండ్ పైకి పిల్లాపాపలతో వచ్చేనగర వాసులకు మరిన్ని ఆకర్షణీయమైన ఏర్పాట్లుచేస్తున్నట్టు మున్సిపల్ పరిపాలనాశాఖ, హెచ్ఎండిఏ వెల్లడించింది.
ఈసారి సండే ఫన్ డే మరింత మెమోరబుల్‌గా ఉండనుందని అధికారులు తెలిపారు. కేవలం పిల్లలకే కాకుండా పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తారని అన్నారు. గత ఆదివారం సందర్శకులను ఆకట్టుకునేందుకు లేజర్‌షో, షాపింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. కాగా ఈసారి అన్ని వయస్సుల వారిని అలరించేందుకు సరికొత్త అనుభూతులను పంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందులో భాగంగానే బ్యాండ్పెర్ఫామెన్స్, ఆర్కెస్ట్రాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దివంగత ఎస్పి బాల సుబ్రహ్మణ్యం స్మారకార్ధం ఆర్కెస్ర్టాలో పలవురు గాయనీ గాయకులు తెలుఉ, హిందీ పాటలతో అలరించనున్నారు. వైర్ ఆర్టిస్టులు బీట్ బాక్సింగ్, ర్యాప్‌లతో అలరించనున్నారు.
ఇక రైల్వే ప్రొటెక్షన్‌ఫోర్స్(ఆర్పిఎఫ్) కూడా తన బ్యాండ్‌తో సందర్శకులను అలరిస్తారు. గత వారంలాగే ఈసారి కూడా సన్డే ఫన్డే కోసం టాంక్బండ్ పై కల్చర్ షోలతో పాటు బాణాసంచా, కల్చరల్ యాక్టివిటీస్, షాపింగ్, గేమ్స్, ఫుడ్ స్టాల్స్ వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారం మరో ప్రత్యేకత 320 మంది ఒగ్గుకళాకారులు, గుస్సాడి, బోనాల కోలాటం కళాకారులు కూడా తమ కళను ప్రదర్శించనున్నారు. పూర్తిగా కల్చరల్ కార్నివాల్ మాదిరిగా టాంక్ బండ్ సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది, టాంక్ బండ్ పై వివిధ రకాల ఆకర్షణీయమైన బాణాసంచాతో సందర్శకులను ఆలరించనున్నారు.
ఆకాశంలో రంగు రంగుల తారాజువ్వలు, ఫైర్ వర్క్‌తో అలరించనున్నారు. క్లౌన్ పెర్ఫామెన్స్, జగ్గరీస్, యూనిసైక్లిస్ట్స్ వంటివి సండే సాయంత్రం కోసం సిద్ధమవుతున్నాయి. ప్రత్యేకించి పిల్లలను అరించడానికి పలు రకాల ఆకర్షణలు ఈసారి చోటు చేసుకుంటాయని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. టంక్బండ్పై ఈసారి 15వేల కంటే ఎక్కువే మొక్కలను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఈసారి 30కి పైగా రకాల ఔషధ మొక్కల జాతులను ఇక్కడ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
కాగా టాంక్బండ్ పైకి వచ్చేవేలాది మంది సందర్శకులను దృష్టిలో ఉంచుకుని కరోనా జాగ్రత్తలో భాగంగా ప్రతి ఒక్కరికీ హెచ్ఎండిఏ తరపున ఉచితంగా మాస్క్‌లను కూడా పంపిణీ చేయనున్నారు. షాపింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరిన్ని ఎక్కువ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో పాతబస్తీ నుంచి బ్యాంగిల్స్, ఆర్టిఫిషియల్ జ్యూయలరీ, లైవ్ బ్యాంగిల్స్, పెరల్సెట్ , హైదరాబాద్ పరిమళాన్ని తెలిపే అత్తర్ వ్యాపారులు పాలు పంచుకోనున్నారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా చేనేత వస్ర్తాలు, హ్యాండ్ క్రాప్ట్ స్టాళ్లు అలరించనున్నాయి.
ఆహార ప్రియులను అలరించడానికి ఛాట్ మొదలుకుని కబాబ్స్ వరకూ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. టాంక్ బండ్ పై చెత్తాచెదారం పేరుకోకుండా ప్రత్యేకంగా డస్ట్బిన్లను, మహిళలకు మొబైల్ టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయన్నారు. సన్ డే ఫన్డే ఎప్పటికి గుర్తుండి పోయేలా అన్నివయస్సుల వారిని దృష్టిలో ఉంచుకుని వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.