నేల సంరక్షణపై అవగాహన సదస్సు

ABN , First Publish Date - 2020-12-06T05:48:41+05:30 IST

ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా శనివారం కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో నేలల సంరక్షణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

నేల సంరక్షణపై అవగాహన సదస్సు
వ్యవసాయ కళాశాల విద్యార్థుల ప్రదర్శనను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

కలికిరి, డిసెంబరు 5: ప్రతి మూడేళ్లకూ భూసార పరీక్షల ద్వారా నేల ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచవచ్చని తిరుపతి ప్రాంతీయ పరిశోధనా స్థానం సహ పరిశోధన డైరెక్టర్‌ డా.ఎల్‌.ప్రశాంతి తెలిపారు.   ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా  శనివారం కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో నేలల సంరక్షణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవన ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. తిరుపతి మట్టి పరీక్ష కేంద్రం ఏడీఏ డి.జ్యోతిర్మయి మాట్లాడుతూ నేల స్వభావాన్ని బట్టి పూత, పిందె రాలకుండా సూక్ష్మ పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. మృత్తిక శాస్త్రవేత్త మదనమోహన్‌ మాట్లాడుతూ విచ్చలవిడిగా భాస్వరం, నత్రజని ఎరువుల వాడకంతో జిల్లాలోని 50 శాతం నేలల్లో జింక్‌ లోపం అధికంగా ఉందన్నారు. కలికిరి కేవీకేలో చేస్తున్న మట్టి పరీక్షలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోఆర్డినేటర్‌ డా.ఎం. రెడ్డికుమార్‌ కోరారు. వివిధ నేలల్లో పంటల సాగు గురించి వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను శాస్త్రవేత్తలు, రైతులు పరిశీలించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. సహజ, ఆర్‌.ప్రసన్నలక్ష్మి, వ్యవసాయాధికారిణి లక్ష్మీప్రసన్న, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:48:41+05:30 IST