Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేసవి సెలవుల్లో ఒత్తిడిని దూరం చేద్దాం

చిన్నారుల సంరక్షణ ఇలా..

సానుకూల దృక్పథమే కీలకం

వారికి సమయం కేటాయించడం అవసరం 

సోషల్‌ మీడియాకు దూరంగా.. సహజత్వానికి దగ్గరగా ఉంచడమూ ముఖ్యం


హైదరాబాద్‌ సిటీ : రాష్ట్రంలో వేసవి సెలవులు ఆరంభమయ్యాయి. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. కొన్ని ప్రైవేట్‌  స్కూల్స్‌లో ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి  వారు కూడా మంగళవారం నుంచి అధికారికంగా క్లాస్‌లకు విరామం ప్రకటించనున్నారు. రెండేళ్ల క్రితం వరకూ వేసవి సెలవులు వస్తున్నాయంటే చిన్నారుల మొహంలో ఆనందం తొణికిసలాడేది. ప్రస్తుతం ప్రతిరోజూ సెలవులాగానే ఉండటం, బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, గాడ్జెట్స్‌కు అతుక్కుపోవడం, ఔట్‌డోర్‌ కాదు కదా ఇండోర్‌ గేమ్స్‌ కూడా ఆడే అవకాశాలు కూడా లేకపోవడం వల్ల పిల్లలు నిరాశకు లోనవుతున్నారు. నిన్నటి వరకూ ఆన్‌లైన్‌ క్లాస్‌లు జరగడంతో కనీసం నాలుగైదు గంటలు అయినా టీచర్లు చెప్పేది వింటూ ఆ తరువాత బోధనాంశాలను ప్రాక్టీస్‌ చేస్తూ గడిపే వారు. ఇకపై ఎలా అన్నదే ప్రశ్న. అధికారికంగా లాక్‌డౌన్‌ లేదన్న మాటే కానీ అనధికారికంగా పిల్లల వరకూ ఇప్పుడు చాలా ఇళ్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేవిప్పుడు. ఇప్పటికే కొన్ని దేశాలలో ఇదే తరహా పరిస్థితులు ఎదుర్కొంటున్న పిల్లల పరిస్థితిపై చేసిన అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం.. పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్‌లకు కారణమవుతుందని వెల్లడైంది. పాఠశాలలకు దూరంగా, ఎక్కువ కాలం ఇళ్లకే పరిమితం కావడం.. కరోనా భయానక పరిస్థితులు ఎప్పటికి పోతాయో తెలియని సందిగ్ధం పిల్లల్లో తెలియకుండానే ఒత్తిడి, ఆందోళనను మరింత పెంచుతున్నాయంటున్నారు సైకాలజి్‌స్టలు. 


దీనికి తోడు తల్లిదండ్రులలో ఎవరైనా కరోనా బారిన పడితే వారిని దూరంగా ఉంచడం.. లేదంటే తల్లిదండ్రులు విధుల కోసం బయటకువెళ్తూ పిల్లలు ఎక్కడ బయట తిరుగుతారోననే భయంతో వారిని ఇళ్లలో పెట్టి తాళం వేయడం వంటి సంఘటనలు సమస్యలకూ దారి తీస్తుందని వెల్లడిస్తున్నారు చైల్డ్‌ సైకాలజి్‌స్టలు.


తల్లిదండ్రులదే బాధ్యత

కరోనా వచ్చిన తరువాత తల్లిదండ్రులపై ఒత్తిడి కూడా పెరిగిపోయింది. హాయిగా సాగిపోతున్న జీవితాలను కకావికలం చేసింది కరోనా. ఓ పక్క ఆఫీసు ఒత్తిళ్లు, మరో పక్క కరోనా భయాలు. ఇవి చాలదన్నట్లు పిల్లల పెంపకం, లాక్‌డౌన్‌ విధిస్తారనే భయం తల్లిదండ్రులపై ఒత్తిడి విపరీతంగా పెంచేసింది. తమ ఆందోళన, ఒత్తిడిని కోపంగా మార్చుకుని, పిల్లల మీద దానిని చూపుతున్న తల్లిదండ్రులు కొంతమంది ఉంటే, పిల్లలను ఎలా సముదాయించాలో తెలియక నిరాశలో కూరుకుపోతున్న తల్లిదండ్రులూ ఉన్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితులను తట్టుకోగలగడం కష్టసాధ్యమే. కానీ అసాధ్యం మాత్రం కాదు. కావాల్సిందల్లా ఓపిక, పట్టుదల అని అన్నారు సైకాలజిస్ట్‌ కళ్యాణ్‌. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎవరూ చూడనటువంటి పరిస్ధితి ఇది. కరోనా భూతం నుంచి మనల్ని, కుటుంబ సభ్యులను కాపాడుకోవడంతోపాటు మానసికంగా ఆ ప్రభావం మనమీద, మనం తీసుకునే చర్యల ద్వారా పిల్లల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఓ రకంగా ప్రస్తుతం తల్లిదండ్రులు కత్తిమీద సాము చేస్తున్నారు. స్కూల్స్‌ లేవు, యాక్టివిటీస్‌ లేవు. సోషల్‌ మీడియా విస్తృతమైన కాలం.  చెడు ఎంత త్వరగా చేరుతుందో ఊహించలేని కాలమూ ఇదే. వీటన్నింటినీ దూరంగా తోసి పిల్లలపై ఒత్తిడి లేకుండా వారిని సరైన మార్గంలో మళ్లించాలనే పాజిటివ్‌ పేరెంటింగ్‌ కావాలి. పిల్లలతో పిల్లాడిగా గడపాల్సిన సమయంలో ఉండాలి, తల్లిదండ్రులుగా కేరింగ్‌ తీసుకోవాలి, అన్నిటికీ మించి ఒత్తిడి పెంచుకోకుండా, ఎదుటి వారికి ఒత్తిడి కలిగించకుండా వ్యవహరించాలి. ఓ విధంగా నేటి మల్టీటాస్కర్స్‌ ఈ విషయంలో కాస్త విజయవంతమైనట్లే కనబడుతున్నారు. కానీ ఇంకాస్త శద్ధ్ర చూపాల్సిన అవసరం ఉంది అన్నారు. ఒకప్పటితో పోలిస్తే న్యూక్లియర్‌ ఫ్యామిలీల కాలంలో తల్లిదండ్రుల బాధ్యత పేరెంటింగ్‌ పరంగా బాగా పెరిగింది. ఒకప్పుడు ఇంటిలో పెద్దవారు చాలా వరకూ పిల్లలను క్రమశిక్షణలో పెట్టేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేదంటే ఇబ్బంది పడేది కూడా వారేనని చెబుతున్నారు సైకాలజిస్ట్‌లు. 


అప్రమత్తత అవసరం

సామాజిక మాధ్యమాల వినియోగం తగ్గించేలా చూడాలి

స్నేహితులను కలిసే అవకాశాలు లేవిప్పుడు. ప్రత్యామ్నాయం అంటే సామాజిక మాధ్యమాలు. ఆరవ తరగతి పిల్లలకు కూడా వాట్సాప్‌ గ్రూప్‌లున్నాయిప్పుడు. ఇక ఫేస్‌బుక్‌ లాంటి వాటిల్లో ఖాతాలను గురించి చెప్పేదేముంది? కౌమారదశ చిన్నారులు ఈ మాధ్యమాల వినియోగం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలిసీ తెలియనితనం, విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న కంటెంట్‌ వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. శారీరకంగా, మానసికంగా వారు పెద్ద వయసు వారికి దగ్గరగా ఉండవచ్చు. కానీ మానసికంగా వారి ఎదుగుదల మాత్రం తక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులు, అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ వల్ల దారితప్పే అవకాశాలున్నాయి. తల్లిదండ్రులు పిల్లల గాడ్జెట్స్‌ వినియోగం పై అప్రమత్తంగా ఉండాలి.


ప్రతి దానికీ సమయం.. 

ఇంట్లోనే ఉంటున్నాం కదా అని ఏదో ఒక సమయంలో తినడం, నచ్చిన సమయంలో పడుకోవడం కాకుండా ప్రతిదానికీ నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. వ్యాయామాలకూ ప్రాధాన్యమివ్వాలి. అవి ఇంటిలోనే చేసుకునేందుకు అనువుగా ఉండాలి.


కంటెంట్ల విషయంలో..

అశాస్త్రీయ, ధ్రువీకృతం కాని సమాచారం సామాజిక మాధ్యమాలలో చాలా ఎక్కువగా సర్క్యులేట్‌ అవుతుంది. అలాంటి కంటెంట్‌ పిల్లల దరి చేరకుండా చూడటంతోపాటు వారికి అర్థమయ్యేలా ఆయా అంశాల గురించి చెప్పాలి. ముఖ్యంగా ఒత్తిడికి గురి కాకుండా కాపాడుకోవాలి. ఒకవేళ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారనుకుంటే నిపుణుల సలహా తీసుకోవాలి. ఎలా ఉన్నారో తెలుసుకోవాలి పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం ముఖ్యం. వారు ఒంటరిగా లేదంటే మీతో కలిసి ఉన్నప్పటికీ ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి. వారికి మీరున్నారనే భరోసా కలిగించడంతోపాటు బయట ఉన్న ప్రస్తుత పరిస్థితులను వివరించే ప్రయత్నం చేయాలి.  


హాబీలకు సమయం కేటాయించాలి

రోజంతా ఇంట్లోనే ఉంటారు. సమ్మర్‌ క్లాస్‌లు ఎలాగూ ఉండవు. ఆన్‌లైన్‌లో కొంతమంది నిర్వహిస్తున్నామంటున్నా అవి ఫాలో అయ్యే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. సమయం సద్వినియోగం చేయడం ఎలాగంటే.. వారికి ఇష్టమైన హాబీలు ప్రాక్టీస్‌ చేసేలా చేయడమే. అలాగని చదువు అని వెంటపడటం, లేదంటే ఫలానాది చేయండి అని ఒత్తిడి చేయడం శ్రేయస్కరం కాదు.


ప్రశ్నించడం అలవాటు చేయండి

ప్రశ్నించడం పిల్లలకు అలవాటు చేయండి. అది ఏ అంశం మీద అయినా కావొచ్చు. నిజాయితీగా మీరు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. ప్రశ్నించేతత్త్వం వస్తే అది భవిష్యత్‌కూ మంచిదే. ప్రశ్నలలో అమాయకత్వం ధ్వనిస్తుందా లేదంటే అహంకారం కనిపిస్తే అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. 


జాగ్రత్తలూ చెప్పాలి

కరోనా వైరస్‌ ఒకప్పుడు పిల్లలకు రాదన్నారు. ఇప్పుడు ఎవరినీ ఉపేక్షించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలని వారికి తెలియజేయాలి. కళ్లలో చేతులు పెట్టకపోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, శుభ్రంగా ఉండటం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించాలి.


సరదాగా ఉండండి

మీ కోసమే కాకుండా పిల్లల కోసమూ సమయం కేటాయించాలి. మీకు ఒత్తిళ్లు ఉన్నా.. వారితో సరదాగా గడిపేందుకు సమయం కేటాయించండి. బెడ్‌ టైమ్‌ స్టోరీ్‌సకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అమ్మ చెప్పే నీతికథలు ఎంతమందిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయో!


Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement