మండిపడుతున్న భానుడు

ABN , First Publish Date - 2022-05-25T06:09:36+05:30 IST

భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. నిప్పులు కురిపిస్తున్నాడు.

మండిపడుతున్న భానుడు
సేదతీరుతున్నారు : కొవ్వూరు గోష్పదక్షేత్రంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో కిటకిటలాడుతున్న గోదావరి రేవు

రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

40 డిగ్రీలకు దిగిరాని భానుడు

మూడు రోజులుగా ఇంతే

వేసవి తాపం తాళలేక ఆపసోపాలు

కరెంట్‌ కట్‌కటలతో తీవ్ర ఇక్కట్లు

నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం

మరో నాలుగు రోజులు ఇంతే..


కొవ్వూరు/నిడదవోలు/పెరవలి, మే 24 : భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే నడినెత్తిన మండిపడుతున్నాడు.10 గంటలు దాటిందంటే మలమల మాడ్చేస్తున్నాడు. గత నాలుగైదు రోజులుగా ఎండలు తీవ్రత పెరగడంతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఇంట్లో ఉండలేక..బయటకు రాలేక ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పడమర వాయు వ్య గాలులు వీస్తుండడంతో వడగాడ్పులు అధికంగా వీస్తున్నాయని వాతావరణ శాఖాధికారుల సమాచా రం. జిల్లాలోని రెండు మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ బుధవారం రాజమహేంద్రవరంలో 45.5, కొవ్వూరులో 42, నిడదవోలులో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మిగిలిన మండలాల్లోనూ 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 45.5 డిగ్రీలు రికార్డుస్థాయి ఉష్ణోగ్రత.. ఎండకు తోడు వడగాడ్పులు వీయడంతో ప్రజలు అల్లాడారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు ఇళ్లకు పరిమితం కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూని తలపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలులు వీయడంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఉక్కబోతతో విలవిల్లాడిపోతున్నారు.గత నాలుగు రోజులుగా 10 గంటలు దాటిన తరువాత వ్యాపారాలు లేక దుకాణాలు మూసివేసి సాయంత్రం తెరుస్తున్నారు. తరచూ కరెంట్‌ కోతల వల్ల ఏసీలు పనిచేయక.. ఫ్యాన్‌లు తిరగక సతమతమవుతున్నారు. పలు చోట్ల అధికలోడు కారణంగా ఏసీలు పనిచేయడంలేదు.వ్యవసాయ పనులకు వెళ్లే వారు 12 గంటలు అవకుండానే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు.వివిధ రకాల పంటలపై ఎండలు ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.కూరగాయలు,అరటి తోటలు  ఎండ వేడికి దెబ్బతింటాయని వాపోతున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చ రికల నేపథ్యం లో ప్రజలు హడలిపోతున్నారు. దీనికి తోడు బుధవారం నుంచి రోహిణీ కార్తె ప్రారంభం అవు తుంది. ఇక ఆ పన్నెం డు రోజులు రోహిణి ప్రభావం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతు న్నారు.వేసవితాపం తాళలేక రాజమహేంద్రవరం, కొవ్వూరు, ధవళేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో ప్రజలు గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తూ సేదతీరుతున్నారు. దీంతో ఎక్కడ గోదావరి రేవులు చూసినా నిండుగా కనిపిస్తున్నాయి. 


పగలు ఎండ.. రాత్రి వాన


గోపాలపురం/కొవ్వూరు/ ఉండ్రాజవరం, మే 24 : మండలంలోని పలు గ్రామా ల్లో మంగళవారం మధ్యాహ్నం అకాల వర్షం కురిసింది. గతమూడు రోజులుగా అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కబోతకు ఊపిరాడక చెట్ల క్రింద సేదతీరిన జనానికి వర్షం ఉపశమనమిచ్చింది. మధ్యాహ్నం వరకు ఎండ కారణంగా అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అయితే 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై మండ లంలో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. నందిగూడెం, సంజీ వపురం, రేగులగుంట,బుచ్చంపేట గ్రామాల్లో ఈదురుగాలులకు తోడు వడ గళ్ళతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు.నష్టాలనే మిగుల్చుతుందని వాపోతున్నారు. 


రాత్రి ఈదురుగాలులు


పగలు ఎండతో భానుడు భయపెడితే.. రాత్రికి వరుణుడు విరుచుకుపడ్డాడు.ఈ వానకు వాయుదేవుడు తోడయ్యాడు.. అంతే పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి.. బుధవారం ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిన జనం రాత్రికి కురిసిన వానతో కాస్త చల్లబడ్డారు. అయితే ఈదురుగాలుల కారణంగా ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేశారు. దీంతో పలు చీకట్లు అలుముకున్నాయి.. రాత్రి సమయంలో జనం బయటకు వచ్చి కాసేపు సేదతీరారు. అరటి, మామిడి రైతులు మాత్రం ఈదురుగాలులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది నష్టాలే మిగులుతాయని అంటున్నారు. ఉండ్రాజవరం,దివాన్‌చెరువులో ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు నేలవాలాయి.  కొవ్వూరు, నిడదవోలులో చిరు జల్లులు పడ్డాయి. 



గోదావరిలో మునిగి యువకుడి మృతి


కొవ్వూరు, మే 24 : ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు గోదావరిలో స్నానానికి దిగిన ఒక యువకుడు మృతిచెందినట్టు కొవ్వూరు రూరల్‌ ఎస్‌ఐ జి.సతీష్‌ తెలిపారు. తాడేపల్లిగూడెం మం డలం చిన్న తాడేపల్లికి చెందిన దూలపల్లి ప్రేమ్‌కుమార్‌(16) తన స్నేహితులు దిర్సిపాముల రాజేష్‌, దూలపల్లి పవన్‌లతో కలిసి ఆటోలో మంగళవారం కొవ్వూరు మండలం మద్దూరులంక చేరుకున్నారు. బ్యారేజ్‌ 16వ స్థంభం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు గోదావరి స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ప్రేమ్‌కుమార్‌ నదిలో గల్లంతయ్యాడు.పెద్దగా కేక లు వేయడంతో జాలర్లు నదిలో గాలించి మృతదేహాన్ని  బయటకు తీశారు.స్నేహితులు ప్రేమ్‌కుమార్‌ ఇంటికి సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  తెలిపారు.

Updated Date - 2022-05-25T06:09:36+05:30 IST