ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , First Publish Date - 2021-02-28T08:26:58+05:30 IST

రాష్ట్రంలో వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. మూడు, నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో రేడియేషన్‌ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు

ఠారెత్తిస్తున్న ఎండలు

నైరుతి గాలులతో వేడెక్కిన వాతావరణం 


విశాఖపట్నం/అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. మూడు, నాలుగు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణంలో రేడియేషన్‌ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా, ఈ ఏడాది సుదీర్ఘకాలం శీతాకాలం కొనసాగింది. ఫిబ్రవరి మూడో వారం వరకు చలి వాతావరణం నెలకొంది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. అయితే వారం నుంచి చలి తీవ్రత తగ్గి ఎండ పెరిగింది. సముద్రం నుంచి తేమగాలులు, రాష్ట్ర పరిసరాల్లో ఆవర్తనాలు లేకపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉంది. దీనికితోడు నైరుతి నుంచి గాలులు వీయడంతో వాతావరణం వేడెక్కింది. సాధారణంగానే సూర్యుడు దక్షిణార్థ గోళం నుంచి ఉత్తరార్థ గోళం వైపు పయనించే క్రమంలో దక్షిణ భారతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి ప్రవేశిస్తున్నందున ఎండలు పెరుగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. వేసవి ప్రారంభం కావడంతో బయటకు వెళ్లే వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

Updated Date - 2021-02-28T08:26:58+05:30 IST