ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , First Publish Date - 2022-05-23T05:00:40+05:30 IST

జిల్లాలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రోహిణీ కార్తె రాకుండానే ఎండల తీవ్రత ఒక్క సారిగా పెరిగింది.

ఠారెత్తిస్తున్న ఎండలు
ఏలూరు జూట్‌మిల్‌ వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మానుష్యం

తారస్థాయికి ఉష్ణోగ్రతలు

ఆదివారం భానుడి ప్రతాపం తీవ్రం

కుక్కునూరులో అత్యధిక ఉష్ణోగ్రత

ఏలూరుసిటీ, మే 22: జిల్లాలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రోహిణీ కార్తె రాకుండానే ఎండల తీవ్రత ఒక్క సారిగా పెరిగింది. రెండు రోజుల నుంచి జిల్లాలో అత్యఽధికంగా ఉష్ణోగ్రతలు నమో దవుతున్నాయి. జిల్లాలో ఆదివారం అత్యధికంగా కుక్కునూరులో 45డిగ్రీలు సెంటీగ్రేడ్‌  పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా రాత్రి సమయంలో మాత్రం 26 డిగ్రీలు సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో 44/29, భీమడోలులో 44/29, జంగారెడ్డిగూడెంలో 44/27, నూజివీడు 44/29, కైకలూరు 44/30, ద్వారకాతిరుమల 44/29, పోలవరం 44/27, కొయ్యలగూడెంలో 40/23 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు తమ పగలు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. 

జనం విలవిల

ఉదయం 8గంటలకే భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటోంది. ఉదయం 10 గంటలకే సూర్యుడు చుర్రు మనిపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో ఎండతీవ్రత తీవ్ర స్థాయిలో ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారులన్నీ నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులలోను, ప్రైవేటు వాహనాలలో జన సంచారం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులు, కార్మికుల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయి.  

శీతల పానీయాలకు డిమాండ్‌

ఎండల తీవ్రతను తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ చూసినా పండ్ల రసాలు, షోడాలు, బటర్‌మిల్క్‌, కూల్‌డ్రింక్స్‌, సుగంధి, కొబ్బరి బొండాలు, లస్సీ దుకాణాలు బిజీబిజీగా కనిపిస్తున్నాయి. ఉదయం 10గంటల నుంచే ప్రజలు ఇళ్ళకి పరిమితం అవుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ బయటకు రావటం లేదు. గాలిలో తేమశాతం తగ్గటంతో భరించలేని ఉక్కబోతతో ప్రజలు విలవిలలాడుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ ఉక్కబోత తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఉక్కబోతను తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఉక్కబోతతో పాటు వడగాడ్పుల తీవ్రత ఆదివారం ఎక్కువగా కనిపించింది.

రోహిణి కార్తె ప్రభావమా...

ప్రస్తుతం జిల్లాలో కృత్తిక కార్తె నడుస్తోంది. ఈ కార్తెలో ఎండల తీవ్రత ఉంటుంది కాని ఇంత స్థాయిలో ఉండదని చెబుతున్నారు. ఇక ఈనెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. అప్పుడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. రోహిణీ కార్తెలో రోళ్ళు బద్ధలయ్యే విధంగా ఎండల తీవ్రత ఉంటుందని నానుడి. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితు లలో తేడా కనిపిస్తోంది. కాలుష్యం వల్లనో గాని, చెట్లు లేక పోవటం వల్లనో కాని ఎండల తీవ్రత ఏడాదికేడాదికి పెరిగిపోతోందే తప్ప ఎక్కడా తగ్గిన పరిస్థితులు కనిపించడం లేదు.





Updated Date - 2022-05-23T05:00:40+05:30 IST