భారత సంతతి అమెరికా పోలీసుపై ప్రశంసల వర్షం! నిందితుడు కాల్పులకు తెగబడుతున్నా లెక్కచేయక..

ABN , First Publish Date - 2022-01-25T23:57:56+05:30 IST

పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డ ఓ దుండగుడిని ఎదిరించి మట్టుపెట్టిన భారత సంతతి పోలీసు అధికారిపై అమెరికాలో ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.

భారత సంతతి అమెరికా పోలీసుపై ప్రశంసల వర్షం!  నిందితుడు కాల్పులకు తెగబడుతున్నా లెక్కచేయక..

ఇంటర్నెట్ డెస్క్: పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డ దుండగుడిని మట్టుబెట్టిన భారత సంతతి పోలీసు అధికారిపై అమెరికాలో ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. విధుల్లో చేరి ఏడాది కూడా కాకుండానే.. అతడు అత్యంత ధైర్యసాహసాలు, తెగువ ప్రదర్శించి అందరిచేతా ప్రస్తుతం హీరో అనిపించుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. సుమిత్ సూలన్ ఇటీవలే పోలీసు ఉద్యోగంలో చేరాడు. కాగా.. జనవరి 21న ఓ హార్లెమ్ ప్రాంతానికి(న్యూయార్క్ నగరం) చెందిన ఓ మహిళ.. పోలీసు సహాయం కోరుతూ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసింది. తన కొడుకు తుపాకీతో బెదిరిస్తున్నాడని పేర్కొంది. దీంతో సుమిత్.. మరో ఇద్దరు సహచర పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 


ఈ క్రమంలో నిందితుడు లాషాన్ మెక్‌నీల్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఫలితంగా.. జేసన్ రివేరా అనే అధికారి అక్కడికక్కడే మరణించారు. మరో పోలీసుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలోనే వేగంగా స్పందించిన సుమిత్.. గదిలో ఉన్న నిందితుడి తల్లి, మరో చిన్నారిని పక్కకు జరిపి లాషాన్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు. కాగా.. నిందితుడు సూపర్ చార్జడ్ తుపాకీ వాడిన కారణంగా సుమిత్‌కు కూడా తృటిలో ప్రమాదం తప్పింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు సోమవారం నాడు మృతి చెందాడు.  


ఇక తన కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్న సుమిత్ మాతృమూర్తి దల్వీర్ కూడా మురిసిపోయారు. ‘‘నా బిడ్డ గొప్ప పని చేశాడని అందరూ అంటుంటే నాకు గర్వంగా అనిపించింది’’ అని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం సుమిత్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. గతేడాది ఏప్రిల్‌లోనే అతడు విధుల్లో చేరాడు. తొలినాళ్ల నుంచి అతడు తన పనితీరుతో సాటి ఉద్యోగులను, పైఅధికారులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. వారంతా అతడికి ‘సూపర్ రూకీ’ అని పేరు పెట్టారు కూడా! కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని అమెరికాలో సరదాగా రూకీ అని పిలుస్తుంటారు. 

Updated Date - 2022-01-25T23:57:56+05:30 IST