Advertisement
Advertisement
Abn logo
Advertisement

శభాష్‌ రాజు..!

ప్రాణాలకు తెగించి ఏడుగురిని కాపాడిన సుజయ్‌కుమార్‌రాజు

ఈ యువకుని పేరు గంధం సుజయ్‌కుమార్‌రాజు. వయస్సు 30 ఏళ్లు. వీరి స్వగ్రామం పులపత్తూరు. దుబాయ్‌లో ఉంటూ రెండేళ్ల కిందట ఇంటికొచ్చాడు. ఇతను ఒక్కడే కొడుకు.  గత శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో కనీవిని ఎరుగని వరద నీరు గ్రామంపై పడింది. చెయ్యేరు నదికి ఆనుకొని లోతట్టుగా వీరి ఇల్లు ఉంది. ఉదయం 6గంటలకు ఒక్కసారిగా సునామీ వచ్చినట్లు గ్రామంపై నీరు వచ్చింది. తమ ఇల్లు మునిగిపోవడం చూసి అమ్మా నాన్నను, చుట్టుపక్కల ఏడుగురిని మొత్తం 9 మందిని కొద్ది దూరంలో ఉన్న ఓ ఇంటిలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ప్రాణాలకు తెగించి సుజయ్‌ ఏకంగా ఏడుగురిని కాపాడాడు. ఆ సంఘటన వివరాలు ఆయన మాటల్లోనే... 

‘‘నేను శుక్రవారం పొద్దన్నే నిద్రలేవంగానే 6గంటలకే భారీ శబ్దాలతో అంతెత్తున అలలతో గ్రామంపై వరద నీరు వచ్చింది. కళ్లు పులుముకునేలోగా నీరంతా మా ఇంటిని చుట్టింది. అంతే పడుకొని ఉన్న ముసలి వారైన మా అమ్మనాన్న గంధం నరసరాజు, వెంకటసుబ్బమ్మను లాక్కుంటా పరిగెత్తాను. ఎదురుగా కూడా నీరు చుట్టుముట్టింది. చేసేది లేక పక్కనున్న ఇంటిలోకి వెళ్లాం. మాతో పాటు పక్కనే రామకృష్ణంరాజు, వరలక్ష్మి, శివ, లక్ష్మీదేవి, కల్పన, శంకరమ్మ, ఆదిలక్షుమ్మను కూడా ఆ ఇంటిలోకి తీసుకుపోయాం. తీసుకెళ్లామో లేదో పైస్లాబుకు రెండు అడుగుల కింద వరకు నీరు చేరింది. అక్కడే ఉన్న రెండుమంచాలను ఒకదానిమీద ఒకటి వేసి అందరినీ పైకి ఎక్కించాను. ఒక్క సారిగా అల రావడంతో డోరు పడిపోయింది. అంతే.. అందరూ కింద పడిపోయారు. వారు ఇక కొట్టుకుపోయే సమయంలో కింద పడిండే డోరును అడ్డంగా తిప్పి కింద, పైన నీళ్లు పోయే విధంగా పెట్టి దాలమందరపు చువ్వను గట్టిగా పట్టుకున్నాను. వీళ్లంతా నన్ను పట్టుకున్నారు. మరో అల రావడంతో అందరం తలకిందులయ్యాం. అయినా వీళ్లందరినీ 35 నిమిషాల పాటు నా భుజాలపైన, మంచాలపైన తిరిగి ఎక్కించుకున్నాను. ఇంటి పై ఫ్యాను చువ్వను పట్టుకుని నిలదొక్కుకున్నా. అయితే 65 ఏళ్లు పైబడిన శంకరమ్మ, ఆదిలక్షుమ్మ ఊపిరి ఆడక చనిపోయారు. వరదతో సుమారు ఒకటిన్నర గంట పోరాడాం. నా చేతులు కూడా పైచువ్వ పట్టుకొని పట్టుకొని బలహీన పడిపోయాయి. ఎలాగో ఒకలా అందరినీ కాపాడుకోగలిగాను. మా అమ్మనాన్నలతో పాటు మొత్తం ఏడుగురిని ప్రాణాలతో కాపాడుకోవడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం’’.

- రాజంపేట

వరద నీళ్లు పోవడంతో ఇప్పటికీ కళ్లు సరిగా తెరవలేకుండా ఉన్న సుజయ్‌కుమార్‌రాజు


Advertisement
Advertisement