సుజలాం..స్వ‘ఫలం’

ABN , First Publish Date - 2020-10-12T05:56:06+05:30 IST

ఓ పథకం కొనసాగింపు, ముగింపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం వెలువరించిన నిర్ణయాలను జిల్లా

సుజలాం..స్వ‘ఫలం’

ప్రభుత్వ నిబంధనలకు మంగళం పాడిన ఏటీఎం

కమీషన్లు దండుకుని బినామీలకు ప్లాంట్ల కేటాయింపు

నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకుల నీటి వ్యాపారం

గడువు ముగిసినా యథాతథంగా ప్లాంట్ల నిర్వహణ


అశ్వారావుపేట, అక్టోబరు 11: ఓ పథకం కొనసాగింపు, ముగింపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం వెలువరించిన నిర్ణయాలను జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డివిజన్‌, మండల స్థాయిలో ఆయా అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ అశ్వారావుపేటలో పంచాయతీ కార్యదర్శులే కలెక్టర్‌ మాదిరి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ స్వలాభం కోసం ఇష్టానుసారం గా నిబంధనలను మార్చేస్తూ దర్జాగా వెనకేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో వారు ఆడింది ఆట పాడింది పాటగా మారిందని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.


బినామీలకు అమ్ముకున్నారు

2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 600కిపైగా మండలాల్లో తక్కువ ధరకు ప్రజలకు శుద్ధనీటిని అందించాలనే ఉద్దేశ్యంతో సుజలాం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు బాధ్యతలను ఆర్‌డబ్ల్యూఎస్‌, గ్రామపంచాయతీ, ఏటీఎం అనే ఏజెన్సీకి  అప్పగించారు. ఇందులో ఏటీఎం అనేది కాంట్రాక్టు ఏజెన్సీ. ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన భూమితో పాటు, బోరును సంబంధిత గ్రామపంచాయతీలే ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ పథకాన్ని పదేళ్లపాటు నడుపుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇక్కడ ఏటీఎం ఏజెన్సీ ప్రభుత్వ నిబంధనలకు మంగళం పాడింది. బినామీల దగ్గర కమీషన్లు దండుకుని వాటర్‌ ప్లాంట్లు వారికే దక్కేలా చేసింది. వాస్తవానికి వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఆయా ప్రజలకు రూ. రెండు ఇరవై లీటర్ల నీటిని విక్రయించాలని ప్రభుత్వం సూచించింది.


ఉదాహరణకు అశ్వారావుపేటలో ఏటీఎం సంస్థకు డబ్బులు చెల్లించి ప్లాంటు నడుపుకుంటున్న వ్యక్తి వాణిజ్య అవసరాలకు నీటిని విక్రయించడం మొదలుపెట్టారు. రూ. రెండుకు విక్రయించాల్సిన నీటిని రూ.20కి కూడా అమ్ముకున్నార ని ఇక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ జూన్‌తో గడువు ముగిసినా ప్లాంట్‌ను నిర్వహిస్తుండటం గమనార్హం. పైగా ఒకప్పుడు పంచాయతీ ఈవోగా పనిచేసిన వ్యక్తిని మచ్చిక చేసుకుని ప్లాంట్‌  ఇంకో పదేళ్లు నడుపుకునేలా ఉత్తర్వులు జారీ చేయించుకోవడం గమనార్హం. జూన్‌ ఏడో తేదీతో ఒప్పందం ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ అధికారులు సదరు ప్లాంట్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకుండా మీన వేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక్క అశ్వారావుపేటలోనే కాదు జిల్లా మొత్తం దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.


పొడగింపు వెనుక మతలబు ఏమిటో?

ఉన్నతాధికారులతో సంబంధం లేకుండా మరో పదేళ్లపాటు వాటర్‌ ప్లాంట్‌ను గ్రామ పంచాయతీ స్థలంలో నడుపుకునేందుకు అనుమతిస్తూ ఓ పత్రాన్ని ఓ మాజీ ఈవో జారీ చేశారు. ఇక్కడ మరో ముఖ్యమైన విశేషమేమిటంటే 2020 జూన్‌లో ఒప్పందం పూర్తవవుతున్న ఈ పథకానికి 2018లోనే ఆ అధికారి నేరుగా మరో పదేళ్ళపాటు గడువును పొగిడిస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం. మరో విశేషమేమిటంటే ప్లాంట్‌ నిర్వాహకుడు 2018లోనే తనకు అప్పటి ఈవో అనుమతి ఇచ్చాడని చెపుతుండగా... అప్పటి ఈవో కుమార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా అసలు నేనలాంటి అనుమతులేవి ఇవ్వలేదని చెప్పడం విశేషం. 


సుజలాం వాటర్‌ ప్లాంట్‌ ద్వార ప్లాంట్‌ వద్దకు వచ్చిన వారికి తక్కువ ధరకు శుద్ధనీటిని ప్రజలకు అందించాలి. వాహనాల ద్వారా తరలించకూడదు. అధిక ధరలకు విక్రయించకూడదు. కానీ ఇప్పటి వరకు ప్లాంట్‌ను నిర్వహించిన బినామీ వ్యక్తులు దర్జాగా నీటి వ్యాపారం చేశారు. దీనిపై అప్పట్లోనే అనేక ఫిర్యాదులు వచ్చాయి. అశ్వారావుపేటలో అక్రమ వ్యాపారంతో రెండు చేతుల సంపాదించిన బినామీ వ్యక్తి తన గడువును పదేళ్ల పాటు పొడిగించారు అంటూనే తాజాగా గడవును మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తనకు అనుమతి నివ్వాలని, అవసరమైతే నామ మాత్రం పీజును చెల్లిస్తానని పంచాయతీకి ధరఖాస్తు చేసుకున్నారు. గతంలోనే అనుమతి ఉంటే మరలా ఇప్పుడు ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటనేది అర్థం కాని ప్రశ్న.


గ్రామ పంచాయతీ ఆస్థులతో నడిచే ప్లాంట్‌ను వెంటనే స్వాధీనం చేసుకొని టెండర్లు పిలిచి మరొకరికి అప్పగించాలని పట్టణానికి చెందిన పలువురు యువకులు కోరుతున్నారు. ఈ విధానం వల్ల పంచాయతీకి ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. స్థానిక నిరుద్యోగ యువతకి ఉపాది కలుగుతుందని చెబుతున్నారు. స్థానికేతరులైన వ్యక్తుల కబంధ హస్తాలలో నడిచిన ఈ ప్లాంట్‌ను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.


దీనిపై అశ్వారావుపేట పంచాయతీ ఈవో హరికృష్ణను వివరణ కోరగా సుజలాం వాటర్‌ ప్లాంట్‌ ఒప్పందం గడువు ముగిసింది. ప్రస్తుతం మేమంతా ధరణి సర్వేల్లో ఉన్నాం. సర్వే పూర్తయిన వెంటనే టెండర్లు నిర్వహించి ప్లాంట్‌ను నిర్వహిస్తాం. గత ఈవో పదేళ్లపాటు అనుమతి ఇచ్చారని నిర్వాహకుడు చెబుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా ఆయన బదులిస్తూ ఆ ఉత్తర్వులు ఇవ్వడానికి మాకు అర్హత లేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.

Updated Date - 2020-10-12T05:56:06+05:30 IST