పల్లెకు సుిస్తీ

ABN , First Publish Date - 2022-07-01T06:39:41+05:30 IST

వర్షాకాలం మొదలైంది. సీజనల్‌ వ్యాధులు పెరుగుతు న్నాయి.

పల్లెకు సుిస్తీ
శిరివెళ్ల : రుద్రవరం మలుపులో కుళాయి వద్ద నిల్వ ఉన్న మురుగు నీరు

 అతిసారతో ఆస్పత్రుల పాలు 

కలుషిత నీరు, పారిశుధ్య లోపమే కారణం

నిర్లక్ష్యంగా పంచాయతీ, తాగునీటి సరఫరా అధికారులు


వర్షాకాలం మొదలైంది. సీజనల్‌ వ్యాధులు పెరుగుతు న్నాయి. పల్లెలు మంచాన పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిసారతో ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో మార్పులు... వర్షాలతో భూగర్భ జలాల్లో కొత్త నీరు చేరడం వల్ల నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. కలుషిత నీరు, ఆహారం వల్ల అతిసార మెల్లగా విజృంభిస్తోంది.  అధికారులు నామమాత్రంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని.. పారిశుధ్య పనులు అంతంతమాత్రంగానే చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


-శిరివెళ్ల 



అధికారుల నిర్లక్ష్యం... ప్రాణాలతో చెలగాటం 


పారిశుధ్యాన్ని మెరుగుపరిచి, వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్‌ చేయించాల్సిన ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీజనల్‌ వ్యాధుల కాలం వచ్చి గ్రామాలకు గ్రామాలు మంచం పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్లిక్‌ కుళాయిలు, చేతిపంపులు, వాటర్‌ ట్యాంకులు, బోర్ల వద్ద మురుగునీరు నిలిచి ఉంటోంది. పగిలిన పైపులైన్లను మరమ్మతు చేయకపోవడంతో తాగు నీరు కలుషితం అవుతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మినీ, ఓవర్‌హెడ్‌ ట్యాంకులను శుభ్రం, క్లోరినేషన్‌ చేసి వివరాలను వాటిపై నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పని జరగడం లేదు. గ్రామాల్లోని ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పైకి ఎక్కేందుకు నిచ్చెనలు లేకపోవడంతో చాలా చోట్ల శుభ్రం చేయడం లేదు. మినీ వాటర్‌ ట్యాంకులపై మూతలు ధ్వంసమవ్వడంతో నీరు కలుషితమవుతోంది. బోర్లలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌ రిపోర్టు ఆధారంగా ప్రజలకు నీళ్లను సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. 


గ్రామాల్లో విజృంభిస్తున్న అతిసార 


ఏప్రిల్‌ నెలలో ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో కలుషిత నీరు, పారిశుధ్య లోపంతో అతిసార ప్రబలి ముగ్గురు మృతి చెందారు. దాదాపు 40 మంది ఆసుపత్రిపాలయ్యారు. మే నెలలో బండి ఆత్మకూరు మండలం నారపురెడ్డి కుంట గూడెంలో అతిసార లక్షణాలతో ఒక చిన్నారి మృతి చెందింది. మరో 12 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఈ ఘటనలు మరువకుముందే శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో నాలుగు రోజుల కిందట పది మంది అతిసార బారినపడ్డారు. వాంతులు, విరేచనాలకు గురైన వారిలో చిన్నారులు, వృద్ధులే ఎక్కువ శాతం మృతి చెందుతున్నారు. 


 తీసుకోవాల్సిన జాగ్రత్తలు 


శరీరంలో నీరు, లవణాలు తక్కువై విపరీతంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడతారు.  నీటి శాతం ఒక్కసారిగా తగ్గడం వల్ల నీరసించిపోతారు. చర్మం సహజస్థితిని కోల్పోతుంది. దాహంతో నోరు ఎండిపోతుంది. మూత్ర విసర్జన తగ్గిపోతుంది. ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారికి వెంటనే వైద్యం చేయించాలి. రోగి శరీరంలో నీరు, లవణాల శాతాన్ని పెంచేందుకు ఎలకో్ట్రరల్‌ పౌడర్‌ను మంచి నీళ్లలో కలిపి తాగించాలి. కాచి, వడపోసిన నీరు మాత్రమే ఇవ్వాలి. ఆహార పదార్థాలపై దుమ్ము, దూళి, ఈగలు వాలకుండా పాత్రలపై మూతలు పెట్టి ఉంచాలి. నిల్వ ఉంచిన, రహదారిపై అపరిశుభ్రంగా ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించడం ఉత్తమం. ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. భోజనానికి ముందు చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. 


వనికెందిన్నెలో మరో ముగ్గురికి అస్వస్థత


 శిరివెళ్ల : వనికెందిన్నె గ్రామంలో గురువారం మరో ముగ్గురు డయేరియా బారినపడ్డారు. మూడు రోజులుగా పది మంది అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యర్రగుంట్ల పీహెచ్‌సీ వైద్యాధికారి రంగ స్వామి సూచించారు. యర్రగుంట్ల పీహెచ్‌సీకి  చిటికెల వెంకటేశ్వర్లు, పుల్లయ్యను నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు, శేఖర్‌ను కర్నూలు వైద్యశాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. 


నీళ్లలో పురుగులు వస్తున్నాయి 


శిరివెళ్ల జెండాపేటలోని వాటర్‌ ట్యాంకును నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో నీటిలో పురుగులు వస్తున్నాయి. ఈ నీరు తాగి కాలనీ వాసులు రోగాలబారిన పడి ఆసుపత్రులపాలవుతున్నారు.  క్లోరినేషన్‌ చేయాలని పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. 


 -ముల్లా రజాబ్‌షా, జెండాపేట, శిరివెళ్ల 

Updated Date - 2022-07-01T06:39:41+05:30 IST