ఆస్తిలో వాటా కోసం కుమారుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-11-15T04:25:08+05:30 IST

‘ఒక్కగానొక్క కొడుకుని ఆస్తి మొత్తం కాకపోయినా ఇంట్లో ఒక పోర్షన్‌ అయినా తనపేరిట రాసివ్వండి. కులాంతర వివాహం చేసుకున్న నన్ను తల్లిదండ్రులే ఆదుకోవాలి. లేదంటే డాబా పైనుంచి దూకి చచ్చిపోతా’ అంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం జరిగింది.

ఆస్తిలో వాటా కోసం కుమారుడి ఆత్మహత్యాయత్నం
రామకృష్ణకు సర్దిచెబుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ మహేష్‌

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హైడ్రామా

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఘటన

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 14 : ‘ఒక్కగానొక్క కొడుకుని ఆస్తి మొత్తం కాకపోయినా ఇంట్లో ఒక పోర్షన్‌ అయినా తనపేరిట రాసివ్వండి. కులాంతర వివాహం చేసుకున్న నన్ను తల్లిదండ్రులే ఆదుకోవాలి. లేదంటే డాబా పైనుంచి దూకి చచ్చిపోతా’ అంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణంలోని గాంధీనగర్‌ నాలుగో నెంబర్‌ వీధికి చెందిన గునగంటి రామకృష్ణ 14ఏళ్ల క్రితం అనూష అనే అమ్మాయిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వారి వివాహానికి అతడి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ప్రస్తుతం కొత్తగూడెంలో తాపీ పనిచేస్తూ ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. అయితే తన తల్లిదండ్రుల ఆస్తి నుంచి కొంతైనా రాసివ్వాలని, ఆస్తిమొత్తం తనకు అవసరం లేదని, ఇంట్లో ఓ పోర్షన్‌ అయినా తనపేరుతో రాసిస్తే చాలంటూ రామకృష్ణ ఆదివారం గాంధీనగర్‌లోని సొంత ఇంటి డాబాపైకి ఎక్కి దూకుతానంటూ భీష్మించాడు. బంధుమిత్రులు అక్కడికి చేరుకుని ఎంత సర్దిచెప్పినా వినలేదు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బాణోతు రామునాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అక్కడి చేరుకుని.. కింద వలలు ఏర్పాటు చేయడంతోపాటు ఓ అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, డీసీసీబీ డైరెక్టర్‌ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు మండల కన్వీనర్‌ గాదె సత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, కౌన్సిలర్‌ గుండ్ర రఘు, చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌, దొడ్డాకుల గోపాలరావు తదితరుల కూడా అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా రామకృష్ణ వినలేదు. ఆ తర్వాత కొంతసేపటికి రామకృష్ణ తనతోపాటు తీసుకెళ్లిన కిరోసిన్‌ పోసుకున్నాడు. ఈ క్రమంలో ఒప్పంద పత్రాలు రాయిద్దామని చెప్పినా అతను వినకపోవడంతో.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనిచేసే రామిశెట్టి కృష్ణ మిత్రబృందం జోక్యం చేసుకుంది. వారంతా డాబాపైకి వెళ్లి రామకృష్ణను మాటల్లోకి దించి డాబా లోపలికి లాగి బెదిరింపు కథకు తెరదించారు. 

Updated Date - 2021-11-15T04:25:08+05:30 IST