ఇద్దరు యువకుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-11T05:49:07+05:30 IST

ప్రొద్దుటూరుకు చెందిన మౌలా హుస్సేన్‌, తాజూన్‌ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో చివరి వాడు షేక్‌ మహమ్మద్‌ అలి (20) పెయింటింగ్‌ పనులకు వెళ్లేవాడు. వీరి కుటుంబం ఆర్ట్స్‌కాలేజీ రోడ్డులో నివాసముండేది.

ఇద్దరు యువకుల ఆత్మహత్య
మృతి చెందిన మహమ్మద్‌ అలి.. సాయికుమార్‌

తండ్రి మందలించాడని ఒకరు..

వ్యసనాలకు బానిసై మరొకరు

ఇద్దరూ స్నేహితులే


ప్రొద్దుటూరులో బుధవారం ఇద్దరు యువకులు వేర్వేరు  చోట్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ అమ్మాయిని వేధించిన ఘటనలో ఘర్షణ జరగడంతో తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యసనాలను మానుకునేందుకు ఊరొదిలి వెళ్లిపోదామని చెప్పినందుకు మరో యువకుడు ఉరేసుకున్నాడు. మృతులు ఇద్దరూ స్నేహితులు కావడం విశేషం. పోలీసుల కథనం మేరకు..


ప్రొద్దుటూరు క్రైం, ఆగస్టు 10: ప్రొద్దుటూరుకు చెందిన మౌలా హుస్సేన్‌, తాజూన్‌ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమారుల్లో చివరి వాడు షేక్‌ మహమ్మద్‌ అలి (20) పెయింటింగ్‌ పనులకు వెళ్లేవాడు. వీరి కుటుంబం ఆర్ట్స్‌కాలేజీ రోడ్డులో నివాసముండేది. ఇటీవల మౌలానా ఆజాద్‌వీదిలోకి మారారు. మహమ్మద్‌ అలి చెడు తిరుగుళ్లకు, చెడు సావాసాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయిని వేధించాడు. ఈ విషయమై మంగళవారం గొడవ జరిగింది. దీంతో మహమ్మద్‌ అలిని తండ్రి మందలించాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిన మహమ్మద్‌ అలి ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ పాఠశాల అవరణలోని రేకుల గదిలో పైపునకు చీరతో ఉరివేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి మౌలా హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.


ఇంట్లోనే ఉరివేసుకుని

సాంబయ్యగారి వీధిలో నివాసం ఉండే బత్తల నాగరాజు, చౌడమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు సాయికుమార్‌ (21) చెదలమందు కొట్టేందుకు కూలికి వెళ్తుండేవాడు. నాగరాజు పాతచీరల వ్యాపారం చేస్తుండగా, తల్లి చౌడమ్మ తన అత్తతో కలిసి స్థానికంగా ఓ కల్యాణమండపంలో కూలిపనికి వెళ్తుంది. సాయికుమార్‌ చెడు సావాసగాళ్లతో తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. ఇతడిని తరచూ తల్లి మందలిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఊరు మారితేనైనా కుమారుడు బాగుపడతాడని భావించిన తల్లి చౌడమ్మ తన సొంతూరు అనంతపురం జిల్లా రెడ్డిపల్లికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్నే కుమారుడు సాయికుమార్‌కు చెప్పగా సరేననన్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు సాయికుమార్‌ తన అవ్వకు ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పాడు. పని నుంచి ఆమె ఇంటికి రాగా, అప్పటికే ఇంట్లో పైకప్పు కొక్కికి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కన్పించాడు. వెంటనే సాయికుమార్‌ను కిందికి దించి, ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని తల్లి చౌడమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


ఇద్దరూ స్నేహితులు..

ఆత్మహత్యకు పాల్పడ్డ షేక్‌ మహమ్మద్‌ అలి, బత్తల సాయికుమార్‌ స్నేహితులు. ఇద్దరు వ్యసనాలకు బానిసలయ్యారు. చెడు సావాసాలతో తిరిగేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం షేక్‌మహ్మద్‌ అలి ఆత్మహత్య వెలుగుచూడ్డంతో ఘటన స్థలానికి బత్తల సాయికుమార్‌ వెళ్లాడని స్నేహితులు తెలిపారు. అక్కడి నుంచి ఆసుపత్రికి, ఖననం జరిగిన చోటుకు కూడా వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చినా మూడీగా ఉన్నాడు. అనంతరం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


యువతిని మోసం చేశాడని  వలంటీర్‌పై కేసు నమోదు

మైలవరం, ఆగస్టు 10: యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన  గ్రామ వలంటీర్‌పై కేసు నమోదైన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మలమడుగు రూరల్‌ సీఐ వెంకటకొండారెడ్డి వివరాల మేరకు.. మైలవరం మండలం వేపరాలకు చెందిన వలంటీర్‌ గంజికుంట రామయ్య అదే గ్రామానికి చెందిన ఓయువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాడు. అనంతరం పెళ్లి చేసుకోకపోవడంతో ఆ యువతి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంంతో వలంటీర్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-08-11T05:49:07+05:30 IST