ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-27T04:12:26+05:30 IST

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మేనమామలు, తల్లి వేధింపులే కారణమని మృతుడి కుటుంబీకుల ఆరోపణ
  • మిట్టబాస్పల్లిలో ఘటన

తాండూరు రూరల్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని దూరం చేశారని మనస్తాపంతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తాండూరు మండలం మిట్టబాస్పల్లి గ్రామ సమీపంలోని హరితహారం నర్సరీ వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.  మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన పెద్దకుర్వ సందప్ప కుమారుడు కుర్వ శాంత్‌కుమార్‌(23) అలియాస్‌ శాంతు హైదరాబాద్‌లో వంటమనిషిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. శాంత్‌కుమార్‌, తాండూరులో ఉంటున్న తన మేనత్త కూతురు(మైనర్‌) మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన సందప్ప శాంతకుమార్‌ మేనత్తతో వీరి పెళ్లి విషయమై మాట్లాడారు. దీంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. విషయం తెలుసుకున్న బాలిక, శాంత్‌కుమార్‌ నాలుగురోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి శనివారం హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో బాలికతల్లి తన కూతురు కనిపించడం లేదంటూ తాండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు  చేసింది. అప్పటికే శాంత్‌కుమార్‌, మైనర్‌ను పెళ్లి చేసుకుని తాండూరుకు వచ్చారు. బాలికపై మిస్సింగ్‌ కేసు ఉన్నందున ఇరు కుటుంబీకులను పోలీసులు ఆదివారం పిలిపించారు. తమ కూతురు మైనర్‌ అని, పెళ్లి చెల్లదని మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చిపంపించారు. అయితే తల్లిదండ్రులతో వెళ్లిన బాలిక ఇంట్లో కనిపించలేదు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి తన తమ్ముడితో కలిసి సోమవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో మిట్టబాస్పల్లికి వెళ్లి శాంత్‌కుమార్‌ను ఆరాతీసి గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కిడ్నాప్‌ చేశావంటూ శాంత్‌కుమార్‌ను నిలదీశారు. దీంతో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని దూరం చేశారని మనోవేదనకు గురై, తనమేనత్త, బాలిక మేనమామలు తనను చంపుతారనే భయంతో శాంత్‌కుమార్‌ మంగళవారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో తుమ్మ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు సంఘటనా స్థలానికి వెళ్లి బాలిక తల్లి, ఆమె తమ్ముళ్లే తమ కొడుకు మృతికి కారణమని ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు మృతదేహాన్ని కిందకు దింపకుండా అడ్డుకున్నారు. చివరకు న్యాయం చేస్తామని ఎస్‌ఐ ఏడుకొండలు తెలపడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతుడి మేనత్త, బాలిక మేనమామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-10-27T04:12:26+05:30 IST