నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి బలవన్మరణం
నిజాంసాగర్, జనవరి 24 : ఆయనో వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మానసికంగా కుంగిపోయిన వారెందరికో తన మాటలతో స్ఫూర్తి నింపారు.వాళ్లు జీవితంలో ముందడుగు వేసేలా చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన దీర్ఘకాలికంగా తనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తాళ లేక బలవన్మరణానికి పాల్పడ్డారు.‘‘దయచేసి నన్ను క్షమించండి’’ అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టి నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కాసాల జైపాల్‌రెడ్డి (34) వ్యక్తిత్వ వికాస నిఫుణుడిగా పని చేసే వారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఎనిమిది వేల వరకు సదస్సులు నిర్వహించారు. 2003లో అనారోగ్యానికి గురైన జైపాల్ చాలాకాలం పాటుపైల్స్‌తో బాధపడారు. చికిత్సతోపాటు ఆహారపు అలవాట్లు మార్చుకుని కొంతకాలానికి ఆ సమస్య నుంచి బయటపడ్డారు. కానీ, 2014లో హెర్నియా వ్యాధి బారిన పడ్డారు. 2017లో సర్జరీ వరకు వెళ్లినా.. సమస్యకు పరిష్కారం లభించలేదు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేటలో కొన్నాళ్లు ఉండి, ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు.
నగరంలో మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. 2021లో ఇంపాక్ట్ స్వచ్ఛంద సంస్థలో గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మిత్రులతో కలిసి వ్యక్తిత్వ వికాసంపై పలు పరిశోధనలు చేశారు. అయితే, కరోనా కారణంగా ఇంపాక్ట్ పరిశోధనలు ఇతర కార్యకలాపాలు, సదస్సులు ఆగిపోయాయి. అదే సమయంలో అనారోగ్యం తిరగబెట్టింది. పైల్స్ తిరగబెట్టడంతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యతో పది రోజులుగా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. నిజాంసాగర్ వెళ్తున్నానని చెప్పి సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. కాసేపటికే నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ప్రాణం తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు..గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడకు తరలించారు.