ఆత్మ‘హత్యా’?

ABN , First Publish Date - 2020-10-16T12:12:42+05:30 IST

తండ్రిపై కోపాన్ని కుమార్తెపై చూపాడా? లేక ప్రేమ వివాహానికి ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి..

ఆత్మ‘హత్యా’?

ఫ్యాన్‌కు బెడ్‌షీట్.. ఉరేసుకునేందుకా?

ఇంజనీరింగ్ యువతి హత్యపై భిన్న కథనాలు

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పెళ్లి ఫొటో

ముందురోజు నాగేంద్రను హెచ్చరించిన తేజస్విని తండ్రి జోసఫ్

తప్పుడు ప్రచారం చేస్తున్నారని తల్లి ఆవేదన


విజయవాడ(ఆంధ్రజ్యోతి): తండ్రిపై కోపాన్ని కుమార్తెపై చూపాడా? లేక ప్రేమ వివాహానికి ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి చనిపోవాలనుకున్నారా? ప్రేమోన్మాది ఘటనలో ఈ రెండు ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. విజయవాడ క్రీస్తురాజపురం పెద్దబావి వీధిలో వంకాయలపాటి దివ్యతేజస్విని హత్యకు కారణాలపై అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఉన్మాదంతోనే నాగేంద్ర ఆ యువతి గొంతు కోశాడని భావించారు. ఆ తర్వాత కాసేటికి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంలో యువతి తల్లిదండ్రుల వాదన ఒకలా ఉండగా, చుట్టుపక్కల వారు, పోలీసుల కథనం మరోలా ఉంది. పెద్దబావి వీధి ప్రారంభంలోనే తేజస్విని ఇల్లు. సమీపంలోని ఆర్సీఎం చర్చి వద్ద బుడిగ నాగేంద్ర అలియాస్‌ చిన్నస్వామి ఉంటున్నాడు. వీరిద్దరికీ ఏడేళ్లుగా పరిచయం ఉందని చెబుతున్నారు. 


పరిచయం ఇలా..

ఇంటర్‌ వరకు విజయవాడలో చదివిన తేజస్విని ఇంజనీరింగ్‌ భీమవరంలో చేస్తోంది. నాగేంద్ర ఫ్రెండ్‌సర్కిల్‌ అంతా తేజస్విని ఇంటి వద్దే ఉండడంతో తరచూ ఇక్కడికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరి మధ్యా పరిచయం ఏర్పడిందని కొందరు చెబుతున్నారు. తేజస్విని తండ్రి జోసఫ్‌ ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లి కుసుమ టైలరింగ్‌ చేస్తోంది. తేజస్విని అన్నయ్య డెహ్రాడూన్‌లో ప్రైవేటు ఉద్యోగి. తేజస్విని లాక్‌డౌన్‌కు ఇంటికి వచ్చి, అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. ఇంట్లో తేజస్విని ఒంటరిగా ఉన్న సమయంలో నాగేంద్ర వచ్చి వెళ్తుండేవాడని స్థానికులు చెబుతున్నారు.


వివాహమైందా?

తేజస్విని, నాగేంద్ర కొద్ది నెలల క్రితం రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాళ్లిద్దరూ కలిసి దిగిన సెల్ఫీఫొటో సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. నాగేంద్ర, తేజస్విని మధ్య ప్రేమ వ్యవహారం ఉందని అతడి స్నేహితులు చెబుతున్నారు. ఈ వాదనను తేజస్విని తల్లిదండ్రులు కొట్టిపారేస్తున్నారు. రెండు నెలల క్రితం మంగళగిరిలో తాము వివాహం చేసుకున్నామని నాగేంద్ర పోలీసులకు ఇచ్చి వాంగ్మూలంలో చెప్పినట్టు తెలిసింది. 


తప్పుడు ప్రచారం చేస్తున్నారు : కుసుమ

నా కుమార్తె ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఆమెను మేం ఎంతో ప్రేమగా పెంచుకున్నాం. నాగేంద్రకు గంజాయి తీసుకునే అలవాటు ఉంది. తిరుబోతు. ఎందుకూ పనికిరాని వాడు. అలాంటి వాడికి మా అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం? 


పరామర్శలు

తేజస్విని తల్లిదండ్రులను జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేష్‌ పరామర్శించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటను గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  


ఏం జరిగింది?

ఘటన జరిగిన సమయంలో మేడపై గదిలో తేజస్విని, నాగేంద్ర మాత్రమే ఉన్నారు. కుసుమ పైకి వెళ్లేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తేజస్వినిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయింది. నాగేంద్ర గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు ముందు ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉంది. యువతి తండ్రి జోసఫ్‌ కొందరు యువకులతో కలిసి బుధవారం సాయంత్రం నాగేంద్ర ఇంటికి వెళ్లి, తన కుమార్తె జోలికి రావద్దని నాగేంద్రను హెచ్చరించాడు.


గురువారం ఉదయం జోసఫ్‌ విధులకు వెళ్లిపోయాడు. తేజస్విని, తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. పది గంటల సమయంలో కుసుమ మేడపై నుంచి కిందికి వచ్చింది. కాసేపటి తరువాత తేజస్విని నుంచి నాగేంద్రకు ఫోన్‌ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌ వేలాడడాన్ని బట్టి ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా రన్న అనుమానం కలుగుతోంది. లేక కోపంతో ఆమె గొంతు కోసి, తాను కోసుకుని, కడుపులో పొడుచు కున్నాడా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2020-10-16T12:12:42+05:30 IST