30 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-14T06:10:52+05:30 IST

జిల్లాలో ఈనెల 16వ తేదీన 30 కేంద్రాల్లో 35,860 మంది హెల్త్‌ వర్కర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాచర్ల సుహాసిని వెల్లడించారు.

30 కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌
వ్యాక్సినేషన్‌ను రిసీవ్‌ చేసుకున్న డీఎంహెచ్‌వో

మొదటి దశలో 16వ తేదీన 35,860 మందికి వ్యాక్సిన్‌

మచిలీపట్నం టౌన్‌, జనవరి 13 : జిల్లాలో ఈనెల 16వ తేదీన 30 కేంద్రాల్లో 35,860 మంది హెల్త్‌ వర్కర్లకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాచర్ల సుహాసిని వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున గన్నవరం నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో వచ్చిన 42 వేల 500 డోసులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాచర్ల సుహాసిని, డీఐవో శర్మిష్టాలు అందుకున్నారు. డా.సుహాసిని మీడియాతో మాట్లాడారు. 16వ తేదీన ఆసుపత్రులలో పనిచేస్తున్న హెల్త్‌ వర్కర్లకు మొదటి దశలో వ్యాక్సినేషన్‌ ఇస్తున్నామన్నారు. ఇందుకు కావలసిన సిరంజిలను సిద్ధం చేశామన్నారు. 30 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఒక ఎఎన్‌ఎం, ఒక కానిస్టేబుల్‌, ఒక ఆశ వర్కరు, ఒక అంగన్‌వాడీ కార్యకర్త, డిజిటల్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఆ కేంద్రంలో ఉండే వైద్యుడు పర్యవేక్షిస్తారన్నారు. రోజుకు 70 నుంచి 100 మందికి వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. 18 ఏళ్ల పైబడిన వారికి ఈ వ్యాక్సినేషన్‌ అందిస్తున్నామన్నారు. గర్భవతులకు వ్యాక్సినేషన్‌ ఇవ్వమన్నారు. వ్యాక్సిన్‌పై ఏ విధమైన అపోహలు వద్దన్నారు. డీఐవో శర్మిష్ట మాట్లాడుతూ  మొదటి దశలో హెల్త్‌ వర్కర్లకు, రెండో దశలో పోలీసులు, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ ఇస్తామన్నారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, విజయవాడ ఆసుపత్రిలలో ఇందుకు అవసరమైన సాయం తీసుకుంటామన్నారు. ఒక్కొక్కరికి 5 ఎంఎల్‌ డోసు ఇస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత అరగంట సేపు కేంద్రంలో ఆ వ్యక్తికి విశ్రాంతి తీసుకుని తరువాత ఇళ్లకు వెళతారన్నారు. వ్యాక్సినేషన్‌పై అన్ని జాగ్రత్తలూ వహిస్తున్నామన్నారు. గన్నవరం నుంచి మచిలీపట్నం వచ్చిన ఈ వ్యాక్సినేషన్‌ను 30 కేంద్రాలకు పంపుతున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ వ్యాక్సిన్‌ నిల్వ ఉంచుతామన్నారు. 


Updated Date - 2021-01-14T06:10:52+05:30 IST