హమ్మయ్య అనుకుంటే పొరపాటే..!

ABN , First Publish Date - 2021-12-20T16:52:11+05:30 IST

హమ్మయ్య అనుకుంటే..

హమ్మయ్య అనుకుంటే పొరపాటే..!

ఇంజనీరింగ్‌ ఫస్టియర్‌ తొలి అడుగుల్లో తడబాటు వద్దు!


ఇంజనీరింగ్‌ కోర్సు అధ్యయనంలో భాగంగా తెలుసుకోవాల్సిన, ఆచరించాల్సిన పలు అంశాలు ఉన్నాయి. పదో తరగతి, మరికొంత మంది విద్యార్థులు అంతకముందు నుంచే ఇంజనీరింగ్‌ సీటు కోసం అహోరాత్రాలు కష్టపడి ఉంటారు. క్లాస్‌ వర్క్‌, హోమ్‌ వర్క్‌తో రోజులో అనేకానేక గంటలు కష్టపడి కూడా ఉంటారు. సీటు రావడంతో అన్ని కష్టాలు తీరి, బహుశా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్నారనుకుంటా. హమ్మయ్య అనుకుంటే పొరపాటే. నిజానికి ఇప్పుడే అసలు పని ఆరంభమైది. ఇంతకుముందున్న జీవనశైలికి, చదువులో భాగంగా వ్యవహరించిన తీరుతో పోల్చుకుంటే ఇప్పుడే మరిన్ని విషయాలను గుర్తు పెట్టుకుని మరీ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. అదీ ఫస్టియర్లోనే ఆరంభం కావాలి. ఇప్పుడు అవేంటో చూద్దాం.


ఇంటర్‌ వరకు ప్రత్యేకించి పాఠ్యపుస్తకాలు, నిర్దేశిత టాపిక్స్‌, ఈక్వేషన్లు ఉంటాయి. కాన్సెప్ట్(భావన)పై స్పష్టత లేకున్నప్పటికీ గుర్తుపెట్టుకోవడం ద్వారా రోజులు నెట్టుకుని వచ్చి ఉండవచ్చు. అదే ఇంజనీరింగ్‌ విషయానికి వస్తే, ప్రతి సబ్జెక్టుకు లెక్కలేనన్ని పుస్తకాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక్కో టాపిక్‌కు సంబంధించి కాన్సెప్ట్‌ క్లారిటీ అంటే భావనపై స్పష్టత ప్రత్యేకించి ఒక పుస్తకంలో ఉండొచ్చు. అదేదో తెలుసుకుని, లైబ్రరీ కాదంటే మరోచోట నుంచి ఆ పుస్తకం తెచ్చుకుని చదవాలి. స్పష్టమైన కాన్సెప్ట్‌లతోనే ఇంజనీరింగ్‌ విద్య మిళితమై ఉంటుంది. టాపిక్‌ ఏదైనప్పటికీ  ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు అని ప్రశ్నించుకుని కాన్సెప్ట్‌లను నేర్చుకోవాలి. సమాధానం మొదట తెలుసుకోవాలి. పలు సబ్జెక్టుల మధ్య పరస్పర సంబంధాలు(ఇంటర్‌ రిలేషన్స్‌) ఉంటాయి. అందువల్ల ఒక చాప్టర్‌ అర్థం కాకుంటే తదుపరి టాపిక్స్‌ అవగతం కావు. నేర్చుకోవడం కష్టమవుతుంది. మొదటి సంవత్సరం కోర్సులో చదివిన సబ్జెక్టులు, నేర్చుకున్న కాన్సెప్టులు తదుపరి మూడేళ్ళలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఏతావతా ఫస్టియర్‌లో నేర్చుకునే ప్రతీదీ మున్ముందు ఉపకరిస్తుందని గ్రహించాలి. 


- టీచర్లు పాఠాలు చెప్పడం, పక్కన కూర్చుని ప్రతి బిట్‌ చదివించడం, అసలు ఎలా స్టడీ చేస్తున్నారో చూడటం వంటి స్పూన్‌ఫీడింగ్‌  మాత్రమే మీకు ఇప్పటివరకు తెలిసింది. ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో అలాంటి పద్ధతి ఉండదు. లెక్చరర్లు తమ ఉపన్యాసం లేదంటే పాఠం చెప్పడానికే పరిమితం. విద్యార్థికి అర్థమైందా లేదా అన్నది చెక్‌ చేయరు. అర్థం చేసుకోవడం, ఆపై అధ్యయనం బాధ్యత విద్యార్థిదే. సందేహాలు తలెత్తితే స్నేహితులతో చర్చించాలి. లేదంటే లెక్చరర్లనే అడిగి తెలుసుకోవాలి. కాన్సెప్ట్‌ పూర్తిగా అర్థమయ్యే వరకు పదేపదే చదవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాన్సెప్ట్‌ స్పష్టంగా అర్థమయ్యే క్రమంలో ఈ అడుగులు అన్నీ ఉంటాయి. 


- సబ్జెక్టుతో మమేకమయ్యేందుకు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలి. ఒక వేళ సబ్జెక్టు అర్థం కాకున్నా, దానిపై ఆసక్తి లేకున్నా సరే, తరగతులకు హాజరుకావడం, సహనంతో ప్రవర్తించడం తప్పనిసరి. అటెండెన్స్‌ 75 శాతం తప్పనిసరి చేస్తూ యూనివర్సిటీ నిబంధనలు ఉన్నాయి. అలా కాని పక్షంలో ఎంత తెలివైన విద్యార్థినైనా సెమిస్టర్‌ పరీక్షకు కూర్చోనివ్వరు. ఫలితంగా పరీక్షలో ఫెయిలైనట్లు పరిగణిస్తారు. దాంతో మరో ఏడాది అదే  క్లాసులో ఉండి చదవాల్సి వస్తుంది. 


- ఇంటర్నల్‌ మార్కులు తక్కువ కావడం అన్న మరో సమస్య కూడా ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఎదురవుతుంది. ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌, అసైన్‌మెంట్స్‌కు ముప్పయ్‌ శాతం, సెమిస్టర్‌ చివర్లో జరిగే తుది పరీక్షకు తతిమా డెబ్బయ్‌ శాతం వరకు మార్కులు నిర్దేశిస్తారు. కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకుంటే పాసైనట్టు పరిగణిస్తారు. 


- విద్యార్థి తరగతి గదిలో పాఠాలు చక్కగా వినకుంటే ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌లో తక్కువ మార్కులు రావచ్చు. అలాంటి సందర్భాల్లో సెమిస్టర్‌ ఎండ్‌ ఎగ్జామ్‌ల్లో ఎక్కువ శాతం మార్కులు తెచ్చుకోవడం కూడా సాధ్యంకాదు. అలాగే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. సెమిస్టర్‌ ఎండ్‌ ఎగ్జామ్‌కు సప్లిమెంటరీ ఉంటుంది, రాసుకోవచ్చు. ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌ మాత్రం మళ్ళీమళ్ళీ నిర్వహించరు. మొదటిసారి అదీ ఒకేసారి జరిగే ఇంటర్నల్స్‌లో  తెచ్చుకున్న మార్కులనే లెక్కలోకి తీసుకుంటారు. 


- 75 శాతం అటెండెన్స్‌ ఉన్నప్పటికీ, సగం సబ్జెక్టుల్లో పాస్‌ మార్కులు తెచ్చుకోని పక్షంలో రెండో ఏడాది కోర్సులోకి అనుమతించరు. కాలేజీకి రానివ్వరు. ఇంట్లో కూర్చుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలి. నిర్దేశిత సంఖ్యలో సబ్జెక్టులు పాస్‌ అయితేనే రెండో ఏడాది కోర్సులోకి అనుమతిస్తారు. రెండు నుంచి మూడు, మూడు నుంచి నాలుగో ఏడాది కోర్సుల్లోకి వెళ్ళేందుకు కూడా ఇదే నిబంధన పాటిస్తారు. ఆ సంవత్సరాల్లో కూడా సగం కంటే ఎక్కువ లేదా అరవై శాతం సబ్జెక్టులు పాసవ్వాలన్న నిబంధన ఉంటుంది. 


- ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చేరామన్నది విషయమే కాదు, బ్రాంచ్‌ ఏదైనప్పటికీ కాన్సె్‌ప్టలను క్లియర్‌ చేసుకుంటేనే అంతిమ విజయం దక్కుతుంది. 


- ఇంజనీరింగ్‌ నాలుగేళ్ళలోనూ మీదైన కృషి చాలా అవసరం. కష్టపడితేనే విజయం సాధ్యమవుతుంది. ఈ నాలుగేళ్ళలో ఎక్కడైనా ఫెయిల్‌ అయితే, పూడ్చుకోలేని నష్టం తప్పదు. అందువల్ల కోర్సు మొత్తం కాలంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. 


- ఎంట్రెన్స్‌లో సాధించిన ర్యాంకుకు, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్‌ చేస్తున్న కాలేజీలో ఎలాంటి విలువ ఉండదు. తీసుకున్న డిసిప్లిన్‌లో మీరు చేసుకున్న కృషే జీవితంలో ముందుకు వెళ్ళేందుకు, విజయం సాధించేందుకు ఉపయోగపడుతుంది. 


- పరిజ్ఞానం, అంతకు మించి మిమ్మల్ని మీరు తెలియజేసేందుకు ఉద్దేశించిన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మాత్రమే విజయసాధనకు దోహదపడతాయి. 


- పరీక్షల్లో 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణి, 70 శాతం అంతకు మించితే డిస్టింక్షన్‌ వస్తుంది. మంచి ప్రమాణాలు కలిగిన కంపెనీలు ఎప్పుడూ మార్కులకు ప్రాధాన్యం ఇస్తాయి. 70 శాతం అంతకు మించి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తాయి.


- ఈ నాలుగేళ్ళూ కష్టిస్తే మున్ముందు జీవితం గర్వంగా అనిపిస్తుంది. ఈ సమయంలో రిలాక్స్‌ అయితే ముందరి పరిస్థితులు సౌకర్యవంతంగా ఉండవు. 


- ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 15 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగి ఉంటున్నారు. అంటే కాన్సె్‌ప్ట్సలో క్లారిటీకి తోడు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెండుగా ఉన్న విద్యార్థులకు మాత్రమే మంచి భవిష్యత్తు లభిస్తోంది. 


- ఇంటర్‌ వరకు ఇంగ్లీష్‌ మీడియం వరకు చదవకున్నా ఇబ్బంది లేదు. ఇంజనీరింగ్‌లో సబ్జెక్టులు అర్థం కావడానికి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది కలుగదు. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇంటర్‌ వరకు నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను.


తల్లిదండ్రులకు..

ఇంజనీరింగ్‌లో పిల్లల్ని చేర్పించడంతోనే మీ బాధ్యత తీరిపోలేదు. అనేకానేక కారణాలరీత్యా మీ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఇంతవరకు వారంతా చిన్నపిల్లలు. దాంతో నిరంతరం చాలా జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. వాళ్ళూ మీ మాట విన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ కోర్సులో చేరారు. టీచింగ్‌లోనూ, సబ్జెక్టులను అవగాహన చేసుకోవడంలోనూ ఇంతకుమునుపుతో పోల్చుకుంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పటివరకు అటు తల్లిదండ్రులు, ఇటు స్నేహితుల సాన్నిహిత్యం వారికి చాలా ఉంటుంది. ఇంజనీరింగ్‌ కాలేజీలో వాతావరణం అలా ఉండదు. ఎవరికి వారు ఎదిగినట్టు భావిస్తూ ఉంటారు. ఒకరు మరొకరికి సహాయపడే పరిస్థితులు తక్కువ. అలాగే ఎవరికి వారు ప్రతిభను లేదంటే అందరిలో తమకు ఉన్న ప్రత్యేకతను ప్రదర్శించుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందువల్ల తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలి.


ఎలా చదువుతున్నారు, స్నేహితులు ఎవరు, హాజరు తదితర విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉండాలి. ఇంకేవైనా సమస్యలు ఎదురైనా తమకు చెప్పుకోవడానికి ఇబ్బంది కలుగని వాతావరణం కూడా కల్పించాలి. అది తల్లిదండ్రుల కనీస బాధ్యత కూడా. కాలేజీతో టచ్‌లో ఉండాలి. మీ అబ్బాయి/ అమ్మాయి అటెండెన్స్‌, అక్కడ ప్రవర్తిస్తున్న తీరు, క్లాసులో బిహేవియర్‌ వంటివన్నీ తెలుసుకోవాలి. ఇంటర్‌ వరకు మెరిట్‌ విద్యార్థులుగా ఉన్న ఎంతోమంది ఒక్కసారి ఇంజనీరింగ్‌లో చేరిన తరవాత అల్లరిచిల్లరగా తయారైన వారిని నా అనుభవంలో చూశాను. తరగతి గదిలో అందర్నీ ఇబ్బందులకు గురిచేసే డిస్టర్బింగ్‌ ఎలిమెంట్‌గా కూడా తయారైనవారూ ఉన్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాలి.


నిజానికి ఇదో పరివర్తన దశ. మీ అబ్బాయి/ అమ్మాయి ఎదిగే వయస్సు. ఈ నాలుగేళ్ళలోనే భావి జీవితాన్ని నిర్దేశించే మంచి/చెడు గుణాలు అలవడే వయస్సు. ఆచితూచి వారితో వ్యవహరించాలి. అదే సమయంలో ఎప్పుడూ అంటిపెట్టుకుని మరీ పరిశీలిస్తూ ఉండాలి. దారితప్పితే వెంటనే దారిలోకి తెచ్చుకోవాలి. ఒక్కోసారి ఉన్నట్లుండి పాఠాలు అర్థం కావటం లేదని ఫిర్యాదు చేస్తేంటారు. కారణం తెలుసుకుని సరిదిద్దాలి. ముఖ్యంగా వారి అటెండెన్స్‌ వ్యవహారాన్నీ చూస్తుండాలి. 


హాస్టల్‌లో ఉండే పిల్లల్లో కొంతమంది హోమ్‌సిక్‌కు గురవుతుంటారు. రూమ్మేట్లతో, సీనియర్లతో సమస్యలు ఉంటాయి. వాస్తవానికి వారు వెంటనే ఆ విషయాలను స్నేహితులు, టీచర్లతో పంచుకోవాలి. అదే సమయంలో తమతో కూడా చెప్పుకొనే వెసులుబాటును తల్లిదండ్రులు వారికి కల్పించాలి. ఆవేశపడకుండా వారు చెప్పేదంతా వినడం అలవాటు చేసుకోవాలి. సమస్య తీవ్రతను అనుసరించి స్పందించాలి. అవసరం అనుకుంటే కాలేజీ యాజమాన్యం/ హాస్టల్‌ వార్డెన్‌/ లెక్చరర్లకు విపులంగా వివరించి సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. 



ఆనందించండి. జాగ్రత్తగా ఉండండి. చదువుపై దృష్టి సారించండి. కష్టపడండి, క్రమశిక్షణ పాటించండి. జీవితంలో విజయం సొంతం చేసుకోండి...!

- ప్రొఫెసర్‌ ఇ.సాయిబాబా రెడ్డి

డైరెక్టర్‌, విద్యాజ్యోతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, హైదరాబాద్‌

(ఒడిషా ప్రభుత్వానికి చెందిన వీర్‌ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ(బుర్ల)కి వైస్‌ ఛాన్సలర్‌,  జెఎన్‌టియుహెచ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు)  


Updated Date - 2021-12-20T16:52:11+05:30 IST