కరోనా వేళ.. పిల్లల సర్జరీ!

ABN , First Publish Date - 2020-08-11T17:36:14+05:30 IST

కొవిడ్‌-19 విస్తృతంగా ప్రబలిన ప్రస్తుత సమయంలో మరీ ముఖ్యంగా పిల్లలకు చేసే సర్జరీల గురించిన చింత ఉండడం సహజం

కరోనా వేళ.. పిల్లల సర్జరీ!

ఆంధ్రజ్యోతి(11-08-2020)

కొవిడ్‌-19 విస్తృతంగా ప్రబలిన ప్రస్తుత సమయంలో మరీ ముఖ్యంగా పిల్లలకు చేసే సర్జరీల గురించిన చింత ఉండడం సహజం. అయితే కరోనా సోకినా, ఆ లక్షణాలు లేకపోయినా అవసరాన్ని బట్టి పిల్లలకు చేసే సర్జరీలను యధాతథంగా కొనసాగించే పరిస్థితి ఉంటోంది.


ఇటీవల అమెరికాలో చేపట్టిన సర్వేలో, సర్జరీకి ముందు లక్షణాలు లేని పిల్లలకు కొవిడ్‌-19 పరీక్షలు జరిపినప్పుడు వారిలో 1ు మంది పిల్లలకు కరోనా సోకినట్టు తేలింది. ఇదే డాటాను మన దేశంలోనూ సేకరిస్తున్నారు. అయితే అమెరికాతో పోలిస్తే కరోనా లక్షణాలు లేని సర్జరీ అవసరమైన పిల్లలు మన దేశంలో ఎక్కువే! అయితే ఎవరికి అత్యవసర సర్జరీలు అవసరమో, ఎవరికి సర్జరీలు వాయిదా వేయవచ్చో వైద్యులు నిర్ణయిస్తారు. సర్జరీలను ఎలక్టివ్‌, నాన్‌ ఎలక్టివ్‌, ఎమర్జెన్సీలుగా వర్గీకరించి ప్రాధాన్యక్రమంలో జరపడం జరుగుతోంది. అయితే ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష చేసి ఫలితం వచ్చేవరకూ ఆగి, ఆ తర్వాతే సర్జరీలు జరిపే పద్ధతి అనుసరిస్తున్నా, పరీక్షా ఫలితం వచ్చేలోగా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే పిల్లల విషయంలో ఫలితం వచ్చేవరకూ ఆగకుండానే సర్జరీలకు వైద్యులు పూనుకుంటున్నారు. అలాగే అత్యవసర సర్జరీలు అవసరమైన పిల్లలకు తక్కువ సమయంలో కరోనా ఫలితాన్ని తెలిపే ర్యాపిడ్‌ టెస్ట్‌లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి కొన్ని గంటల్లోనే కరోనాను నిర్ధారించుకునే వీలు ఉంటోంది.


సర్జరీ సమయంలో కరోనా సోకకుండా...

కరోనా సోకిన పిల్లలను, సోకని పిల్లలను, లక్షణాలు బయల్పడని పిల్లలను వేరు చేసి, వేర్వేరు హెల్త్‌ వర్కర్లు విడివిడిగా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాలకు చెందిన ఎయిర్‌ సర్క్యులేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ కూడా వేరే చేస్తారు. ఐసీయూ, క్రిటికల్‌ కేర్‌ యూనిట్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తగ్గుతాయి.


డాక్టర్‌ మైనక్‌ దేవ్‌

కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ సర్జన్‌,

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-08-11T17:36:14+05:30 IST