పాతవి సరే..

ABN , First Publish Date - 2020-08-10T10:25:23+05:30 IST

చెరకు తరలించిన రెండు వారాల్లో రైతులకు చెల్లింపులు చేస్తాం. జాప్యం జరిగితే వడ్డీతో చెల్లిస్తాం..ఇదీ ఎన్‌సీఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ..

పాతవి సరే..

కొత్తవాటి సంగతేంటి?

పేరుకుపోతున్న చెరకు బకాయిలు

గత ఏడాదివి రూ.9.5 కోట్లు పెండింగ్‌

ఆశగా ఎదురుచూస్తున్న రైతులు

పట్టించుకోని ఎన్‌సీఎస్‌ యాజమాన్యం


(సీతానగరం): చెరకు తరలించిన రెండు వారాల్లో రైతులకు చెల్లింపులు చేస్తాం. జాప్యం జరిగితే వడ్డీతో చెల్లిస్తాం..ఇదీ ఎన్‌సీఎస్‌ సుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెప్పిన మాట. కానీ చెరకు తరలించి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ చెల్లింపులు చేయలేదు.  2019-20 సంవత్సరానికి సంబంధించి రూ.9.5 కోట్లు బకాయిల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు బకాయి సంగతి మరిచారా అని ప్రశ్నిస్తున్నారు.  మూడేళ్ల కిందట నాటి బకాయిలు రూ. 19.65 కోట్లను ఇటీవల చెల్లించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం  కర్మాగార భూముల విక్రయించి బకాయి చెల్లింపులు చేశారు. 


 ఈ ఏడాది బకాయిలు కూడా సకాలంలో చెల్లిస్తామని అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు సమక్షంలో యాజమాన్య ప్రతినిధులు ప్రకటించారు. దీంతో రైతులు ఎంతగానో ఆనందించారు.  కానీ ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి కర్మాగారానికి చెరకు తరలించిన 14 రోజుల్లో చెల్లింపులు చేయాలన్న నిబంధన ఉంది. లేకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అధికారులు కూడా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.  


మిగిలిన సొమ్ము చెల్లిస్తే..

ఫ్యాక్టరీ భూములు విక్రయించి రైతులకు పాత బకాయి చెల్లించిన సంగతి తెలిసిందే. ఇందులో కొంత మొత్తం మిగిలి ఉంది. బొబ్బిలి సుగర్‌ కేన్‌ ఏసీసీ, సీతానగరం తహసీల్దార్‌ ఉమ్మడి ఖాతాలో రూ.2.5 కోట్లు మిగిలి ఉన్నాయి. నగదును రైతుల బకాయిలకు జమ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ నగదును చెల్లిస్తే 25 శాతం బకాయి తీరినట్లవుతుంది. కానీ అటువంటి చర్యలేవీ కానరాలేదు. బకాయిలు చెల్లింపుల ప్రక్రియపై యాజమాన్యం ఎటువంటి ప్రకటనలు చేయకపోగా, గతంలో వలే ప్రభుత్వమే ఆర్‌ఆర్‌ చట్టం అమలు చేస్తుందని చెప్పడం గమనార్హం.


గతేడాది ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, చినప్పలనాయుడులు చెల్లింపులు కోసం ప్రత్యేక కమిటీ వేశారు. కానీ వారికి తెలియకుండా పంచధార, ఇతర ఉత్పత్తులు అమ్మిన యాజమాన్యం సొంత అవసరాలకు వినియోగించింది. దీంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. బకాయిలు పేరుకుపోతున్నాయి. మరోసారి ఆందోళనబాట పట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తక్షణం బకాయిలు చెల్లించాలని  రైతు సంఘం నాయకులు రెడ్డి లక్ష్ముంనాయుడు, ఈశ్వరరావు, రమణమూర్తిలు డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-08-10T10:25:23+05:30 IST