షుగర్‌.. బేఫికర్‌!

ABN , First Publish Date - 2020-08-11T20:48:33+05:30 IST

మధుమేహులకు కరోనా ముప్పు కచ్చితంగా ఎక్కువే! అయితే ఆ ముప్పు నుంచి తప్పించుకోవడం అసాధ్యమేమీ కాదు! ‘మధుమేహాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుంటే... కరోనా కన్నుగప్పి మనుగడ సాగించవచ్చు’ అంటున్నారు వైద్యులు!

షుగర్‌.. బేఫికర్‌!

ఆంధ్రజ్యోతి(11-08-2020)

మధుమేహులకు కరోనా ముప్పు కచ్చితంగా ఎక్కువే! అయితే ఆ ముప్పు నుంచి తప్పించుకోవడం  అసాధ్యమేమీ కాదు! ‘మధుమేహాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుంటే... కరోనా కన్నుగప్పి మనుగడ సాగించవచ్చు’  అంటున్నారు వైద్యులు!


మధుమేహం కారణంగా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లుతుంది. కాబట్టి వీరికి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. మధుమేహం అంటే రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ఒక్కటే కాదు. దాని ప్రభావం రక్తనాళాలు, నాడులు, ఎముకలు, మూత్రపిండాలు... ఇలా శరీరంలోని ప్రతి అవయం మీదా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వ్యాధినిరోధకశక్తి తగ్గడం మూలంగా ఎలాంటి బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు అయినా వీరికి తేలికగా సోకుతాయి. వీటిలో కరోనా కూడా ఒకటి. అయితే మధుమేహాన్ని మందులతో అదుపులో ఉంచుకుంటే ఇన్‌ఫెక్షన్ల నుంచి సమర్థంగా తప్పించుకోగలిగినట్టే, కరోనా నుంచీ తప్పించుకునే వీలు ఉంది. కానీ కరోనా సోకిన, సోకి ఆరోగ్య పరిస్థితి దిగజారిన, ప్రాణాంతకంగా మారిన పలు కేసుల్లో మధుమేహులే ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. దాంతో మధుమేహులకు కరోనా తేలికగా సోకుతుందనీ, ఇలా సోకితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవలసిందేననీ బెంబేలుపడుతున్నాం. కానీ ఇలా కరోనాతో ఆరోగ్యం విషమించిన మధుమేహులు అందరూ మరణిస్తారు అనుకుంటే పొరపాటు. మధుమేహులకు కరోనా సోకిందంటే, వాళ్లు చక్కెర స్థాయులను సమతులంగా ఉంచుకోవడం లేదని అర్థం చేసుకోవాలి. అలాగే కరోనాతో వారి ఆరోగ్య పరిస్థితి దిగజారిందంటే, వారికి మధుమేహంతో పాటు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ గ్రహించాలి. మన దేశంలో కేవలం 16ు మంది మధుమేహులు మాత్రమే చక్కెర స్థాయులను మందులతో అదుపులో పెట్టుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహుల్లో కొందరు విచక్షణారహితంగా వ్యవహరించడం మూలంగానే వారికి కరోనా తేలికగా సోకుతోంది. 


చక్కెర మీద ఓ కన్నేయాలి!

మధుమేహం కోసం మందులు వాడడంతో పాటు, క్రమబద్ధమైన జీవనశైలి, ఆహారశైలిని అలవరుచుకోవాలి. అప్పుడే చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఇది రెండు రకాల మధుమేహులకూ (టైప్‌ 1, టైప్‌ 2) వర్తిస్తుంది. కొంతమంది చక్కెరకు మందులు వాడుతున్నాం కదా! అని అంతటితో సరిపెట్టుకుంటారు. ‘మాత్ర వేసుకున్నాను కదా! నా షుగర్‌ కంట్రోల్‌లోనే ఉంది’ అనే భ్రమలో ఉండిపోతారు. కనీసం గ్లూకోమీటరుతో ఇంట్లో చక్కెర స్థాయిని పరీక్షించుకోరు. దాంతో రక్తంలో చక్కెర స్థాయి చాప కింద నీరులా పెరిగి, ఇన్‌ఫెక్షన్‌ సోకే వీలూ పెరుగుతుంది. రక్తంలో పెరిగే చక్కెర, అదనపు మాత్ర వేసుకున్న వెంటనే తగ్గిపోదు. తీపి తిన్న గంటలోపే రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. అయితే అంతే వేగంగా పెరిగిన చక్కెర మాత్రతో తగ్గదు. మాత్ర జీర్ణమై, రక్తంలో శోషణ చెందడానికి సమయం పడుతుంది. ఆలోగా అంతర్లీనంగా ఆరోగ్యానికి జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య క్రమశిక్షణ తప్పొద్దు.  


దిద్దుబాటు చర్యలు ఉన్నా...

మధుమేహం కలిగిన పెద్దలతో పోలిస్తే పిల్లలు, యువత జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేరు. చుట్టూ పలు రుచికరమైన పదార్థాలు కనిపిస్తూ ఉన్నప్పుడు వాటికి ఆకర్షితులవడం, తినేయడం సహజం. అయితే ఇలా తిన్నప్పుడు వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంటే, పెరిగిన చక్కెర స్థాయులు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకపూట ఆహారం బాగా తగ్గించుకోవడం, అదనంగా మరో అరగంట పాటు నడవడం లాంటివి చేయడం ద్వారా చక్కెరను తిరిగి అదుపులోకి తీసుకురావచ్చు. అయితే అలాగని నచ్చినవన్నీ తినేస్తూ వ్యాయామం చేసేస్తాం అనడమూ సరికాదు.


సమయానుసారంగా....

చక్కెర మాత్ర వేసుకోవడం మీదే మధుమేహుల దృష్టంతా! కానీ అంతకన్నా ముఖ్యమైన నియమాలు కొన్ని ఉన్నాయి. మాత్ర వేసుకునే సమయం, ఆహారం తీసుకునే సమయం క్రమం తప్పకుండా చూసుకోవాలి. అన్ని చక్కెర మాత్రలు భోజనానికి ముందు లేదా తర్వాత వేసుకోవలసి ఉంటుంది. ప్రతి చక్కెర మాత్ర 10 నుంచి 12 గంటలపాటు పని చేస్తుంది. ఇన్సులిన్‌ కూడా ఇదే విధంగా నియమిత వేళలకు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి 8 గంటలకు వేసుకున్న మాత్ర ప్రభావం ఉదయం 8 గంటలకు పోతుంది. ఉదయం పనులన్నీ పూర్తి చేసి, 10 గంటలకు మాత్ర వేసుకోవడం సరికాదు. ఇలా చేస్తే, మునుపటి మాత్ర ప్రభావం ముగిసిపోయి, రక్తంలో తిరిగి చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. కాబట్టి సమయానికి తేలికపాటి ఆహారం లాంటి జావ, సూప్‌ లాంటివి తీసుకుని అయినా మాత్ర వేసుకోవాలి. ఆ తర్వాత రెండు గంటల విరామంతో ఉదయం అల్పాహారం తీసుకోవచ్చు. అలాగే కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు నచ్చిన వ్యాయామం చేయాలి.


రీడింగ్‌లో తేడాలు ఉంటాయి!

ల్యాబ్‌లో వచ్చిన ఫలితానికి గ్లూకోమీటరులో వచ్చిన ఫలితం 10ు నుంచి 15ు ఎక్కువగా ఉంటుంది. గ్లూకోమీటరు పరీక్ష కోసం చూపుడువేలు నుంచి రక్తం సేకరిస్తే, ల్యాబ్‌లో జరిపే పరీక్ష కోసం ప్రధాన రక్తనాళం నుంచి రక్తం తీసుకుంటారు. కాబట్టి వీనస్‌ బ్లడ్‌కూ క్యాపిల్లరీ బ్లడ్‌కూ తేడా ఉంటుంది. కాబట్టే ఈ రెండు పరీక్షా ఫలితాల్లో తేడాలు కనిపిస్తాయి. అయితే గ్లూకోమీటరు కేవలం రక్తంలో చక్కెర స్థాయిని తెలిపే ఓ పరికరం మాత్రమే! అది వ్యాధి నిర్ధారణ పరికరం కాదనే విషయం గమనించాలి. కాబట్టి దానిలో కనిపించే ఫలితాన్ని బట్టి వైద్యులను సంప్రతించకుండా మాత్రల మోతాదును పెంచడం సరికాదు. 


చక్కెర సమతులం కోసం...

మధుమేహులు ఏ చిన్న నలతనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా మొదట గ్లూకోమీటరుతో చక్కెరను పరీక్షించుకోవాలి. ఆ స్థాయి తగ్గినా, పెరిగినా వెంటనే దాన్ని సమం చేసే చర్యలు తీసుకోవాలి. తగ్గితే తీపి తినడం, పెరిగితే వైద్యులను సంప్రతించడం, తదుపరి తీసుకునే భోజనంలో నియంత్రణ పాటించడం లాంటి చర్యలు చేపట్టాలి. 


ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయకూడదు!

మధుమేహం అదుపులోనే ఉన్నా ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే అప్రమత్తం కావాలి. జలుబు, దగ్గు, జ్వరాలను నిర్లక్ష్యం చేయకూడదు. సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను ఆశ్రయించాలి. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటి కరోనా రక్షణ చర్యలు పాటించడంతో పాటు కంటి నిండా నిద్ర పోవాలి. క్రమం తప్పక చక్కెర మాత్రలు వేసుకోవాలి. 


చక్కెర పరీక్షిస్తున్నారా?

మన దేశంలో మొత్తం మధుమేహుల్లో 60 నుంచి 70 శాతం మంది చక్కెర నియంత్రణ తప్పి ఉన్నారు. అయితే వీరికి కరోనా సోకినప్పుడు మొదట చక్కెర స్థాయి అదుపయ్యేలా మందుల మోతాదు పెంచడమే వైద్యులు ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రఽథమ చికిత్స. ఆ తర్వాత మిగతా కరోనా బాధితులకు అందించే వైద్యమే వీరికీ అందించడం జరుగుతోంది. అయితే ఈ స్థితి తలెత్తకుండా ఉండాలంటే క్రమంతప్పక గ్లూకోమీటరుతో చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం ఉదయం అల్పాహారానికి ముందు, అల్పాహారం తర్వాత రెండు గంటలకు ఒకసారి, రాత్రి భోజనానంతరం... ఇలా వారానికి రెండుసార్లు చొప్పున, రోజుకు మూడుసార్లు చక్కెరను పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ రీడింగ్‌లను రాసి పెట్టుకోవాలి. ఒకవేళ కరోనా కారణంగా వైద్యులను కలిసినప్పుడు, వారికి ముందే రాసి పెట్టుకున్న చక్కెర రీడింగ్‌లను చూపిస్తే చికిత్స సులువవుతుంది. 


-డాక్టర్‌ కె. ఇందిర

కన్సల్టెంట్‌ డయాబెటాలజిస్ట్‌, 

ఎవిస్‌ హాస్పిటల్స్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-08-11T20:48:33+05:30 IST