చపాతీలు తిని కంటి చూపు పోగొట్టుకున్న చిన్నారి.. డాక్టర్లే షాక్..

ABN , First Publish Date - 2021-08-03T10:47:57+05:30 IST

ఆ చిన్నారి వయసు 12. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడు చూపు కోల్పోయాడు. శరీరంలోని..

చపాతీలు తిని కంటి చూపు పోగొట్టుకున్న చిన్నారి.. డాక్టర్లే షాక్..

భోపాల్: ఆ చిన్నారి వయసు 12. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడు చూపు కోల్పోయాడు. శరీరంలోని అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదంతా విన్న తరువాత అయ్యో..! ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడేమో అని బాధపడుతున్నారా..? అనారోగ్యం మాత్రం నిజమేలే కానీ.. అది ఒక్కరోజులో వచ్చింది. అది కూడా చపాతీలు తిని అనారోగ్యం పాలయ్యాడు. ఆశ్చర్యంగా ఉందా.. కానీ ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా, ఖోడ్ గ్రామంలో సందీప్ అనే చిన్నారికి ఓ వింత పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకూ కంటి చూపు కోల్పోవడం మొదలు పెట్టాడు. ఇక ఓ రోజు ఏకంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి తండ్రి బన్వారి ఆదివాసి వెంటనే చిన్నారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ దీపక్ గౌతం అనే డాక్టర్ చిన్నారిని పరిశీలించి షాకయ్యాడు. కారణం సందీప్ శరీరంలోని మధుమేహం. అది కూడా ఏకంగా 1200కు పైగా ఉంది. అతడు కేవలం నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాడు. శరీరంలో ఎలాంటి కదలికా లేదు. గుండె మాత్రం నెమ్మదిగా కొట్టుకుంటోంది.


సాధారణంగా 140 లోపు ఉండాల్సిన షుగర్ కౌంట్ 1206కు చేరుకుంది. ఇది సామాన్య విషయం కాదు. చిన్నారి ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయంపై డాక్టర్లు బన్వారీని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. డాక్టర్ గౌతమ్ చెప్పిన వివరాల ప్రకారం.. సందీప్ రోజూ 40 చపాతీలు తినేవాడు. దీనివల్ల అతడి తలలో చీము చేరుకుంది. చిన్నారికి డాక్టర్ అనంత్ రాఖోరే శస్త్ర చికిత్స చేశారు. అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును వెలికితీశారు.


ఇక శస్త్ర చికిత్స అనంతరం డాక్టర్ రాఖోరే చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. అతడి తలలో చేరుకున్న చీము కారణంగానే చూపూ కోల్పోయాడని చెప్పారు. అలాగే అతడి బ్లడ్ షుగర్ స్థానికి నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు డాక్టర్లు 6 యూనిట్ల ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇచ్చారు.


సందీప్‌ బ్లడ్ షుగర్ స్థాయి సాధారణ స్థాయికి చేరుకున్న అనంతరం జిల్లా ఆసుపత్రిలోని ఆప్తాల్మజిస్ట్ డాక్టర్ గిరిష్ చతుర్వేది అతడిని పరిశీలించారు. చిన్నారి డయాబెటిక్ రెటినోపతి వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అతడి కళ్లకు కుదిరినంత త్వరగా శస్త్ర చికిత్స చేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీనికి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో 5 రోజుల తేడాతో రెండు కళ్లకు విజయంతంగా శస్త్ర చికిత్స చేశారు. దీంతో చిన్నారి సందీప్‌కు మళ్లీ కంటి చూపు తిరిగొచ్చింది.

Updated Date - 2021-08-03T10:47:57+05:30 IST