ఊరికొచ్చినా.. ఉపాధి కరువు!

ABN , First Publish Date - 2020-05-24T08:51:01+05:30 IST

సొంతూళ్లకు చేరిన వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతం. పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు.

ఊరికొచ్చినా.. ఉపాధి కరువు!

వలస కూలీల బాధలు వర్ణనాతీతం..

సొంత ఊళ్లో ఉపాధి పనులు లేక అవస్థలు..

పస్తులుండాల్సిన దుస్థితి..

పట్టించుకోని యంత్రాంగం..

కరువుతో పోరాడలేక..

పొట్ట చేతపట్టుకుని.. వలసెళ్లారు..

అనుకోని విపత్తు దాపురించింది..

పరాయి చోట పని లేకుండా చేసింది..


బతికే మార్గం లేక..

ఇక్కడుంటే బతకమని తెలిశాక..

ప్రాణాలకు తెగించి.. ప్రయాణం కట్టారు..

కొన ఊపిరితో సొంతూరు చేరారు..


ఇక్కడేం చేయాలి?

ఏం తినాలి?

ఎలా బతకాలి?

ఏ పనీ లేదు..


పరిస్థితి ఇలాగే ఉంటే..

అధికారులు చొరవ చూపకుంటే..

ఉపాధి పనులు కూడా పెట్టకుంటే..

ఆకలి చావులు తప్పవేమో?



అనంతపురం, మే 23(ఆంధ్రజ్యోతి): సొంతూళ్లకు చేరిన వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతం. పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. చేతినిండా పనిలేక.. కడుపు నిండా తిండిలేక అల్లాడిపోతున్నారు. లక్షలాది కుటుంబాలు ఒక ముద్ద తిండి కోసం ఎదురుచూసే పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న వలస కూలీలు, కార్మికులకు ఉపాధి కల్పించటంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటం శోచనీయం


3 లక్షల మందికే ఉపాధి పనులు..

జిల్లాలో 5.10 లక్షల జాబ్‌ కార్డులున్నాయి. 49,237 ఉపాధి కూలీల గ్రూపులున్నాయి. ఆయా గ్రూపుల పరిధిలో 8 లక్షల మందికిపైగా ఉపాధి కూలీలున్నారు. వీరిలో ప్రస్తుతం 3 లక్షల మందికే ఉపాధి పనులు కల్పిస్తున్నారు. మిగిలిన 5 లక్షల మందికి పనులు నిల్‌. ప్రభుత్వం మాత్రం వేసవిలో రోజుకు 4.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్దేశించింది. అధికారులు మాత్రం ఆ విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. కొందరు ఎంపీడీఓలు వారి వారి పరిధిలో 40 శాతం కూలీలకు పనులు కల్పించలేని స్థితిలో ఉన్నారు.


వలస కూలీలు వచ్చిన నేపథ్యంలో..

పొట్ట చేత పట్టుకుని వలసెళ్లిన జిల్లావాసులు అక్కడ పనుల్లేక తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఒకపూట తిండితో రోజులు గడుపుతున్న దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం వలస కూలీలతోపాటు జిల్లాలోనే వివిధ రంగాల్లో పని చేసుకుని జీవనం సాగిస్తున్న వారికి పనులు కల్పించి, ఆదుకోవాల్సి ఉంది.


ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ

తాడిపత్రితోపాటు పరిసర ప్రాంతాల్లో గ్రానైట్‌, కడప శ్లాబ్‌ పరిశ్రమలను నమ్ముకుని 500 మందికిపైగా హమాలీలు జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు పూర్తిగా బంద్‌ కావటంతో ఉపాధి కోల్పోయారు. దీంతో రోడ్డున పడాల్సి వచ్చింది. ఏ పూటకాపూట పనిచేయటం ద్వారా వచ్చిన డబ్బుతో సంసారాన్ని నెట్టేకొచ్చేవారు. ఒక్కసారిగా రెండు నెలలు పని ఆగిపోవటంతో బతుకు బండిని లాగలేని పరిస్థితిలో హమాలీలు కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్యాక్టరీల్లో పనిచేసే దాదాపు 4 వేల మందికిపైగా కార్మికుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఆకలితో అలమటిస్తున్నారు.


హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల నుంచి 15 వేల మందికిపైగా ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. లాక్‌డౌన్‌తో వారు స్వగ్రామాలకు చేరుకోవటంతో జీవనం కష్టంగా మారింది. ఇక్కడ పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి పనులు కల్పించటంలో అధికారులు విఫలమవుతున్నారు.


కదిరి నియోజకవర్గం నుంచి 15 వేల మందికిపైగా వలస వెళ్లారు. మరో 2 వేలమందికిపైగా అరబ్‌దేశాలకు వెళ్లారు. లాక్‌డౌన్‌తో వారంతా ఉపాధి కోల్పోయి, తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. వారికి ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో రోజురోజుకీ జీవనం కష్టంగా మారుతోంది.


రాయదుర్గం ప్రాంతంలో గార్మెంట్స్‌ పరిశ్రమలు మూతపడటంతో వాటినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికుల బతుకులు ఇబ్బందికరంగా మారాయి. నియోజకవర్గానికి సరిహద్దు ప్రాంతం బళ్లారి జిల్లా ఉండటంతో 10 వేల మంది దాకా వలస వెళ్లారు. అక్కడ లాక్‌డౌన్‌తో పనుల్లేకపోవడంతో వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. వారి బతుకులు భారంగా మారాయి.


ధర్మవరంతోపాటు యాడికి, ముద్దిరెడ్డిపల్లి, హిందూపురం, తాడిపత్రి, ఉరవకొండ ప్రాంతాల్లో చేనేత రంగాన్ని నమ్ముకుని 30 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రెండు నెలలుగా మగ్గాలు మూలన పడటంతో ఉపాధి కోల్పోయారు. వారి కష్టాలు వర్ణనాతీతం. ఏ పని చూపించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే పరిస్థితులు ఏపాటివో అర్థం చేసుకోవచ్చు.


పనులు కల్పిస్తే ఇక్కడే ఉంటాం:నర్సేగౌడు, ఆర్‌.అనంతపురం (మడకశిర)

లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. అక్కడకు వెళ్తే పనులు దొరకటం కష్టం. స్థానికంగా పనులు కల్పిస్తే ఇక్కడే ఉంటాం. వలస వెళ్లం. రెండేళ్ల క్రితం పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద వదిలి భార్యతో కలిసి బెంగుళూరుకు వలస వెళ్లా. అక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారం. లాక్‌డౌన్‌తో పనులు లేక స్వగ్రామానికి వచ్చాం. గతంలో ఉపాధి పనులకు వెళ్లేటపుడు జాబ్‌కార్డు ఉండేది. వలస వెళ్లటంతో దానిని తొలగించారు. ఉపాధి హామీ పనులు కల్పిస్తే ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు.


బంగారు తాకట్టు పెట్టి బతుకు వెళ్లదీస్తున్నాం:సేవానాయక్‌, పెద్దపల్లి

మూడు నెలలుగా పని దొరకలేదు. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యాం. బంగారం తాకట్టు పెట్టి, కాలం గడిపేస్తున్నాం. బెంగళూరులో ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడిని. నా భార్య అక్కడ నాలుగిళ్లల్లో పనిచేసేది. ఆ వచ్చిన డబ్బుతో నాతో పాటు నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు జీవనం సాగించేవారం. లాక్‌డౌన్‌కు ముందు  స్వగ్రామానికి వచ్చాం. పనులు లేక కుటుంబంలోని 12 మందీ ఇంటికే పరిమితమయ్యాం. ఈ పరిస్థితుల్లో అప్పులిచ్చే వారు లేరు. చేసేదేమీ లేక బంగారం తాకట్టు పెట్టి కడుపు నింపుకుంటున్నాం. ఇక్కడే పనులు కల్పిస్తే వలస వెళ్లం.


కుటుంబ పోషణ భారంగా మారింది:ఎన్‌ నాగరాజు, వాల్మీకి నగర్‌, గుంతకల్లు

ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశా. నాకున్న ఆటోకు బాడుగలు లేక అప్పులు తీర్చేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గుంటూరుకు వలస వెళ్లా. నాతో పాటు మరో 32 మంది అక్కడ మిరపతోటల్లో పనులకు వలస వచ్చారు. కూలీ డబ్బు ఇంకా సగం రావాలి. లాక్‌డౌన్‌ విధించటంతో ఆ డబ్బు ఇప్పించుకోలేక ఇళ్లకు వచ్చేశాం. ఇక్కడకు వచ్చీరాగానే క్వారంటైన్‌కు తరలించారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక్కడ నా తల్లి పాచి పనులకు వెళ్లేది. మేము గుంటూరు నుంచి వచ్చామని తెలిసి, నా తల్లిని పాచిపనులకు రానివ్వలేదు. ప్రభుత్వమే పనులు కల్పించాలి.


ఉందామంటే పనుల్లేవు:నరేష్‌, డ్రైవర్‌, సోమందేపల్లి

నాలుగేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లా. డ్రైవింగ్‌ చేసుకుంటూ నెలకు రూ.20 వేలు సంపాదించేవాడిని. ఖర్చులు పోనూ మిగిలిన రూ.10 వేలు ఇంటికి పంపించేవాడిని. లాక్‌డౌన్‌తో స్వగ్రామానికి వచ్చా. రెండు నెలలుగా పనిలేదు. ఇక్కడ పనుల్లేవ్‌... లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో బెంగళూరుకు వెళ్లినా.... పనులు దొరకవు. దీంతో అక్కడ కూడా పస్తులుండటం తప్పదు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే బతుకు భారమవుతుంది. ఇక్కడే పనులు కల్పిస్తే వలస వెళ్లను.


భయమేస్తోంది:జయరాం, పెయింటర్‌,  కోనాపురం, పెనుకొండ మండలం 

ఐదేళ్లుగా బెంగళూరులో పెయింటింగ్‌ పనులు చేస్తూ రోజుకు రూ.800 సంపాదించేవాడిని రెండు నెలల క్రితం స్వగ్రామమైన కోనాపురానికి వచ్చి, లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండిపోయా. ఇక్కడ పనుల్లేవ్‌. ఆర్థిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా. ఊర్లో ఉపాధి పనులకు వెళ్లలేం. పెనుకొండలో పెయింటింగ్‌ పనులు లేవు. భవిష్యత్‌ను తలచుకుంటే భయమేస్తోంది.


మగ్గాల బంద్‌తో పనుల్లేవ్‌:సురేష్‌, చేనేత కార్మికుడు, మరువపల్లి, రొద్దం మండలం

హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లిలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నా. లాక్‌డౌన్‌తో మగ్గాలు నిలిపివేయటంతో ఇంటికొచ్చా. భార్యాభర్తలు నెలకు రూ.20వేలు వరకు సంపాదన వచ్చేది. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మగ్గాలు బంద్‌ చేశారు. హిందూపురం రెడ్‌జోన్‌ కారణంగా అక్కడికి వెళ్లలేని పరిస్థితి. తీవ్ర ఇబ్బందులతో కాలం వెల్లదీస్తున్నాం. మగ్గాలు తిరిగి ప్రారంభిస్తే ఉపాధి లభిస్తుంది. లేకుంటే పస్తులే.


పూర్తిస్థాయిలో ఉపాధి దొరకట్లేదు:శ్రీనివాసులు, హమాలీ, తాడిపత్రి

గ్రానైట్‌, బండల పాలీష్‌ పరిశ్రమల్లో పనులు దొరకట్లేదు. దీంతో ఉపాధి కరువవుతోంది. పూర్తిస్థాయిలో పనులు ప్రారంభమైనపుడే చేతినిండా పని ఉంటుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కరాటక తదితర రాష్ట్రాలకు గ్రానైట్‌, బండలపాలీష్‌ సరుకు పూర్తిస్థాయిలో ఎగుమతి కావట్లేదు. గతంలో మాదిరి ఎగుమతి అయితే రోజూ ఉపాధి దొరుకుతుంది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆకలి బాధలు తప్పవు.


ఉపాధి కోల్పోయాం:నర్సింహులు, వలస కూలీ, పూలకుంట

బెంగళూరుకు వలస వెళ్లాం. అక్కడ సిమెంటు పనులు చేస్తుండేవాళ్లం. లాక్‌డౌన్‌తో రెండు నెలల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాం. సంపాదించిన సొమ్మంతా రెండు నెలల్లో కుటుంబ పోషణకు ఖర్చయింది. ప్రస్తుతం బతుకుదెరువు కష్టంగా ఉంది. గ్రామాల్లో పనులు లేకపోవటంతో ఒకపూట తిండి కూడా బరువవుతోంది. 


ఉపాధి పనులు లేకపోతే పస్తులుండాల్సిందే:నగేష్‌, వలసకూలీ, కలుగోడు

ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాం. ఇంట్లో మహిళలు ఇళ్ల పనులు, నేను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడిని. తద్వారా వచ్చిన డబ్బతో ఇంటిని నెట్టుకొస్తుండేవారం. రెండు నెలలుగా పనిలేకపోవడంతో ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఉపాధి పనులు కల్పిస్తే.. ఒకపూట తిండైనా దొరుకుతుంది. లేదంటే ఆకలితో చావాల్సిందే.


పని దొరకట్లేదు:జాన్‌, కంబదూరు

మా ఊరిలో పనులు లేకపోవటంతో బెంగుళూరుకు వలస వెళ్లా. అక్కడ హోటల్‌లో పనిచేస్తుండేవాడిని. నాకు వచ్చిన సంపాదనతో తల్లిదండ్రులను పోషిస్తున్నా. లాక్‌డౌన్‌తో హోటల్‌ బంద్‌ కావడంతో ఊరికి వచ్చేశా. ఇక్కడ పని లేదు. ఈ పరిస్థితుల్లో ఇళ్లు గడవటమే కష్టంగా ఉంది. ప్రభుత్వమే ఉపాధి కల్పించాలి.


ఇక్కడే పనులు కల్పించాలి:హనుమంతరాయుడు, కరిగానపల్లి గ్రామం, కుందుర్పి మండలం. 

ఉపాధి కోసం పదేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లా. రోజుకు రూ.500 సంపాదించేవాడిని. కరోనా ప్రభావంతో స్వగ్రామానికి వచ్చా. ఇక్కడ పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. కుటుంబపోషణకు అప్పులు చేశా. ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఇక్కడ అధికారులు పనులు కల్పిస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నా.

Updated Date - 2020-05-24T08:51:01+05:30 IST