ఈ ఇద్దరిలో ఆర్కే వారసులు ఎవరు..!?

ABN , First Publish Date - 2021-10-17T08:08:34+05:30 IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) సాధారణ కార్యకర్త నుంచి పోలిట్‌బ్యూరో సభ్యునివరకు ఎదిగారు...

ఈ ఇద్దరిలో ఆర్కే వారసులు ఎవరు..!?

  • సుధాకరా.. ? పద్మక్కా..?
  • ఏవోబీ సారథిపై చర్చ


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో రాజకీయ వ్యూహకర్తగా పేరొందిన అక్కిరాజు హరగోపాల్‌ (ఆర్కే) సాధారణ కార్యకర్త నుంచి పోలిట్‌బ్యూరో సభ్యునివరకు ఎదిగారు. నల్లమల అటవీప్రాంతంలో గెరిల్లా జోన్‌ల ఏర్పాటు నుంచి ఆంధ్రా-ఒడిసా సరిహద్దులో (ఏవోబీ)కటాప్‌ ఏరియాల వరకు తన వ్యూహాలను అమలు చేశారు. మావోయిస్టు పార్టీ తరపున చర్చల ప్రతినిధిగా ఎంత సుపరిచితులో,  అది తీసుకొచ్చిన కవరేజీ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏఓబీకి తరలివెళ్లి అక్కడ ఆర్కే మార్క్‌ రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. నల్లమల, దండకారణ్యం, జంగల్‌ మహాల్‌తో పోటీపడుతూ ఏఓబీ పరిధిలో మావోయిస్టు పార్టీ నిర్మాణం, విస్తరణ, దాడుల వ్యూహాలను అమలు చేశారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రామగూడ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడినా, తన కుమారుడు మున్నాను కోల్పోయినా.. మరో జోన్‌కు వెళ్లకుండా ఏవోబీ కేంద్రంగానే పనిచేస్తూ తన అంకుఠిత దీక్షతను చాటిచెప్పారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఇప్పుడు ఆర్కే మరణంతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఆర్కే స్థానాన్ని ఎవరు భర్తీచేస్తారు? ఏవోబీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరు? అన్న చర్చ సాగుతోంది. ఈ అంశంపై పోలీసువర్గాలు కూడా ఒకింత ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రా-ఒడిసా సరిహద్దు స్పెషల్‌ జోన ల్‌ (ఏవోబీ) కమిటీకి గణేశ్‌ నాయకత్వం వహిస్తున్నారు. 2004లో ఏపీ ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల్లో గణేశ్‌ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నట్లు తెలిసింది. గణేశ్‌ కార్యదర్శిగా ఉండగానే కేంద్ర కమిటీ నుంచి ఆర్కే పర్యవేక్షణ ఉంది. గణేశ్‌ కన్నా ముందు ఏవోబీకి  పద్మక్క కార్యదర్శిగా వ్యవహరించారు. 2016లో రామ్‌గూడ ఎన్‌కౌంటర్‌ జరిగే నాటికి ఆమె కార్యదర్శి. అయితే, ఆ తర్వాత పద్మక్కను ఓడిసా కమిటీ బాధ్యతలకు పంపించి గణేష్‌ను నియమించారు. 


మిలిటరీ వ్యూహకర్తను తెస్తారా..!?

ఏవోబీ ఉద్యమంపై బాగా పట్టున్న మరో వ్యక్తి సుధాకర్‌. ఆయన కేంద్ర కమిటీ సభ్యులు. పొలిట్‌బ్యూరోలోనూ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ తరపున ఛత్తీస్‌గఢ్‌-ఒడిసా కమిటీతోపాటు మిలిటరీ కమిషన్‌ వ్యవహారాల్లో పనిచేస్తున్నారని సమాచారం. ఏపీ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సుధాక ర్‌ కూడా ఒక ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన ఎలా ఉంటారో చర్చల సమయంలో మీడియా ద్వారా వె ల్లడికావడంతో దండకారణ్యానికి మార్చి.. ఆర్కేను ఏవోబీ ఉద్యమానికి బదిలీ చేశారు. ఆ తర్వాత సుధాకర్‌ ఉనికిపై ఎలాంటి సమాచారం లేదు. పలువురు కేంద్ర కమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయినా, అరెస్ట్‌ అయిన సందర్భంలోనూ సుధాకర్‌ ఎక్కడున్నారనే ప్రస్తావన వచ్చేది. ఆయన తాజా కదలికలను కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది.


బెంగాల్‌లో ఉన్నారని కొందరు, ఈశాన్య రాష్ట్రాల్లో మరి కొందరు చెప్పారుకానీ అంతకు మించిన సమాచారం ఇవ్వలేకపోయారు. 2017లో కోరాపుట్‌ ఏరియాలో పోలీసులు చుట్టుముట్టారని, త్రుటిలో తప్పించుకున్నారన్న సమాచారం ఒక్కటే ఉంది. అయితే, ప్రస్తుతం గత రెండేళ్లుగా ఆయన దండకారణ్యంలోనే ఉన్నారని స్పష్టమైంది. నాయకత్వ మార్పు జరిగి గణపతి స్థానంలో నంబాల కేశవరావు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాక సుధాకర్‌ను డీకేకు తీసుకొచ్చారు. ఆయన మిలటరీ కమిషన్‌లో కీలక బాధ్యతలు చూస్తున్నారని తెలిసింది. మావోయిస్టు పార్టీకి దండకారణ్యంతోపాటు ఏవోబీ కూడా కీలకమైనది. ఆర్కే మరణంతో ఏవోబీలో పార్టీపై తప్పక ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీన్ని కొంతయిన తగ్గించుకునేందుకు సుధాకర్‌కే కేంద్ర కమిటీ నుంచి ఏవోబీ పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారని తెలుస్తోంది. 1998 నుంచి 2004 వరకు ఆయనకు ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపధ్యంలో ఆర్కే స్థానాన్ని సుధాకర్‌తో భర్తీచేస్తారని చెబుతున్నారు.


మావోయిస్టు ఏరివేత వ్యవహారాలను సుదీర్ఘకాలం నుంచి పరిశీలిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆర్కే వ్యూహాలు చెబుతారు. కిందిస్థాయి కమిటీలు, వారి స్క్వాడ్‌లు వాటిని అమలు చేస్తాయి. ఇప్పుడూ ఆ స్థాయి నాయకుడినే కేంద్ర కమిటీ తరపున ఏవోబీకి పంపిస్తారని అంచనా వేస్తున్నాం. ఇప్పటికే ఏవోబీలో వారి పాత్ర చాలా వరకు తగ్గింది. సరిగ్గా 100 మంది కూడా లేరని సమాచారం. ఈ పరిస్థితుల్లో కాస్త ఈ ప్రాంతంపై పట్టున్న సుధాకర్‌నే పంపిస్తారని అంచనావేస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు. గణేశ్‌, పద్మక్కలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగానే ఉన్నారు. వీరిలో సుధాక ర్‌ సీనియర్‌. పొలిట్‌బ్యూరో సభ్యులు. ఏవోబీ పరిధిలో ప్రత్యేకించి మల్కన్‌గిరి, కోరాపుట్‌, విశాఖ, విజయనగరం, అటు ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలపై ఆయనకు బాగా అవగాహన ఉందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. 



Updated Date - 2021-10-17T08:08:34+05:30 IST